Share News

SIT Reveals: ముడుపులు మూలవిరాట్‌కే

ABN , Publish Date - Jul 21 , 2025 | 05:30 AM

దేశంలోనే అతి పెద్ద మద్యం కుంభకోణం కేసులో.. ముడుపుల అంతిమ లబ్ధిదారు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డేనని సిట్‌ తేల్చింది.

SIT Reveals: ముడుపులు మూలవిరాట్‌కే

  • ప్రతి నెలా రూ.50-60 కోట్లు జగన్‌కు

  • కసిరెడ్డి ఆధ్యర్యంలో 3,500 కోట్ల వరకు మద్యం కమీషన్లు వసూలు

  • కసిరెడ్డి నుంచి సాయిరెడ్డి, మిథున్‌రెడ్డి, గోవిందప్పలకు!

  • వారి ద్వారా నాటి ముఖ్యమంత్రి జగన్‌కు చేరవేత

  • మద్యం స్కాం చార్జిషీటులో బట్టబయలు చేసిన సిట్‌

  • డిస్టిలరీల నుంచి తొలుత 12శాతం కమీషన్‌కు ఒప్పందం

  • తర్వాత 20కి పెంపు.. మాట వినకపోతే బెదిరింపులు

  • ముడుపుల మళ్లింపునకు రకరకాల పద్ధతులు

  • డిస్టిలరీల ఖాతాల నుంచి బంగారం వ్యాపారులకు బదిలీ

  • తర్వాత బంగారం కొన్నట్లుగా జీఎ్‌సటీ ఇన్‌వాయి్‌సలు

  • నిందితులకు బంగారం రూపంలో కమీషన్లు

  • రూ.100-120 కోట్ల అనుమానాస్పద లావాదేవీలు

  • హవాలా ద్వారా షెల్‌ కంపెనీలకూ సొమ్ముల మళ్లింపు

  • సిండికేట్‌ బంధుమిత్రుల కంపెనీల నుంచీ డబ్బుల బదిలీ

  • మున్ముందు వెలుగులోకి మరికొందరి పాత్ర: సిట్‌

జగన్‌ ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం స్కాం ముడుపుల్లో సింహభాగం మూలవిరాట్‌కే చేరినట్టు బట్టబయలైంది. ప్రతి నెలా రూ.50 నుంచి రూ.60 కోట్ల దాకా డిస్టిలరీల నుంచి వసూలు చేసిన సొమ్మును నిందితులు అప్పటి సీఎం వైఎస్‌ జగన్‌కు చేర్చారని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) తేల్చింది. డిస్టిలరీలు, సరఫరాదారుల నుంచి ఎంతెంత ముడుపులను కసిరెడ్డి బృందం వసూలు చేసింది.. ఆ మొత్తాన్ని ఎవరెవరికి ఎలా మళ్లించిందో సమగ్ర వివరాలను ఏసీబీ కోర్టుకు సమర్పించిన చార్జిషీటులో విపులంగా తెలియజేసింది.

