Nara Lokesh: భైరవానితిప్ప ప్రారంభించింది టీడీపీ.. పూర్తి చేసేదీ టీడీపీనే: లోకేశ్
ABN , Publish Date - Nov 08 , 2025 | 01:55 PM
భక్త కనకదాస జయంతి సందర్భంగా మంత్రి లోకేష్ శుభాకాంక్షలు తెలిపారు. సామాజిక తత్వవేత్తగా, స్వరకర్తగా భక్త కనకదాస సమాజ చైతన్యానికి ఎంతో కృషి చేశారని కొనియాడారు. తన కీర్తనలు, రచనలతో ఆధ్యాత్మిక విలువలు పెంపొందించారని అన్నారు. ఆ మహానీయుని జయంతిని రాష్ట్ర పండుగగా జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు.
అనంతపురం, నవంబర్ 8: భైరవానితిప్ప ప్రారంభించింది టీడీపీయేనని.. పూర్తి చేసేదీ టీడీపీనేనని ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. భక్త కనకదాస జయంతి (Kanakadasa Jayanthi) సందర్భంగా అనంతపురం జిల్లా కల్యాణదుర్గంలో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి లోకేశ్ ముఖ్య అతిథిగా హాజరై ఆయన కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. భక్త కనకదాస జయంతి సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. సామాజిక తత్వవేత్తగా, స్వరకర్తగా భక్త కనకదాస సమాజ చైతన్యానికి ఎంతో కృషి చేశారని కొనియాడారు.
తన కీర్తనలు, రచనలతో ఆధ్యాత్మిక విలువలు పెంపొందించారని లోకేష్ చెప్పారు. ఆ మహానీయుని 111వ జయంతిని రాష్ట్ర పండుగగా జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. భగవాన్ కృష్ణుడిని కూడా కనకదాసు తన వైపు తిప్పుకున్నారని కొనియాడారు. అహంకారం ఎప్పుడు తగ్గుతుందో ఆరోజే మోక్షం కలుగుతుందని కనకదాస చెప్పేవారని గుర్తు చేశారు. కల్యాణదుర్గంలో రాష్ట్రస్థాయి భక్త కనకదాస జయంతిలో పాల్గొనడం, ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు.
ఆర్డీటీకి త్వరలోనే ఎఫ్ సీఆర్ఏ రెన్యూవల్ చేయిస్తున్నామని మంత్రి లోకేష్ (Nara Lokesh) తెలిపారు. ఆర్డీటీ సంస్థకు మరింత ప్రోత్సాహం అందిస్తామని హామీ ఇచ్చారు. ఉమ్మడి జిల్లాకు తెలుగుదేశం పార్టీకి అండగా ఉంటుందని చెప్పారు. తమ తాత, మామయ్యలను గెలిపించి అసెంబ్లీకి పంపారని గుర్తుచేశారు. ఈ నేలకు తాము ఎంత చేసినా తక్కువే అని చెప్పారు. జీవితాంతం జిల్లా ప్రజలకు రుణపడి ఉంటామన్నారు. కురుబలు ఎప్పటికీ తెలుగుదేశం పార్టీ వైపే ఉంటారని ధీమా వ్యక్తం చేశారు. కురుబలకు కార్పొరేషన్ ఏర్పాటు చేసి రూ.300కోట్లు ఇచ్చామన్నారు. కురుబలకు రాజకీయంగా, ఆర్థికంగా స్వాతంత్రం తెచ్చింది టీడీపీనేనని చెప్పారు.
2019 నుంచి 24 వరకు చీకటి రోజులు చూశామని మంత్రి లోకేష్ విమర్శించారు. అనేక మంది బీసీలపై దాడులు, హత్యలు చేశారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అందుకే బీసీలు 94 శాతం ఓట్లు వేసి టీడీపీని అధికారంలోకి తీసుకొచ్చారని చెప్పారు. భక్త కనకదాసుకు ఆలయాలు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. పూజారులకు గౌరవ వేతనం కూడా ఇస్తామన్నారు. వచ్చే 12నెలల్లో కురుబ భవనాలన్నీ పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. తనకు సోదర సమానమైన పవన్ కల్యాణ్ తో మాట్లాడి కురుబలకు న్యాయం చేస్తామన్నారు. మంత్రి సవిత తనతో పోట్లాడుతుంటారని.. బీపీ బిల్లలు వేసుకోమని చెప్పానన్నారు. ఆమె.. శాఖా పరంగా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారని చెప్పారు.
నవంబర్ 8న భక్త కనకదాసు జయంతిని రాష్ట్ర పండుగగా కూటమి ప్రభుత్వం నిర్వహిస్తోంది. కర్ణాటక రాష్ట్రం బాడా గ్రామంలో 1509లో జన్మించిన భక్త కనకదాస అసలు పేరు తిమ్మప్ప నాయకుడు. చిన్నతనం నుంచే శ్రీకృష్ణుడికి పరమ భక్తుడు. సాధారణ ప్రజలకూ అర్థమయ్యేలా ఎన్నో కీర్తనలు, గ్రంథాలను రాశారు. తన జీవితాన్ని శ్రీకృష్ణ పరమాత్మ సేవకు వినియోగించారు. ఈయన జయంతిని సెలవుదినంగా ప్రకటించి కర్ణాటక ప్రభుత్వం పండుగలా నిర్వహిస్తుంది. కురబలు ఎక్కువగా ఉన్న మన రాష్ట్రంలోనూ వేడుకలు వైభవంగా నిర్వహిస్తారు.
ఇవి కూడా చదవండి:
అనుకున్న సమయానికే అమరావతికి క్వాంటమ్ కంప్యూటర్: చంద్రబాబు
ఇంట్లో ఎవరూ లేని సమయంలో వివాహిత ఎంత పని చేసిందంటే..