AP Police: కొడాలి నానిపై లుక్ అవుట్ నోటీసులు
ABN , Publish Date - May 23 , 2025 | 04:55 AM
పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న కొడాలి నానిపై లుక్ అవుట్ నోటీసులు జారీ అయ్యాయి. అమెరికాకు పరారయ్యే అవకాశం ఉండటంతో ఎయిర్‌పోర్టులకు అలర్ట్ పంపారు.

ఎయిర్‌పోర్టులు, ఓడరేవులకు ఆన్‌లైన్‌లో అలర్ట్
ఇప్పటికే మాజీ మంత్రిపై పలు కేసులు
అమెరికాకు పరారు కాకుండా అప్రమత్తం?
గుడివాడ, మే 22(ఆంధ్రజ్యోతి) : పలు కేసుల్లో నిందితునిగా ఉన్న మాజీ మంత్రి కొడాలి నానిపై లుక్ అవుట్ నోటీసులు జారీ అయ్యాయి. ఈ నోటీసులు ఆన్‌లైన్ ద్వారా అన్ని ఎయిర్‌పోర్టులు, ఓడరేవులకు అందాయి. వాస్తవానికి కొడాలి నానికి రాష్ట్రంలో పాస్‌పోర్టు లేదు. రైతు మోషే కేసులో జైలుశిక్ష ఖరారుకావడం, పలు కేసుల్లో నిందితునిగా ఉండటంతో ఆయనకు పాస్‌పోర్టు జారీ కాలేదు. అయితే, హైదరాబాద్ చిరునామాతో పాస్‌పోర్టును పొంది ఉంటారని అనుమానిస్తున్నారు. అమెరికాకుపరారయ్యే అవకాశం ఉందని సందేహిస్తున్నారు. కృష్ణాజిల్లా గుడివాడ పరిధిలో నానిపై ఇప్పటికే పలు కేసులు నమోదయ్యాయి. వలంటీర్లతో బలవంతంగా రాజీనామాలు చేయించడం, ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు, ఎన్నికల కోడ్ ఉల్లంఘన, విశాఖపట్నంలో కేసుకు సంబంధించి నాని ముందస్తు బెయిల్ పొందారు. గుడివాడ మండలం మల్లాయిపాలెం జగనన్న కాలనీకి మెరక పేరుతో రూ.కోట్లు దోపిడి చేసిన వ్యవహారంలో నమోదైన కేసులో నానిపై దర్యాప్తు పురోగతిలో ఉంది.