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

దేశంలోనే అతి పెద్ద మద్యం కుంభకోణం కేసులో.. ముడుపుల అంతిమ లబ్ధిదారు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డేనని సిట్‌ తేల్చింది. ఏ కంపెనీ ఎంతెంత కమీషన్‌ ఇచ్చింది.. ఎవరికి ఎక్కడ చెల్లించింది.. ఎవరు నిర్ణయించారో కూడా వెల్లడించింది. ముడుపులు ఏయే రూపాల్లో అందాయో కూడా కోర్టుకు సమర్పించిన చార్జిషీటులో తెలియజేసింది. డిస్టిలరీలను భయపెట్టి మొదట 12 శాతం ముడుపులకు ఒప్పించారు. ఆ తర్వాత 20 శాతానికి పెంచేశారు. ఆ మొత్తం డిస్టిలరీలు, సరఫరాదారుల నుంచి కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి (ఏ-1)కి అందేది. అతడి నుంచి నాటి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి(ఏ-5), మరో ఎంపీ మిథున్‌రెడ్డి (ఏ-4), భారతి సిమెంట్స్‌ డైరెక్టర్‌ బాలాజీ గోవిందప్ప(ఏ-33)లకు వచ్చేది. ఆ ముడుపులను ఈ ముగ్గురూ అప్పటి సీఎం జగన్‌కు ముట్టజెప్పినట్లు సిట్‌ స్పష్టం చేసింది. నెలకు రూ.50-60 కోట్ల చొప్పున ఆయనకు అందాయని.. ఎన్నికల ఖర్చుకూ రూ.250-300 కోట్లు పంపిణీ చేశారని.. ఇతర నిందితులూ వాటాలు పంచుకున్నారని పేర్కొంది. మొత్తం రూ.3,500 కోట్లు ముడుపుల రూపంలో వసూలు చేశారు. అందుకు పకడ్బందీ ప్రణాళికలు వేశారు. డబ్బులు ఎక్కడెక్కడికి వెళ్లాయో దర్యాప్తు సంస్థలకు అంతుచిక్కకుండా వివిధ మార్గాల్లో మళ్లించారని తెలిపింది.


చార్జిషీటులో ముఖ్యాంశాలివీ..

2019 ద్వితీయార్థంలో సజ్జల శ్రీధర్‌రెడ్డి (ఏ-6) హైదరాబాద్‌లోని పార్క్‌ హయత్‌ హోటల్లో డిస్టిలరీల యజమానులతో సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో రోజువారీ మద్యం అమ్మకాలకు సంబంధించి ఇండెంట్‌ ప్లాన్‌ పెంచుకునేందుకు సహకరించాలన్నారు. తాము చెప్పినంత కమీషన్‌ ఇవ్వడానికి అంగీకరించకపోతే ఒక్కరికి కూడా మద్యం సరఫరా ఆర్డర్‌ ఇవ్వబోమని భయపెట్టారు. అప్పట్లో ప్రతి నెలా 27-30 లక్షల మద్యం కేసులు, 7-10 లక్షల బీరు కేసులను విక్రయించారు. మొదట్లో సరఫరాదారులు ముడుపులు ఎంతెంత ఇవ్వాలో ఏ-1 రాజశేఖర్‌రెడ్డి, ఏ-8 సుమిత్‌, ఏ-2 ఎండీ వాసుదేవరెడ్డి, ఏ-6 సజ్జల శ్రీధర్‌రెడ్డి నిర్ణయించారు. రెండో దఫా వాసుదేవరెడ్డి విజయవాడకు చెందిన సరఫరాదారులు, డిస్టిలరీలతో ప్రకాశ్‌/సుమిత్‌ సహకారంతో హైదరాబాద్‌లో సమన్వయం చేసుకుని ముడుపుల వ్యవహారాలను చర్చించారు. ఈ బేరసారాల్లో బేసిక్‌ ధరను పరిగణనలోకి తీసుకున్నారు. సదరన్‌ బ్లూ, 9 హార్సెస్‌, ఆంధ్రా గోల్డ్‌, హెచ్‌డీ విస్కీ లాంటి చౌక బ్రాండ్‌లకు కేసుకు రూ.150గా నిర్ణయించారు. దారు హౌస్‌, రాయల్‌ ప్యాలెస్‌, బ్రిలియంట్‌ బ్లెండ్‌లకు కేసుకు రూ.200 ఇచ్చేందుకు ఒప్పందం చేసుకున్నారు. మ్యాన్షన్‌ హౌస్‌, రాయల్‌స్టాగ్‌ కేసుకు రూ.350, టీచర్స్‌, 100 పైపర్స్‌ లాంటి పెద్ద బ్రాండ్లకు కేసుకు రూ.600గా నిర్ణయించారు.


  • 2019-24 మధ్య సేల్స్‌ డేటాను పరిశీలిస్తే మద్యం అక్రమార్కులు సుమారు రూ.3,500 కోట్ల వరకు కూడబెట్టుకున్నట్లు అర్థమవుతోంది.

