Share News

అవుకు రివిట్‌మెంట్‌ పనులు ప్రారంభం

ABN , Publish Date - Dec 12 , 2025 | 11:51 PM

అవుకు రిజర్వాయర్‌లో కుంగిన రివిట్‌మెంట్‌ మరమ్మతు పనులను ఈనెల చివరికి పూర్తి చేస్తామని ఎస్సార్బీసీ ఈఈ శుభకుమార్‌ శుక్రవారం పేర్కొన్నారు.

అవుకు రివిట్‌మెంట్‌ పనులు ప్రారంభం
మరమ్మతు పనులను పర్యవేక్షిస్తున్న ఈఈ శుభకుమార్‌, అధికారులు

ఈనెల చివరికి పూర్తి : ఈఈ శుభకుమార్‌

అవుకు, డిసెంబరు 12 (ఆంధ్రజ్యోతి) : అవుకు రిజర్వాయర్‌లో కుంగిన రివిట్‌మెంట్‌ మరమ్మతు పనులను ఈనెల చివరికి పూర్తి చేస్తామని ఎస్సార్బీసీ ఈఈ శుభకుమార్‌ శుక్రవారం పేర్కొన్నారు. ఉదయం రిజర్వాయర్‌ వద్దకు ఎస్సార్బీసీ అధికారులు చేరుకొని పూజలు చేసి మరమ్మతు పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఈఈ మాట్లాడుతూ రిజర్వాయర్‌ నిర్మాణం జరిగిన సమయంలో తిమ్మరాజు, పాలేరు చెరువులకు గతంలో ఉన్న తూముల వద్ద నిర్మాణ లోపం జరిగిందన్నారు. రిజర్వాయర్‌ 4.148 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో 2009లో పూర్తయిందన్నారు. గత ఏడాది రిజర్వాయర్‌లో 4 టీఎంసీల నీటిని నింపితే 2024 సెప్టెంబరు నెల 25వ తేదీన తిమ్మరాజు చెరువు లోపలి భాగంలో ఎర్రరాతిలో నిర్మించిన రివిట్‌మెంట్‌ కొంత మేర కుంగి పోయిందన్నారు. రిజర్వాయర్‌ భద్రతను దృష్టిలో ఉంచుకొని జీఎన్‌ఎస్‌ఎస్‌ గేట్లద్వారా కడప జిల్లాకు నీటిని తరలించామన్నారు. అప్పట్లో మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి రిజర్వాయర్‌ను పరిశీలించి మరమ్మతు కోసం రూ. 57 లక్షలు మంజూరు చేశారని తెలిపారు. అయితే పలు కారణాలతో పనులు చేపట్టలేక పోయామని అన్నారు. ఈఏడాది ఆగస్టు-సెప్టెంబరు నెలల్లో రిజర్వాయర్‌ను మళ్లీ పూర్తి స్థాయిలో నింపారని తెలిపారు. అక్టోబరు నెల 3వ తేదీన గతంలో కుంగిన ప్రాంతంలోనే రివిట్‌మెంట్‌ రెండోసారి కుంగిపోయి మూడంచెల భద్రతతో నిర్మించిన మట్టికట్టల నుంచి నీరు భారీగా బయటకు వచ్చిందన్నారు. ప్రస్తుతం రిజర్వా యర్‌లో 2 టీఎంసీలు నీరు నిల్వ ఉంది. మంత్రి బీసీ ఆదేశాలతో కర్ణా టక రాష్ట్రంలోని బెల్గాంకు చెందిన అక్షిత అండర్‌ వాటర్‌ కాంక్రీటింగ్‌ ఏజెన్సీకి మరమత్తుల పనులను అప్పగించామన్నారు. ఈ కార్యక్రమంలో అక్షిత కంపెనీ అడ్వయిజర్‌ దేశాయ్‌, కాంట్రాక్టర్‌ అభిజిత్‌, ఎస్సార్బీసీ డీఈలు సాయికిరణ్‌, మల్లికార్జున, జేఈ సుధాకర్‌ పాల్గొన్నారు.

Updated Date - Dec 12 , 2025 | 11:51 PM