వేధిస్తున్న హెడ్ కానిస్టేబుల్
ABN , Publish Date - Apr 29 , 2025 | 12:20 AM
హెడ్ కానిస్టేబుల్ ఆగడాలు, వేధింపులు తట్టుకోలేకపోయిన ఓ కాలనీ వాసులు కలెక్టర్‌ను ఆశ్రయించారు.

కలెక్టర్‌ను ఆశ్రయించిన శ్రీరామ రెసిడెన్సీ కాలనీ వాసులు
కలెక్టరేట్‌లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక
కర్నూలు కలెక్టరేట్, ఏప్రిల్ 28 (ఆంధ్రజ్యోతి): హెడ్ కానిస్టేబుల్ ఆగడాలు, వేధింపులు తట్టుకోలేకపోయిన ఓ కాలనీ వాసులు కలెక్టర్‌ను ఆశ్రయించారు. సోమవారం కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్)లో భాగంగా జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ అడ్డాకుల విద్యాసాగర్ నిత్యం మద్యం సేవించి కాలనీ ప్రజలను నీచంగా చూడటంతో పాటు మహిళల పట్ల అనుచితంగా వ్యవహరిస్తున్నాడంటూ కర్నూలు నగరంలోని శ్రీరామ రెసిడెన్సీకాలనీ వాసులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్బంగా శ్రీరామ రెసిడెన్సి కాలనీవాసులు మాట్లాడుతూ ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ అడ్డాకుల విద్యాసాగర్ ప్రతిరోజు మద్యం సేవించి మహిళలను అసభ్యపదజాలాలతో దూషిస్తూ అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ‘మాది ధర్మపేట.. మా అన్న రౌడీషీటర్, ఎవరైనా మాకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తే వారిని చంపేస్తాం..’ అంటూ బెదిరింపులకు పాల్పడుతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. సదరు హెడ్ కానిస్టేబుల్‌పై ఎస్పీతో పాటు నాగలాపురం ఎస్‌ఐకు ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేకపోయిందన్నారు. పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా ఆయన ప్రవర్తనలో మార్పు రాలేదన్నారు. ఆయనపై చర్యలు తీసుకుని తమకు రక్షణ కల్పించాలని కలెక్టర్‌ను కోరారు.
పీజీఆర్‌ఎస్ అర్జీల పరిష్కారంపై ఆడిట్ చేయాలి
కలెక్టర్ పి.రంజిత్ బాషా
పీజీఆర్‌ఎస్ అర్జీలను నాణ్యతగా పరిష్కారంపై జిల్లా అధికారులు ఆడిట్ చేయాలని కలెక్టర్ పి.రంజిత్ బాషా ఆదేశించారు. అనంతరం ఫిర్యాదుల పరిష్కారంపై అధికారులతో సమీక్షించారు. పీజీఆర్‌ఎస్ లాగిన్‌లో పరిష్కారం చేసిన అర్జీలను ఆడిట్ చేయాల్సి ఉందని, ఇందుకు సంబంధించి పోలీసు శాఖలో 1400, డీఆర్వో వద్ద 1100, ఏడీ సర్వేయర్ వద్ద 540, డ్వామా పీడీ వద్ద 50, హౌసింగ్ పీడీ వద్ద 67, వ్యవసాయ శాఖ వద్ద 79, డీఎంహెచ్‌వో వద్ద 97 పెండింగ్‌లో ఉన్నాయన్నారు. ఫిర్యాదుల పరిష్కారంలో గోనెగండ్ల, మద్దికెర, హాలహర్వి, కర్నూలు అర్బన్ మండలాలు వెనుకబడి ఉన్నాయన్నారు. సీఎంవో గ్రీవెన్స్‌లకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న అర్జీలను వేగవంతంగా పరిష్కరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ బి.నవ్య, డీఆర్వో సి.వెంకటనారాయణమ్మ, హౌసింగ్ పీడీ చిరంజీవి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.