  • మద్యం ముడుపుల వసూలుకు పకడ్బందీ ప్రణాళికలు వేశారు. రాష్ట్ర బేవరేజెన్‌ కార్పొరేషన్‌ (ఏపీఎస్‌బీసీఎల్‌) కార్యాలయం నుంచి అమ్మకాల వివరాలు రియల్‌టైం విధానంలో ఏ-1 టీంకు అందేలా ఏర్పాట్లు చేసుకున్నారు. విజయసాయిరెడ్డి సిఫారసుతో ఎంఐఎస్‌ సెక్షన్‌లో డేటా ఎంట్రీ ఆపరేటర్‌ ఎ.అనూషను అప్పటి ఎక్సైజ్‌ శాఖ ముఖ్యకార్యదర్శి రజత్‌ భార్గవ ప్రత్యేక మెమో ద్వారా నియమించారు. ఆమె నేరుగా వాసుదేవరెడ్డికి రిపోర్ట్‌ చేయాలి. ఎంఐఎస్‌ సెక్షన్‌ నుంచి సేల్స్‌ డేటాను ప్రతి రోజూ సేకరించి దానిని కసిరెడ్డి టీంలోని సైఫ్‌ అనే వ్యక్తి మొబైల్‌ నంబర్‌ 9182192645కు పంపించారు. సరఫరాదారుల చెల్లింపుల వివరాలు, మద్యం, బీరు సరఫరదారుల వారీగా విక్రయించిన కేసుల వివరాలు అనూష ఈమెయిల్స్‌ ద్వారా వెల్లడయ్యాయి.

  • సేల్స్‌ డేటా ఆధారంగా డిస్టిలరీ, సరఫరాదారులు చెల్లించాల్సిన ముడుపుల వివరాలను సైఫ్‌ టేబుల్స్‌ వేసి కసిరెడ్డికి పంపేవాడు. అవి సుమిత్‌కు, ఆ తర్వాత చాణక్య/ప్రకాశ్‌కు కూడా అందేవి. విక్రయించిన మద్యం డబ్బులు బేవరేజెన్‌ కార్పొరేషన్‌ నంచి డిస్టిలరీల ఖాతాల్లో పడగానే.. సుమిత్‌/ప్రకాశ్‌ వాటి యజమానులకు ఫోన్‌ చేసి ముడుపులు చెల్లించాలని డిమాండ్‌ చేసేవారు. వారి అనుచరులు ఏ-9 కిరణ్‌కుమార్‌రెడ్డి, కైఫ్‌, దిలీప్‌, సందీప్‌, ఖురేషీ, చెస్తి, మల్లేశ్‌.. నానక్‌రామగూడ, జూబ్లీహిల్స్‌ తదిత ప్రాంతాల్లో వీపీఎన్‌/ఇంటర్నేషనల్‌ ఫోన్‌ నంబర్లతో వాట్సాప్‌, సిగ్నల్‌ నెట్‌వర్క్‌ ద్వారా డిస్టిలరీలు, సరఫరాదారులను సంప్రదించేవారు. మద్యం ముడుపులు ఎక్కడ చెల్లించాలో నిర్దిష్ట ప్రాంతాలను ఎంపిక చేసుకుని.. అక్కడ వసూలు చేసిన సొమ్మును కసిరెడ్డికి చేర్చేవారు.


  • వచ్చిన వసూళ్ల ఆధారంగా ఆర్డర్‌ ఆఫ్‌ సప్లయ్‌, ఇండెంట్‌ ప్లాన్‌ రూపొందించి దానిని సత్యప్రసాద్‌కు అప్పగించేవారు. ఈ ఇండెంట్‌ ఆధారంగా ఆర్డర్‌ ఫర్‌ సప్లయ్‌ను డిపో మేనేజర్లకు పంపించి పకడ్బందీగా అమలు చేయాలని సూచించేవారు. దాని కోసం సత్యప్రసాద్‌ డిపో మేనేజర్లతో వాట్సాప్‌ కాన్ఫరెన్స్‌ కాల్స్‌ నిర్వహించేవారు. ఇండెంట్‌ ప్రకారం చేస్తున్నారో లేదో పర్యవేక్షించేవారు. ప్రణాళిక పకడ్బందీగా అమలు చేయడానికి వాసుదేవరెడ్డి, విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డి, కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి, సజ్జల శ్రీధర్‌రెడ్డి క్రమంగా తప్పకుండా సమావేశమయ్యేవారు.

