Corruption: అవినీతికి కేరాఫ్‌గా మారిన ఆర్డీవో కార్యాలయం
ABN , Publish Date - Aug 02 , 2025 | 12:28 PM
నందికొట్కూరు ఆర్డీవో కార్యాలయం అవినీతికి కేరాఫ్‌గా మారింది. పనులు కావాలంటే పైసలివ్వాల్సిందే.. వసూళ్లు పర్వంలో ఆ ఇద్దరిదే కీలకపాత్ర. సీఎం రిలీఫ్ ఫండ్, కారుణ్య నియామకాలను కూడా అక్రమార్కులు వదలట్లేదు. కార్యాలయం చుట్టూ తిరిగి బాధితులు విసిగిపోతున్నారు.

అవినీతికి కేరాఫ్‌గా మారిన ఆర్డీవో కార్యాలయం
పనులు కావాలంటే పైసలివ్వాల్సిందే..
వసూళ్లు పర్వంలో ఆ ఇద్దరిదే కీలకపాత్ర
సీఎం రిలీఫ్ ఫండ్, కారుణ్య నియామకాలను కూడా వదలని అక్రమార్కులు
కార్యాలయం చుట్టూ తిరిగి విసిగిపోయిన బాధితులు
నందికొట్కూరు, ఆగస్టు 2: ఆ కార్యాలయంలో ప్రతి పనికి పైనల్ వసూల్ చేస్తున్నారు. పైసలివ్వనిది అక్కడ ఏ పని కూడా కాదు. ఆవినీతికి అడ్డాగా ఆర్డీవో కార్యాలయం మారింది. ప్రతి పనికో రేటును విధించి రైతులను, బాధితులను పదేపదే తమ చుట్టూ తిప్పుకుంటున్నారనడానికి గురువారం జూపాడుబంగ్లా వద్ద ఏసీబీ వలలో సీనియర్ అసిస్టెంట్ రమేష్ చిక్కడమే ఇందుకు ఒక నిదర్శనం. డివిజన్తో పాటు ఆయా మండలాల్లో జనన, మరణ ధృవీకరణ పత్రాలను మొదలుకొని, భూముల మ్యుటేషన్, ఆర్ వోఆర్‌లో మార్పు, తహసీల్దార్ లేఖలు, రెగ్యులైజేషన్, ఫైనాన్స్ స్టేటస్ సర్టిఫికేషన్ ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క రేటును నిర్ణయించి వసూళ్లు చేస్తున్నట్లు పలు ఆరోపణలున్నాయి. ఫైనాన్స్ స్టేటస్ సర్టిఫికేషన్ కోసం రూ.30 వేలు వసూళ్లు చేసినట్లు తెలుస్తోంది. చివరకు సీఎం రిలీఫ్ ఫండ్ కోసం దరఖాస్తు చేసుకున్న బాధితుల నుంచి కూడా డబ్బులు వసూళ్లు చేస్తున్నట్లు సమాచారం. ఓ అధికారి నేరుగా తన పోనేపే నెంబర్‌ను బాధితులకు ఇచ్చి నగదును తీసుకుంటున్నారన్నది విశ్వసనీయ సమాచారం.
అక్రమార్కులు విధించిన రేట్లు
జనన మరణ ధ్రువీకరణ పత్రాలకు రూ.10వేల నుంచి రూ.20 వేలు వసూళ్లు చేస్తున్నట్లు సమాచారం. నో అర్నింగ్ మెంబర్ సర్టిఫికెట్ కోసం రూ.50వేలు నుంచి రూ.లక్ష వరకు సమర్పించుకోవాల్సిందే. ల్యాండ్ కన్వర్షన్‌కు భారీగా డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.. ల్యాండ్ కన్వర్షన్‌కు భూమి మార్కెట్ విలువలో 2 శాతం నుంచి 5 శాతం వరకు వసూళ్లు చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. డివిజన్ కార్యాలయంలోని కొందరు అధికారులు, సిబ్బంది నందికొట్కూరు నియోజకవర్గం నుంచి వెళ్లిన పలు ఫైళ్లలో డబ్బులు డిమాండ్ చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మిడ్తూరు మండలంలో ఓ పెట్రోల్ బంకును విజిట్ చేసేందుకు లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు, పగిడ్యాల మండలంలో ఓ గ్రామంలో పని చేస్తున్న వీఆర్వో గుండెపోటుతో మృతిచెందితే ఆయన కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకం ఉద్యోగం ఇచ్చేందుకు డబ్బులు డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి
ఇలా ఇన్వెస్ట్ చేయండి..రెండేళ్లలోనే రూ. 10 లక్షలు పొందండి..
ఆగస్టులో 15 రోజులు బ్యాంకులకు సెలవులు.. ముందే ప్లాన్ చేసుకోండి