Share News

శ్రీశైలం డ్యాం భద్రతపై తక్షణ చర్యలు

ABN , Publish Date - Apr 29 , 2025 | 12:34 AM

శ్రీశైలం ప్రాజెక్టు భద్రతపై తక్షణ చర్యలు చేపట్టాలని నేషనల్‌ డ్యాం సేఫ్టీ అథారిటీ (ఎన్‌డీఎస్‌ఏ) చైర్మన్‌ అనిల్‌ జైన్‌ సూచించారు.

శ్రీశైలం డ్యాం భద్రతపై తక్షణ చర్యలు

అవసరమైన యాక్షన్‌ ప్లాన్‌ తయారు చేయండి

డ్యాం అధికారులను ఆదేశించిన ఎన్‌డీఎస్‌ఏ చైర్మన్‌ అనిల్‌ జైన్‌

విజయవాడలో సమీక్షించిన నేషనల్‌ డ్యాం సేఫ్టీ బృందం

కర్నూలు, ఏప్రిల్‌ 28 (ఆంధ్రజ్యోతి): శ్రీశైలం ప్రాజెక్టు భద్రతపై తక్షణ చర్యలు చేపట్టాలని నేషనల్‌ డ్యాం సేఫ్టీ అథారిటీ (ఎన్‌డీఎస్‌ఏ) చైర్మన్‌ అనిల్‌ జైన్‌ సూచించారు. అవసరమైన యాక్షన్‌ ప్లాన్‌ రూపొందించాలని ప్రాజెక్టు ఇంజనీర్లను ఆదేశించారు. సోమవారం విజయవాడలో శ్రీశైలం సహా వివిధ ప్రాజెక్టులపై అనిల్‌ జైన్‌ సమీక్ష నిర్వహించారు. శ్రీశైలం ప్రాజెక్టు ఎస్‌ఈ శ్రీరామచంద్రమూర్తి ప్రాజెక్టుకు తీసుకోవాల్సిన భద్రత చర్యలు వివిధ ప్రతిపాదనలపై ఎన్‌డీఎస్‌ఏ చైర్మన్‌ అనిల్‌ జైన్‌కు వివరించారు. అదే క్రమంలో డ్యాం తక్షణ మరమ్మతులకు రూ.30-35 కోట్లు అవసరం ఉందని శ్రీరామచంద్రమూర్తి వివరించారు. తక్షణమే అసరమైన నిధులు ఇవ్వాలంటూ ఆర్థిక శాఖకు అనిల్‌ జైన్‌ సూచించినట్లు తెలిసింది. తెలుగు రాష్ట్రాల జీవనాడి శ్రీశైలం ప్రాజెక్టు 2009 వరదలకు భారీగా దెబ్బతిందని, భద్రత ప్రశ్నార్థకంగా ఉందంటూ ఇప్పటికే పలు నిపుణుల కమిటీలు ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. డ్యాం స్పిల్‌వేలో 490 అడుగుల్లో ఉన్న గ్యాలరీలు కనిష్ఠ నీటి మట్టంలో 220 గ్యాలరీలలో లీకేజీ ఏర్పడుతుందని, పలు మరమ్మతులు చేపట్టాలని వీటిని మే 31లోగా పూర్తి చేయాలని గతంలోనే ఆదేశించినా ఆ దిశగా చర్యలు తీసుకోకపోవడంపై ఎన్‌డీఎస్‌ఏ చైర్మన్‌ అనిల్‌ జైన్‌ అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది.

నేడు డ్యాంను పరిశీలించనున్న అనిల్‌ జైన్‌

నేషనల్‌ డ్యాం సేఫ్టీ చైర్మన్‌ అనిల్‌ జైన్‌ మంగళవారం (నేడు) శ్రీశైలం డ్యాంను పరిశీలించనున్నారు. విజయవాడలో జరిగిన ప్రాజెక్టుల సమీక్ష అనంతరం ఆయన శ్రీశైలానికి బయలుదేరినట్లు తెలిసింది. ఆయనతో పాటు సీడబ్లూసీ, సెంట్రల్‌ సాయిల్డ్‌ అండ్‌ మెటీరియల్‌ రీసెర్చ్‌ స్టేషన్‌ (సీఎస్‌ఎంఆర్‌ఎస్‌) నిపుణుల బృందం కూడా శ్రీశైలం డ్యాం పరిశీలించే అవకాశం ఉందని ఇంజనీర్లు పేర్కొన్నారు.

Updated Date - Apr 29 , 2025 | 12:34 AM