  • మద్యం ముడుపుల వసూళ్లను పర్యవేక్షించేందుకు తొలుత సుమిత్‌ను నియోగించారు. తర్వాత అతడి స్థానంలో చాణక్య/చాను/ప్రకాశ్‌ను రంగంలోకి దించారు. ప్రకాశ్‌, అతడి అనుచరులు డిస్టలరీలు, సరఫరాదారులతో మాట్లాడేందుకు వీపీఎన్‌/అంతర్జాతీయ ఫోన్‌ నంబర్లను వినియోగించారు. కార్పొరేషన్‌ నుంచి చెల్లింపులు జరిగిన రెండ్రోజుల్లోగా ముడుపులు చెల్లించాలని ఫోన్లు చేసేవారు. అలా ముడుపులిచ్చిన కంపెనీలకు మాత్రమే మద్యం ఆర్డర్లు ఉంటాయి. ఏపీలో విశాఖ, పీఎంకే, ఎస్‌పీవై, ఎంబీడీఎల్‌ డిస్టలరీల నుంచి యంత్రసామగ్రి, స్థలాలు సబ్‌లీజుకు తీసుకున్న ఆదాన్‌, లీలా కంపెనీలకు అధిక ఆర్డర్లు ఇచ్చారు. నిబంధనలను తుంగలో తొక్కారు. ఇందుకోసం మార్కెట్‌లో పాపులర్‌ బ్రాండ్లు విడుదల కాకుండా అడ్డుకున్నారు. తమ బ్రాండ్లు మూతపడడంతో పాపులర్‌ బ్రాండ్ల కంపెనీలు ఇతర రాష్ట్రాల్లో విక్రయించుకోవాల్సి వచ్చింది. ఆదాన్‌ నుంచి సుప్రీం బ్లెండ్‌ విస్కీ, బ్రిలియంట్‌ బ్లెండ్‌ విస్కీ, దారూహౌస్‌ బ్రాందీ, తిలక్‌నగర్‌ డిస్టిలరీ నుంచి సరఫరా అయిన మ్యాన్షన్‌ హౌస్‌ బ్రాండ్‌ అమ్మకాలు విపరీతంగా ఉన్నాయు. గతంలో ప్రముఖమైన బ్రాండ్లు పెర్నాడ్‌ రికార్డ్‌(సీగ్రామ్స్‌), మెక్‌డోవెల్‌ తదితర బ్రాండ్లు అమ్మకాలు తగ్గుముఖం పట్టాయి. పాపులర్‌ బ్రాండ్లు మార్కెట్‌లో అందుబాటులో లేకపోవడంతో వినియోగదారులు ఆందోళనలకు దిగారు. అయినప్పటికీ అధికారులు, ప్రభుత్వం, ఈ కేసులో నిందితులు, రాజకీయ నేతలు ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. మద్యం ముడుపులు ఇచ్చిన బ్రాండ్లకే పెద్దపీట వేసి.. వినియోగదారులకు నాసిరకం మద్యాన్ని విక్రయించారు.


ఎవరెవరి ద్వారానో మళ్లింపులు..

