సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలం
ABN , Publish Date - Aug 02 , 2025 | 11:35 PM
రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరించడంలో విఫలమైందని ఫ్యాప్టో నాయకులు ఆరోపించారు.

యాప్‌ల భారం తగ్గించాలి
ఫ్యాప్టో ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల ధర్నా
కర్నూలు ఎడ్యుకేషన్, ఆగస్టు 2 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరించడంలో విఫలమైందని ఫ్యాప్టో నాయకులు ఆరోపించారు. జిల్లా ఫ్యాప్టో ఆధ్వర్యంలో శనివారం కలెక్టరేట్ ఎదుట ఉపాధ్యాయులు ధర్నా చేశారు. ఫ్యాప్టో రాష్ట్ర కో కన్వీనర్ ప్రకాష్‌రావు అధ్యక్షతన ఈ ధర్నా చేపట్టారు. ఆయన మాట్లాడుతూ పాఠశాలల్లో విద్యార్థులకు పాఠాలు చెప్పాల్సిన ఉపాధ్యాయులు రోడ్ల మీదకు వచ్చి ఆందోళనలు చేయాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. యాప్‌ల పేరుతో బోధనను పక్కకు పెట్టాల్సిన పరిస్థితి దాపురించిందన్నారు. పెండింగ్ బకాయిలు వెంటనే చెల్లిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత విస్మరించారన్నారు. ఎస్టీయూ రాష్ట్ర నాయకుడు తిమ్మన్న మాట్లాడుతూ తెలుగు మాద్యమం కొనసాగిస్తామని ఎన్నికల ముందుహామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత పట్టించుకోవడం లేదన్నారు. యూటీఎఫ్ రాష్ట్ర నాయకుడు సురేష్ మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యలపై ఫ్యాప్టో పోరాడుతోందని అన్నారు. ఏపీటీఎఫ్ 257 రాష్ట్ర నాయకుడు రవికుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధ్యాయులకు ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా బకాయిలు రాలేదన్నారు. ఏపీటీఎఫ్ 1938 జిల్లా అధ్యక్షుడు ఇస్మాయిల్ మాట్లాడుతూ లీప్ యాప్ ఒకటి మాత్రమే అమలు చేస్తామని చెప్పి 70 యాప్‌లను పెట్టి ఉపాధ్యాయులను బోధనకు దూరం చేశారన్నారు. డీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కరెకృష్ణ మాట్లాడుతూ సరెండర్ లీవులకు సంబంధించి బకాయిలను చెల్లించాలన్నారు. ఆప్టా రాష్ట్ర అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ పదోన్నతి, బదిలీ పొందిన ఉపాధ్యాయులకు గత రెండు నెలల జీతాలు అందలేదన్నారు. ప్రధానోపాధ్యాయుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నారాయణ మాట్లాడుతూ రాష్ట్రంలో ఉపాధ్యాయులకు ఉమ్మడి సర్వీసు రూల్స్ అమలులోకి తేవాలని, వాటి ప్రకారమే మండల విద్యాశాఖ అధికార పోస్టులను భర్తీ చేయాలని, కోర్టు పేరు చెప్పి ఏ మాత్రం సీనియారిటీ లేనివారికి ఎంఈవో పోస్టులు కట్టబెట్టడం సమంజసం కాదని అన్నారు. కార్యక్రమంలో ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు గోకారి, ప్రధాన కార్యదర్శి జనార్దన్, డీటీఎఫ్ రాష్ట్ర నాయకులు చంద్ర, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వెంకట్రాముడు, గట్టు తిమ్మప్ప, జిల్లా ఫ్యాప్టో చైర్మన్ సేవాలాల్ నాయక్, జనరల్ సెక్రటరీ భాస్కర్, యూటీఎఫ్ రవికుమార్, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.