Share News

Minister Atchannaidu: తాడేపల్లి దొంగల ముఠా బిగ్‌బాస్‌ ఎవరో తెలిసింది

ABN , Publish Date - Jul 22 , 2025 | 05:02 AM

మద్యం ముడుపుల్లో బిగ్‌బాస్‌ ఎవరో ప్రజలకు తెలిసిపోయిందని, తాడేపల్లి ప్యాలెస్‌ దొంగల ముఠా నాయకుడి గుట్టును సిట్‌ రట్టు చేసిందని వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు.

Minister Atchannaidu: తాడేపల్లి దొంగల ముఠా బిగ్‌బాస్‌ ఎవరో తెలిసింది

  • పనిచేసే ప్రభుత్వానికి ప్రజలు మద్దతివ్వాలి: అచ్చెన్నాయుడు

పెందుర్తి (విశాఖపట్నం), కొత్తవలస, జూలై 21(ఆంధ్రజ్యోతి): మద్యం ముడుపుల్లో బిగ్‌బాస్‌ ఎవరో ప్రజలకు తెలిసిపోయిందని, తాడేపల్లి ప్యాలెస్‌ దొంగల ముఠా నాయకుడి గుట్టును సిట్‌ రట్టు చేసిందని వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. వైసీపీ పాలనలో మద్యం కుంభకోణాన్ని సిట్‌ అధికారులు ఆధారాలతో సహా వెలికితీశారన్నారు. విశాఖ జిల్లా పెందుర్తి మండలం గుర్రంపాలెంలో, విజయనగరం జిల్లా కొత్తవలస మండలం మంగళపాలెంలో సోమవారం నిర్వహించిన ‘సుపరిపాలనలో తొలిఅడుగు’ కార్యక్రమాల్లో మంత్రి పాల్గొన్నారు. ఇంటింటికీ వెళ్లి సంక్షేమ పథకాల అమలు తీరును తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పెందుర్తి మండలం గుర్రంపాలెంలో నిర్వహించిన బహిరంగ సభలో అచ్చెన్న మాట్లాడుతూ... ప్రస్తుతం రాష్ట్రంలో చేతల ప్రభుత్వం ఉందని, ప్రజలు వైకుంఠపాళి ఆటలాడకుండా పనిచేసే ప్రభుత్వానికి మద్దతివ్వాలని కోరారు. ఒక్కచాన్స్‌ అంటూ అధికారంలోకొచ్చిన వైసీపీ.. గత ఐదేళ్లలో విధ్వంసం సృష్టించిందని, పారిశ్రామికవేత్తలను భయపెట్టి రాష్ట్రం నుంచి పారిపోయేలా చేసిందని విమర్శించారు. విజనరీ నేత చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండడం వల్లే దెబ్బతిన్న వ్యవస్థలను, కుదేలైన ఆర్థిక స్థితిని గాడిన పెడుతున్నారన్నారు.


అలా ఎవరైనా అంటే.. చెంప చెళ్లుమనిపించండి..

ఎన్నికల ముందు ఇచ్చిన హామీలేవీ కూటమి ప్రభుత్వం నెరవేర్చలేదంటూ ఏ నాయకుడైనా గ్రామాలకు వచ్చి తప్పుడు ప్రచారం చేస్తే వాళ్ల చెంప చెళ్లుమనిపించాలని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. ‘సుపరిపాలనలో తొలిఅడుగు’లో భాగంగా విజయనగరం జిల్లా కొత్తవలస మండలం మంగళపాలెంలో ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి అధ్యక్షతన జరిగిన సభలో ఆయన మాట్లాడారు. మాజీ సీఎం జగన్‌లాంటి భూతాన్ని మళ్లీ రానీయొద్దని, ఈసారి ఆ భూతాన్ని 100 అడుగులు గొయ్యితీసి కప్పేయాలని పిలుపునిచ్చారు. ఆ భూతం మళ్లీ వస్తే రాష్ట్ర ప్రజలే మరోసారి నష్టపోతారనే విషయం గుర్తుంచుకోవాలన్నారు.

Updated Date - Jul 22 , 2025 | 05:03 AM