కర్షకుడి మోమున దరహాసం
ABN , Publish Date - Aug 02 , 2025 | 11:41 PM
సీఎం చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు.. కష్టకాలంలో కర్షకుడికి కూటమి ప్రభుత్వం అండగా నిలిచింది..

‘అన్నదాత సుఖీభవ- పీఎం కిసాన్’ పథకం ప్రారంభం
రైతుల ఖాతాల్లో రూ.136.38 కోట్లు జమ
సెల్‌ఫోన్లలో మెసేజ్ చూడగానే రైతన్నల సంతోషం
మట్టిమనిషికి అండగా కూటమి ప్రభుత్వం
సీఎం చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు.. కష్టకాలంలో కర్షకుడికి కూటమి ప్రభుత్వం అండగా నిలిచింది.. ఎరువులు, సేద్యం ఖర్చులకు తొలి విడతగా రైతుల ఖాతాల్లో రూ.7వేలు జమ చేసింది. ‘మా ఇంటా పెద్దకొడుకులా ఆదుకున్నారు.. చంద్రన్న నీవు చల్లంగా ఉండాలయ్యా..! అంటూ మట్టి మనుషులు మంచి మనసుతో ఆశీర్వాదిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్రపటానికి పాలభిషేకం చేశారు. పల్లెసీమల్లో రైతింట ‘అన్నదాత సుఖీభవ - పీఎం కిసాన్ పథకం’ రైతుల మోమున దరహసం నింపింది. ఏ రైతును కదిపినా రెట్టింపు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వేలాది మంది యువ రైతులతో బైక్ ర్యాలీ నిర్వహించారు.
కర్నూలు, ఆగస్టు 2 (ఆంధ్రజ్యోతి): కర్షకుడి మోమున దరహాసాన్ని నింపింది కూటమి ప్రభుత్వం. ఎరువులు, సేద్యం ఖర్చులకు అప్పులు చేయాల్సిన సమయంలో రైతుల ఖాతాల్లో రూ.7వేలు జమ చేసి వారిని ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కించింది. సీఎం చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం ‘అన్నదాత సుఖీభవ’ అంటూ శనివారం జిల్లాలో 2,72,552 మంది రైతులకు రూ.136.38 కోట్లు జమ చేశారు. కలెక్టరు పి.రంజిత్‌బాషా ఎమ్మిగనూరు మండలం బనవాసి గ్రామంలో ఈ పథకం ప్రారంభించారు.
మహోన్నత లక్ష్యంతో..
రైతులకు పంట పెట్టుబడి సహాయం అందించాలనే మహోన్నత లక్ష్యంతో కేంద్రంలో ప్రధాని మోదీ సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం పీఎం కిసాన్ పథకం కింద రూ.6 వేలు ఇస్తే, రాష్ట్రంలో సీఎం చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం కింద రూ.14 వేలు ఇస్తుంది. ఈ రెండు కలపి ‘అన్నదాత సుఖీభవ - పీఎం కిసాన్ పథకం’ ద్వారా రూ.20 వేలు రైతుల ఖాతాల్లో మూడు విడతల్లో జమ చేయనున్నారు. ఖరీఫ్‌లో తొలి విడత రూ.7 వేలు, రబీలో రెండవ విడత రూ.7 వేలు, వేసవిలో మూడవ విడత రూ.6 వేలు జమ చేస్తారు. శనివారం తొలి విడత రూ.7 వేలు రైతుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసింది.
మొదటి రోజునే 95శాతం..
జిల్లాలో కర్నూలు, కోడుమూరు, ఎమ్మిగనూరు, మంత్రాలయం, ఆదోని, ఆలూరు, పత్తికొండ, పాణ్యం నియోజక వర్గాల్లో అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్ కింద 2,72,552 మంది రైతులను అర్హులు గా గుర్తించారు. ఒక్కో రైతుకు రూ.7 వేలు ప్రకారం రూ.136.38 కోట్లు జమ చేశారు. మొదటి రోజునే 95 శాతం రైతుల ఖాతా ల్లో జమ అయినట్లు తెలుస్తుంది. ఎమ్మిగ నూరు మండలం బనవాసి కేవీకేలో ఏర్పా టు చేసిన కార్యక్రమంలో కలెక్టరు ప్రారంభించారు. ఆ నియోజకవర్గంలో 38,318 మంది రైతులకు రూ.19.15 కోట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో వ్యవసాయ శాఖ జేడీ వరలక్ష్మి, ఆదోని సబ్ కలెక్టరు మౌర్య భరద్వజ్, మార్కెట్ యార్డు చైర్మన్ కె.మల్లయ్య హాజరయ్యారు.
రైతుల్లో సంతోషాన్ని నింపింది
అన్నదాత సుఖీభవ - పీఎం కిసాన్ పథకం పల్లెపల్లెన రైతుల్లో సంతోషాలు నింపింది. ఆలూరులో జరిగిన కార్యక్రమంలో కేడీసీసీబీ చైర్మన్ ఎదురూరు విష్ణువర్థన్‌రెడ్డి, ఆలూరు టీడీపీ ఇన్‌చార్జి బి.వీరభద్రగౌడ్ 63,317 మంది రైతులకు 31.65 కోట్లు జమ చేసి సీఎం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. వేలాది మంది యువ రైతులతో బైక్ ర్యాలీ నిర్వహించారు. గూడూరులో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి, జాయిట్ కలెక్టరు బి.నవ్య కోడుమూరు నియోజకవర్గంలోని 35,082 మంది రైతులకు చెందిన రూ.17.52 కోట్లు భారీ చెక్‌ను రైతులకు అందజేశారు. పాణ్యం మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే గౌరు చరిత 32,978 మంది రైతులకు చెందిన రూ.22.39 కోట్లు చెక్‌ను రైతులకు అందజేశారు. పత్తికొండ నియోజకవర్గం ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు, ఆర్డీవో భరత్ నాయక్ చక్రాల గ్రామంలో జరిగిన సమావేశంలో 54,774 మంది రైతులకు రూ. 27.38 కోట్లు చెక్‌ను అందజేశారు. మంత్రాలయం ఓల్డ్ జడ్పీ ఉన్నత పాఠశాల మైదానంలో జరిగిన కార్యక్రమంలో కుడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు, మంత్రాలయం టీడీపీ ఇన్‌చార్జి ఎన్.రాఘవేంద్రరెడ్డి, జనసేన ఇన్‌చార్జి బి.లక్ష్మన్న, తెలుగురైతు రాష్ట్ర కార్యదర్శి నరవ రమాకాంతరెడ్డి 41,992 మంది రైతులకు రూ.20.99 కోట్ల చెక్ అందజేశారు. ఆదోని మండలం నాగనాథనహల్లి గ్రామంలో ఏపీ కురవ కార్పోరేషన్ చైర్మన్ మాన్వి దేవేంద్రప్ప, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి గుడిసె కృష్ణమ్మ, సీనియర్ నాయకుడు శ్రీకాంత్‌రెడ్డి, టీడీపీ జిల్లా కార్యదర్శి భూపాల్‌చౌదరి, బీజేపీ మండల కార్యదర్శి నాగరాజుగౌడ్, ఏడీఏ బాలవర్ధిరాజులు 18,722 మంది రైతులకు రూ.9.36 కోట్లు చెక్ అందజేశారు.