బేవరేజెస్‌ కార్పొరేషన్‌ నుంచి డిస్టిలరీలకు నిధులు జమ కాగానే మద్యం డిస్టిలరీల నుంచి కమీషన్లు వసూలు చేసేందుకు పలు విధానాలు అవలంబించారు. వారి ఖాతాల నుంచి బులియన్‌ ట్రేడర్స్‌, బంగారం వ్యాపారులకు బదిలీ చేసి.. ఆ తర్వాత బంగారం కొనుగోలు జీఎస్‌టీల ఇన్‌వాయి్‌సతో ముడుపులను కసిరెడ్డికి, చాణక్యకు బదిలీ చేశారు. ఈ సందర్భంగా తమ కమీషన్‌ను మినహాయించుకునేవారు. కొన్ని సందర్భాల్లో డిస్టిలరీలు, మద్యం సరఫరాదారులు కూడా బంగారం వ్యాపారులతో కుమ్మక్కై నిందితులకు బంగారం రూపంలో ముడుపులు అందించారు. ఇప్పటి వరకు జరిగిన దర్యాప్తులో.. డిస్టిలరీల బ్యాంకు స్టేట్‌మెంట్లను పరిశీలిస్తే బంగారం వ్యాపారులతో వాటి అనుమానాస్పద లావాదేవీలు రూ.100 నుంచి రూ.120 కోట్ల వరకు బయటపడ్డాయి.


షెల్‌ కంపెనీలకు..

  • ముడుపుల్లో ఇంకొన్ని నిధులను షెల్‌ కంపెనీలకు బదిలీ చేశారు. కొన్ని సార్లు లైనెన్‌ గార్మెంట్స్‌, గోల్డ్‌ కాయిన్స్‌ తదితర వస్తువులను ప్రమోట్‌ చేసే చట్టబద్ధమైన కంపెనీల ఖాతాల్లోనూ జమచేశారు. అయితే వాటి జీఎస్‌టీ వివరాలు, వాహనాల వే బిల్లులను పరిశీలిస్తే.. ఆయా కంపెనీల వాహనాలు సరుకుతో టోల్‌గేట్లు దాటినట్లు ఆధారాలే లేవు.

  • లిక్కర్‌ సిండికేట్‌ సభ్యుల బంధుమిత్రులకు చెందిన కొన్ని రియల్‌ ఎస్టే ట్‌ కంపెనీలు, వ్యాపార సంస్థల ఖా తాల ద్వారా కూడా ముడుపులు మళ్లించారు. నిధులు ఎటు వెళ్లా యో తెలియకుండా.. దర్యాప్తు సంస్థ లు పసిగట్టకుండా చేసేందుకే ఇలా ంటి చెల్లింపుల ప్రక్రియ చేపట్టారు.

  • ముంబై, ఢిల్లీ, హైదరాబాద్‌తో పాటు యూఏఈ (దుబాయ్‌) తదితర దేశాలకు చెందిన వ్యవస్థీకృత హవాలా నెట్‌వర్క్‌ల ద్వారా కూడా షెల్‌ కంపెనీలకు, నిందితులకు మద్యం ముడుపులు పంపించారు.


ఆర్డర్ల కోసం ముడుపులు

  • ఆర్డర్‌ ఆఫ్‌ సప్లయ్‌ కోసం కమీషన్లు ఇవ్వాలని ఒత్తిడి చేశారని పలువురు డిస్టలరీల యజమానులు దర్యాప్తులో తెలిపారు. ముడుపుల వ్యవహారాలకు సంబంధించి పలు వాట్సాప్‌ సంభాషణలు రకరకాల వ్యక్తుల మధ్య జరిగినట్లు గుర్తించారు. వారి ఫోన్లు సీజ్‌ చేశారు. మద్యం ముడుపులు వసూలు చేసిన పలు ప్రాంతాల ను గుర్తించారు. ముడుపులు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి(ఏ-38)కి, ఆయన అనుచరులకు కూడా అందాయి.

  • మద్య నిషేధం విడతల వారీగా చేపడతామని గత ప్రభుత్వం హామీ ఇచ్చింది. దశల వారీగా మద్యం వినియోగం తగ్గిస్తామని పేర్కొంది. పలు దఫాలు ఆ మేరకు ఉత్తర్వులు కూడా జారీచేశారు. 2019-24 మధ్య కాలంలో మొత్తం రూ.23,838 కోట్ల మద్యం విక్రయాలు జరిగినట్లు బ్యాంకు స్టేట్‌మెంట్ల ద్వారా వెల్లడైంది.


