వక్ఫ్ చట్ట సవరణను వెనక్కి తీసుకోవాలి
ABN , Publish Date - Apr 29 , 2025 | 12:37 AM
కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఆమోదం తెలిపిన వక్ఫ్ చట్ట సవరణ రద్దు చేయాలని ముస్లింలు డిమాండ్ చేశారు.

ముస్లిం పర్సనల్ లా బోర్డు, జేఏసీ భారీ ర్యాలీ
కలెక్టరేట్ ఎదుట ధర్నా
కర్నూలు న్యూసిటీ, ఏప్రిల్ 28 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఆమోదం తెలిపిన వక్ఫ్ చట్ట సవరణ రద్దు చేయాలని ముస్లింలు డిమాండ్ చేశారు. వక్ఫ్ చట్ట సవరణ వెనక్కి తీసుకోవాలని కోరుతూ సోమవారం ముస్లిం పర్సనల్ లా బోర్డు, ముస్లిం జేఏసీ ఆధ్వర్యంలో కర్నూలు నగరంలోని రాజ్‌విహర్ నుంచి కలెక్టరేట్‌కు భారీ ర్యాలీ చేపట్టారు. వేలాదిగా ముస్లింలు తరలిరావడంతో రెండు గంటల పాటు ట్రాఫిక్ జామ్ అయింది. ముందుగానే ఆర్టీసీ బస్సులను బళ్లారి చౌరస్తామీదుగా తరలించారు. అయితే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ సందర్బంగా జేఏసీ కన్వీనర్ జాకీర్ మౌలానా మూడోసారి అధికారంలోకి వచ్చిన మోదీ ప్రభుత్వం కార్పొరేట్ వ్యక్తులకు భూములను కట్టబెట్టడానికే వక్ఫ్ చట్టంలో సవరణలు చేసిందరన్నారు. చట్ట సవరణ ద్వారా వక్ప్ బోర్డు ఆస్తులకు రక్షణ లేకుండా పోయిందన్నారు. తక్షణమే వక్ఫ్ చట్ట సవరణ చట్టాన్ని రద్దు చేయాలని లేని పక్షంలో దేశవ్యాప్తంగా ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జేఏసీ కో కన్వీనర్లు ఎంఏ.హమీద్, పి.ఇక్బాల్ హుస్సేన్, మజీద్ మౌలానా, డి.గౌస్‌దేశాయ్, నూరుల్లా ఖాద్రి, ఆవాజ్ కార్యదర్శి ఎంఏ చిస్తి, జమాతే ఇస్తామి ఏ హింద్ రాష్ట్ర కార్యదర్శి అబ్దుల్ ఖాదిర్, కేదార్‌నాథ్, కిరణ్,జహంగీర్ తదితరులు పాల్గొన్నారు. ముస్లింల ర్యాలీకి వైసీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కాటసాని రాంభూపాల్‌రెడ్డి, హఫీజ్‌ఖాన్, వైసీపీ నాయకుడు అహ్మద్ అలీఖాన్, కార్పొరేటర్లు మద్దతుపలికారు. ర్యాలీలో పాల్గొన్న ముస్లింలకు డీవైఎఫ్‌ఐ, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు అబ్దుల్లా, రాఘవేంద్ర, నగేష్ హుస్సేన్ బాషా, అంజి తదితరులు తాగునీటి వసతిని కల్పించారు.