Crores Lost in Rummy Game Shock in AP: ఆన్‌లైన్ రమ్మీలో 1.4 కోట్లు పోయాయ్
ABN , Publish Date - Apr 11 , 2025 | 05:15 AM
ఆన్‌లైన్ రమ్మీ ఆటలో ఒకరు రూ.1.4 కోట్లు కోల్పోయాడు. గేమింగ్ వ్యసనంతో బాధపడుతూ పెద్ద మొత్తంలో డబ్బును పోగొట్టుకున్న ఘటన కలకలం రేపుతోంది

పురుగుమందు తాగి వ్యక్తి ఆత్మహత్యాయత్నం
కొత్తపల్లి, ఏప్రిల్ 10(ఆంధ్రజ్యోతి): ఆన్‌లైన్ రమ్మీ ఆడి లక్ష కాదు రెండు లక్షలు కాదు ఏకంగా రూ.1.4 కోట్లు పోగొట్టుకున్నాడో వ్యక్తి. వాటిలో పొలం అమ్మిన సొమ్మే రూ.1.3 కోట్లు ఉన్నాయి. దీంతో కుటుంబ సభ్యులు తిడతారనే భయంతో తీవ్ర మనస్థాపానికి గురై ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలం పొన్నాడ శివారు రామన్నపాలేనికి చెందిన ఒక వ్యక్తి ఉప్పాడ సెంటర్లో వాహనాల స్పేర్‌పార్టుల వ్యాపారం చేస్తున్నాడు. తండ్రి పేరిట ఉన్న సుమారు 90 సెంట్ల పొలాన్ని రెండేళ్ల క్రితం రూ.1.36 కోట్లకు విక్రయించాడు. ఆ సొమ్ముతో వేరేచోట పొలం కొందామని తండ్రికి చెప్పి ఆ మొత్తాన్ని తన వద్దే ఉంచుకున్నాడు. అయితే భూమి అమ్మకముందే ఆన్‌లైన్ రమ్మీలో లక్షలు పోగొట్టుకున్న ఆ వ్యక్తి పొలం అమ్మిన సొమ్ముతో పాటు తన బ్యాంకు ఖాతాలో ఉన్న మరో రూ.4 లక్షలు కూడా దఫదఫాలుగా మళ్లీ ఆ గేమ్‌లోనే పెట్టి నష్టపోయాడు. ఈ క్రమంలో జీవితంపై విరక్తి పెంచుకున్న అతడు గత మంగళవారం రాత్రి ఎనిమిది గంటల సమయంలో పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు ఏమైందని ప్రశ్నించగా పురుగుల మందు తాగానని చెప్పాడు. దీంతో వెంటనే అతన్ని కాకినాడలోని ఒక ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. కాగా, ఆస్పత్రి సిబ్బంది అందించిన సమాచారం మేరకు వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని కొత్తపల్లి పోలీసులు తెలిపారు. దీనిపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని చెప్పారు.