పర్యవేక్షణ కోసం ఫీల్డ్‌ ఆఫీసర్లు..

2020లో ప్రత్యేక ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో (ఎస్‌ఈబీ) ఏర్పాటు చేసినా.. ప్రభుత్వ మద్యం షాపులపై పర్యవేక్షణ బాధ్యతను దానికి అప్పగించలేదు. దాని బదులుగా ఫీల్డ్‌ మానిటరింగ్‌ ఆఫీసర్లు (ఎఫ్‌ఎంవోస్‌) అనే కొత్త వ్యవస్థను తెచ్చి ప్రత్యేక బ్రాండ్లను మాత్రమే షాపుల్లో అమ్మేందుకు కుట్ర పన్నారు. 2019లో బేవరేజెస్‌ కార్పొరేషన్‌ ఎండీ కేపీఎంజీ అనే ప్రైవేట్‌ సలహాదారు సంస్థను నియమించారు. దాని నివేదికల్లో ఒకదానిలో చెప్పిన సూచనలు మరొకదానిలో ఉండకపోవడం, నిందితులకు అనుకూలమైన సూచనలే అమలు చేయడం వెనుక కుట్ర ఉంది. కేపీఎంజీ పాత్రపై ఇంకా దర్యాప్తు జరుగుతోంది.


తల్లి, కుమార్తె పేరుతో 100 కోట్ల ఆస్తులు..

రాజ్‌ కసిరెడ్డి హైదరాబాద్‌ శివారులో 92 ఎకరాలను తల్లి సుభాషిణి, కుమార్తె ఈశాన్వి పేరుతో కొనుగోలు చేశాడు. మాచనపల్లి, షాబాద్‌, దామరపల్లె ప్రాంతాల్లో ఉన్న ఈ భూముల మార్కెట్‌ విలువ రూ.100 కోట్లు కాగా.. రిజిస్ట్రేషన్‌ పత్రాల్లో రూ.30 లక్షలుగా చూపించాడు. గచ్చిబౌలిలో ఈశాన్వి పేరుతో రూ.9 కోట్ల వాణిజ్య స్థలం, కౌశిక్‌ కుమార్‌ అగర్వాల్‌ ఖాతాకు మళ్లించిన కోట్లాది రూపాయలను లిక్కర్‌ ముడుపుల సొమ్ముగానే సిట్‌ భావిస్తోంది. వైజాగ్‌లో కాల్‌ సెంటర్‌ ద్వారా కార్యకలాపాలు, ఇతరత్రా వివరాలు పరిశీలిస్తే మద్యం సొమ్మును ఆస్తుల పెంపునకు వినియోగించినట్లు తేలింది. పలు దేశాలకు తరచూ వెళ్లి వచ్చే కసిరెడ్డి దుబాయ్‌ కేంద్రంగా హవాలా నడిపించారని రుజువు చేసేందుకు సాక్షుల వాంగ్మూలాలను సిట్‌ చార్జిషీటుతో జతచేసింది.


త ఐదేళ్లలో వందల కొద్దీ వెండర్లు, డిస్టలరీలతో జరిగిన లావాదేవీలు విచారణ చేయాలంటే ఎక్కువ సమయం తీసుకుంటుందని సిట్‌ వెల్లడించింది. 111 డిస్టలరీల్లో ప్రధానమైన 40 మేజర్‌ డిస్టలరీల లావాదేవీలను పరిశీలించామని.. 90 శాతం పైగా మద్యం ముడుపులు చేతులు మారినట్లు గుర్తించామని పేర్కొంది. ఇందులో 16 కీలకమైన డిస్టలరీలను పూర్తిగా విచారించింది. మద్యం ముడుపులు షెల్‌ కంపెనీలకు, గోల్డ్‌ మర్చంట్స్‌కు నిధుల బదిలీ, వసూళ్లు చేయడానికి సంబంధించిన డాక్యుమెంటరీ, డిజిటల్‌ ఆధారాలను కూడా చార్జిషీటుకు జతపరచింది.

