Share News

Minister Atchannaidu: శ్రీకాకుళంలో కేంద్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం పెట్టండి

ABN , Publish Date - Jul 09 , 2025 | 07:37 AM

విభజన చట్ట ప్రకారం శ్రీకాకుళం జిల్లాలో కేంద్ర వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయండి. అలాగే గుంటూరులో మిర్చి బోర్డు, చిత్తూరులో మామిడి బోర్డు, శ్రీకాకుళంలో జీడిపప్పు బోర్డు ఏర్పాటు చేయండి అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు కేంద్రాన్ని కోరారు.

Minister Atchannaidu: శ్రీకాకుళంలో కేంద్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం పెట్టండి

  • తోతాపురి మద్దతు 130 కోట్లు సాయం ఇవ్వండి

  • కేంద్రమంత్రి చౌహాన్‌తో భేటీలో మంత్రి అచ్చెన్న విజ్ఞప్తి

అమరావతి, న్యూఢిల్లీ, జూలై 8(ఆంధ్రజ్యోతి): ‘విభజన చట్ట ప్రకారం శ్రీకాకుళం జిల్లాలో కేంద్ర వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయండి. అలాగే గుంటూరులో మిర్చి బోర్డు, చిత్తూరులో మామిడి బోర్డు, శ్రీకాకుళంలో జీడిపప్పు బోర్డు ఏర్పాటు చేయండి’ అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు కేంద్రాన్ని కోరారు. మంగళవారం న్యూఢిల్లీలో కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడుతో కలసి, కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ను మంత్రి అచ్చెన్నాయుడు కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో రైతు సమస్యలపై కేంద్ర మంత్రితో చర్చించారు. మామిడి రైతులు ఎదుర్కొంటున్న సమస్యను వివరించారు. ‘తోతాపురికి కనీస మద్దతు ధర కిలో రూ.12గా నిర్ణయించాం. ఇందులో కంపెనీలు రూ.8 ఇస్తే... ప్రభుత్వం కిలోకి రూ.4 భరిస్తోంది. దీనికి గాను రూ.260 కోట్లు ఖర్చవుతోంది. ఈ మొత్తంలో రూ.130 కోట్లు ధర లోటు చెల్లింపు కింద కేంద్రం సాయం చేయాలి. ఉత్తర కోస్తా, రాయలసీమలో వెనుకబడిన 8 జిల్లాల్లో ఉద్యాన రైతులకు మైక్రో ఇరిగేషన్‌ పథకం సబ్సిడీ పెంచాలి. బుందేల్‌ఖండ్‌ తరహాలో ఏపీకి అదనపు సాయం చేయాలి’ అనికోరారు. దీనిపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారు. కాగా. శ్రీకాకుళం జిల్లాలో మత్స్యరంగ అభివృద్ధికి మరింత తోడ్పాటు, ప్రోత్సాహం అందించాలని కేంద్ర మత్స్య, పశుసంవర్ధక, పాడి పరిశ్రమల శాఖ మంత్రి రాజీవ్‌ రంజన్‌ సింగ్‌ (లాలన్‌ సింగ్‌)ని అచ్చెన్నాయుడు కోరారు. విజయనగరం జిల్లా గరివిడిలో వెటర్నరీ కాలేజీకి గుర్తింపు కల్పించాలని విజ్ఞప్తి చేశారు.

Updated Date - Jul 09 , 2025 | 07:38 AM