Share News

కేడీసీసీ బ్యాంకు చైర్మన్‌గా విష్ణువర్ధన్‌ రెడ్డి

ABN , Publish Date - Apr 29 , 2025 | 12:32 AM

రాష్ట్రంలో జిల్లా సహకార బ్యాంకులు, సహకార మార్కెటింగ్‌ సొసైటీల నామినేటెడ్‌ పదవులను సీఎం చంద్రబాబు భర్తీ చేశారు.

కేడీసీసీ బ్యాంకు చైర్మన్‌గా విష్ణువర్ధన్‌ రెడ్డి
ఎదురూరు విష్ణువర్ధన్‌ రెడ్డి

డీసీఎంఎస్‌ చైర్మన్‌గా వై. నాగేశ్వరరావు యాదవ్‌

నామినేటెడ్‌ పోస్టులు భర్తీ చేసిన సీఎం చంద్రబాబు

కర్నూలు, ఏప్రిల్‌ 28 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో జిల్లా సహకార బ్యాంకులు, సహకార మార్కెటింగ్‌ సొసైటీల నామినేటెడ్‌ పదవులను సీఎం చంద్రబాబు భర్తీ చేశారు. అందులో భాగంగానే సోమవారం విడుదల చేసిన నామినేటెడ్‌ పదవుల జాబితాలో జిల్లాకు సముచిత స్థానం దక్కింది. ఉమ్మడి కర్నూలు జిల్లా సహకార బ్యాంకు (కేడీసీసీబీ) చైర్మన్‌గా ఎదురూరు విష్ణువర్ధన్‌ రెడ్డిని ఎంపిక చేశారు. జిల్లా సహకార మార్కెటింగ్‌ సొసైటీ (డీసీఎంఎస్‌) చైర్మన్‌గా వైజీ నాగేశ్వరరావు యాదవ్‌ను ఎంపిక చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. జిల్లాలో టీడీపీ అభివృద్ధికి, ఎన్నికల్లో అభ్యర్థులను గెలుపునకు కృషి చేస్తున్న నాయకులకు నామినేటెడ్‌ పదవుల ఎంపికలో ప్రాధాన్యం ఇచ్చారు.

కేడీసీసీ చైర్మన్‌గా విష్ణువర్ధన్‌ రెడ్డి

కేడీసీసీ బ్యాంకు చైర్మన్‌గా కోడుమూరు టీడీపీ మాజీ ఇన్‌చార్జి, ఆ పార్టీ సీనియర్‌ నాయకులు డి. విష్ణువర్ధన్‌ రెడ్డిని సీఎం చంద్రబాబు, విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్‌ ఎంపిక చేశారు. టీడీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీ బలోపేతం కోసం విష్ణు వర్థన్‌రెడ్డి ఎంతో కష్టపడ్డాడు. ఉమ్మడి రాష్ట్రంలో అలంపూరు ఎమ్మెల్యేగా పోటీ చేశారు. కర్నూలు ఎంపీపీగా పని చేశారు. రాష్ట్ర విభజన తర్వాత కోడుమూరు నియోజకవర్గ ఇన్‌చార్జిగా ఉంటూ ఆ నియోజకవర్గంలో పార్టీ బలోపేతం కోసం శ్రమించారు. బలమైన అనుచరగణం కలిగిన విష్ణు సూచనల మేరకు గత ఎన్నికల్లో కోడుమూరు ఎమ్మెల్యే టికెట్‌ ఆయన సన్నిహితుడైన బొగ్గుల దస్తగిరికి చంద్రబాబు ఇచ్చారు. ఎంపీ టికెట్‌ పంచలింగాలకు చెందిన బస్తిపాటి నాగరాజుకు ఇచ్చారు. వీరిద్దరు కూడా భారీ మెజారిటీతో విజయం సాదించి చట్టసభలో అడుగు పెట్టారు. వైసీపీ హయాంలో టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నా కర్నూలు, గూడూరు, బెళగల్‌ మండలాల్లో పలు గ్రామ పంచాయతీలు, ఎంపీటీసీలను గెలిపించుకుని సత్తా చాటారు. ఆయన ప్రతిభను గుర్తించిన చంద్రబాబు కేడీసీసీబీ చైర్మన్‌ పదవి ఇచ్చారు.

నాగేశ్వరరావు యాదవ్‌కు డీసీఎంఎస్‌..

టీడీపీ అధినేత చంద్రబాబు, యువ నేత నారా లోకేశ్‌కు నమ్మకంగా ఉన్న ప్యాపిలి మాజీ జడ్పీటీసీ సభ్యులు వై.జి. నాగేశ్వరరావు యాదవ్‌కు జిల్లా సహకార మార్కెటింగ్‌ సొసైటీ (డీసీఎంఎస్‌) చైర్మన్‌ పదవి ఇచ్చారు. టీడీపీ ఆవిర్భావం నుంచి ఆయన కుటుంబం ఆ పార్టీలో కొనసాగుతూ వచ్చింది. నాగేశ్వరరావు యాదవ్‌ తండ్రి కుళ్లాయప్ప 1983 నుంచి చండ్రపల్లి సర్పంచ్‌గా విజయం సాధిస్తూ వచ్చారు. 1992లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగు పెట్టిన నాగేశ్వరరావు యాదవ్‌ 1995లో ప్యాపిలి జడ్పీటీసీగా విజయం సాధించారు. ఆ తర్వాత జరిగిన జడ్పీటీసీ ఎన్నికల్లో రెండో పర్యాయం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తెలుగు యువత రాష్ట్ర ఉపాధ్యక్షుడుగా పని చేశారు. టీడీపీ బీసీ సాధికార విభాగం రాష్ట్ర కన్వీనర్‌గా, ఏపీ గొర్రెలు, మేకల పెంపకందారుల ఫెడరేషన్‌ చైర్మన్‌గా పని చేశారు. ప్రస్తుతం ఆయన విశ్వసనీయతను గుర్తించిన చంద్రబాబు డీసీఎంఎస్‌ చైర్మన్‌ నామినేటెడ్‌ పదవి ఇచ్చి సత్కరించారు. ఈ సందర్భంగా నాగేశ్వరరావు యాదవ్‌ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ సీఎం చంద్రబాబు, యువనేత నారా లోకేశ్‌, ఉమ్మడి జిల్లా మంత్రులు, ముఖ్య నాయకులు తనపై నమ్మకంతో ఈ పదవి ఇచ్చారని అన్నారు.

Updated Date - Apr 29 , 2025 | 12:33 AM