తుంగభద్ర డ్యాం గేట్లపై అప్రమత్తంగా ఉండాలి
ABN , Publish Date - Apr 29 , 2025 | 12:35 AM
తుంగభద్ర డ్యాం గేట్లు నిర్వహణలో ఎంతో అప్రమత్తంగా ఉండాలని రాబోయే సీజన్‌కు ఎలాంటి సమస్య రాకుండా బోర్డు యంత్రాంగం సన్నద్ధంగా ఉండాలంటూ కలెక్టర్ పి.రంజిత్ బాషా సూచించారు.

కలెక్టర్ పి.రంజిత్ బాషా
కర్నూలు, ఏప్రిల్ 28 (ఆంధ్రజ్యోతి): తుంగభద్ర డ్యాం గేట్లు నిర్వహణలో ఎంతో అప్రమత్తంగా ఉండాలని రాబోయే సీజన్‌కు ఎలాంటి సమస్య రాకుండా బోర్డు యంత్రాంగం సన్నద్ధంగా ఉండాలంటూ కలెక్టర్ పి.రంజిత్ బాషా సూచించారు. సోమవారం తుంగభద్ర ప్రాజెక్టు బోర్డు ఎస్‌ఈ నారాయణ నాయక్, కర్నూలు ఇరిగేషన్ ఎస్‌ఈ ద్వారకానాథ్ రెడ్డి కలెక్టర్‌తో సమావేశమయ్యారు. గత ఏడాది ఆగస్టులో తుంగభద్ర డ్యాం 19వ నెంబరు గేటు కొట్టుకుపోయిన సంగతి తెలిసిందే. టీబీపీ ఎల్లెల్సీ కింద కర్నూలు జిల్లాలో 1.51 లక్షల ఆయకట్టుకు సాగునీరు, 196 గ్రామాలకు తాగునీరు అందాల్సి ఉంది. జూన్ నుంచి ఖరీఫ్ సీజన్ ప్రారంభం అవుతుండటంతో డ్యాంగేట్ల భద్రతపై అప్రమత్తంగా ఉండాలంటూ ఇంజనీర్లకు కలెక్టర్ సూ చించారు. ఈ సందర్బంగా టీబీపీ బోర్డు ఎస్‌ఈ నారాయణ్ నాయక్ డ్యాం భద్రతపై కలెక్టర్‌కు వివరించారు. 19వ నెంబరు గేటు రూ.1.98 కోట్లతో టెండర్లను పూర్తి చేశామని, జూన్ ఆఖరు లోగా కొత్త గేటు అమరుస్తామని తెలిపారు. మరో 32 గేట్లకు టెండర్లు పిలుస్తున్నట్లు వివరించారు. అలాగే కాల్వల నిర్వహ ణపై తీసుకుంటున్న జాగ్రత్తలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. అంతకుముందు రిటైర్డు ఈఎన్‌సీ జలంధర్, రిటైర్డు ఎస్‌ఈ విశ్వనాథ్ తదితరులు ఇరిగేషన్ ఎస్‌ఈ ద్వారకనాథ్ రెడ్డితో సమావేశమయ్యారు. పశ్చిమ ప్రాంతం తాగునీటి వనరుల అభి వృద్ధి, గుండ్రేవుల ప్రాజెక్టు సాధన తదితర అంశాలపై చర్చించారు.