ఫైళ్లు మాయం..

మద్యం అవుట్‌లెట్లవారీగా చూపించే ఫోర్‌క్యాస్ట్‌ స్టేట్‌మెంట్‌ ఫైల్స్‌ను లిక్కర్‌ ముఠా మాయం చేసినట్లు జమ్ముల రవీంద్ర అనే వ్యక్తి మొబైల్‌ నుంచి ఎఫ్‌ఎ్‌సఎల్‌ నివేదికతో బయటపడినట్లు సిట్‌ పేర్కొంది. ఇక్కడి కంప్యూటర్లలో వివరాలు నిక్షిప్తమై ఉంటే భవిష్యత్‌లో ఇబ్బందులు తప్పవని నిందితులు ముందు జాగ్రత్త పడ్డారు. ఫైళ్లు మాయమైన విషయాన్ని రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి రజత్‌ భార్గవ కూడా తెలిపారు. అయితే విదేశాల్లో ఉండే పింగళి రాజీవ్‌ ప్రతాప్ (ఏ-48) డేటా మొత్తాన్ని అక్కడి సిస్టమ్‌లో భద్రపరచినట్లు తేలింది. కసిరెడ్డి కోట్లాది రూపాయల అక్రమ సొమ్మును దేశం దాటించేసి.. యూఏఈ, జింబాబ్వే, థాయ్‌లాండ్‌ వంటి దేశాల్లో టెక్కర్‌ పేరుతో పలు కంపెనీలు స్థాపించి ఈశ్వర్‌ కిరణ్‌కుమార్‌రెడ్డికి అప్పగించాడు. అతడు దుబాయ్‌లో గోల్డెన్‌ వీసా పొంది అక్కడే స్థిర నివాసం ఏర్పరచుకున్నాడు.


ప్రజాధనం నష్టం.. ప్రజలకు విశ్వాస ద్రోహం..

2019-24 మధ్య జరిగిన రూ.3,500 కోట్ల మద్యం స్కాంతో ప్రజాధనానికి నష్టం వాటిల్లడంతో పాటు ప్రజలకు విశ్వాస ద్రోహం చేసిందని సిట్‌ అభిప్రాయపడింది. ప్రజలెన్నుకున్న ప్రజాప్రతినిధులు వారి నమ్మకాన్ని వమ్ము చేశారని, లిక్కర్‌ వ్యాపారులకు లాభాలు..అధికారులకు ప్రయోజనాలు, ప్రజాప్రతినిధులకు ఓట్లు, వ్యవస్థను నడిపించిన మధ్యవర్తులకు లగ్జరీ జీవితం..కింగ్‌ పిన్‌కు భవిష్యత్‌ పెట్టుబడులు..ఇలా ఎవరికి వారు దోచుకున్నారని పేర్కొంది. ఇప్పటి వరకూ 48 మంది నిందితులు ఉన్నారని, వారిలో 12 మంది అరెస్టయి జైల్లో ఉంటే.. 8 మంది విదేశాల్లో దాక్కున్నారని.. ఇంటర్‌పోల్‌ రెడ్‌ కార్నర్‌ నోటీసు జారీ చేయించి.. తిరిగి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నట్లు సిట్‌ తెలిపింది. మున్ముందు మరికొందరి పాత్ర వెలుగులోకి రావచ్చని తెలిపింది.


ఈ వార్తలు కూడా చదవండి..

రండి.. ఆంధ్రప్రదేశ్‌ను నిర్మించుకుందాం: మంత్రి లోకేష్ పిలుపు

ఈ సమావేశాల్లో అన్ని అంశాలపై చర్చిస్తాం: కిరణ్ రిజిజు

హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం

For More AndhraPradesh News And Telugu News

Updated Date - Jul 21 , 2025 | 05:58 AM