Share News

ట్రాఫిక్‌ క్రమబద్దీకరణలో బెజవాడను రోల్‌మోడల్‌ చేస్తాం

ABN , Publish Date - Aug 01 , 2025 | 12:53 AM

ట్రాఫిక్‌ క్రమబద్దీకరణలో విజయవాడను ప్రపంచంలోనే రోల్‌మోడల్‌గా తీర్చిదిద్దుతామని డీజీపీ హరీష్‌కుమార్‌ గుప్తా అన్నారు. నగరంలోని అన్ని కూడళ్లలో త్వరలో ఏఐ ఆధారిత సిగ్నలింగ్‌ వ్యవస్థను ఏర్పాటు చేస్తామన్నారు. ట్రాఫిక్‌ పోలీసులకు దాతలు సమకూర్చిన డ్రోన్లు, ప్రభుత్వం కేటాయించిన ద్విచక్ర వాహనాలను ఆయన పోలీసు కమిషనర్‌ కార్యాలయంలో గురువారం అందజేశారు.

ట్రాఫిక్‌ క్రమబద్దీకరణలో బెజవాడను రోల్‌మోడల్‌ చేస్తాం
ట్రాఫిక్‌ పోలీసుల బైకులను ప్రారంభిస్తున్న డీజీపీ హరీష్‌కుమార్‌ గుప్తా, సీపీ రాజశేఖరబాబు తదితరులు

త్వరలో అన్ని కూడళ్లలో ఏఐ సిగ్నళ్లు

టెక్నాలజీ వినియోగంలో ‘ఎన్టీఆర్‌’ నెంబర్‌వన్‌

డీజీపీ హరీష్‌కుమార్‌ గుప్తా ప్రశంసలు

విజయవాడ, జూలై 31 (ఆంధ్రజ్యోతి) : ట్రాఫిక్‌ క్రమబద్దీకరణలో విజయవాడను ప్రపంచంలోనే రోల్‌మోడల్‌గా తీర్చిదిద్దుతామని డీజీపీ హరీష్‌కుమార్‌ గుప్తా అన్నారు. నగరంలోని అన్ని కూడళ్లలో త్వరలో ఏఐ ఆధారిత సిగ్నలింగ్‌ వ్యవస్థను ఏర్పాటు చేస్తామన్నారు. ట్రాఫిక్‌ పోలీసులకు దాతలు సమకూర్చిన డ్రోన్లు, ప్రభుత్వం కేటాయించిన ద్విచక్ర వాహనాలను ఆయన పోలీసు కమిషనర్‌ కార్యాలయంలో గురువారం అందజేశారు. పోలీసు శాఖలో ట్రాఫిక్‌ పోలీసు ఉద్యోగం కష్టతరమైందన్నారు. నిత్యం రహదారులపై ఏడెనిమిది గంటలు నిలబడి ట్రాఫిక్‌ నిర్వహణ చేయడం మామూలు విషయం కాదన్నారు. దీనివల్ల వారి ఆరోగ్య, మానసికస్థితిపై ఎంతో ప్రభావం పడుతుందన్నారు. విజయవాడలో నిత్యం 8 లక్షల వాహనాలు రహదారులపైకి వస్తున్నాయన్నారు. ఈ వాహనాలకు సరిపడినంతగా రహదారుల విస్తరణ లేదన్నారు. ఎన్టీఆర్‌ పోలీసు కమిషనరేట్‌ టెక్నాలజీని వినియోగించడంలో రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉందని ప్రశంసించారు. ఇక్కడ అస్త్రం టూల్‌ను అమలు చేసి ట్రాఫిక్‌ క్రమబద్దీకరిస్తున్నారన్నారు. రాష్ట్రంలో భారీ ఈవెంట్లు జరిగినప్పుడు ఈ టూల్‌ను ఉపయోగిస్తున్నామన్నారు. విశాఖలో యోగాంధ్ర నిర్వహించినప్పుడు 20 కిలోమీటర్ల వరకు 4-5 లక్షల వాహనాలు ఆగిపోయాయని తెలిపారు. వాటిని అస్త్రం టూల్‌ ద్వారా క్రమబద్దీకరించామన్నారు. విజయవాడ పోలీసులు క్రైం, ట్రాఫిక్‌ విభాగాల్లో టెక్నాలజీని ఉపయోగించడం అభినందనీయమన్నారు. రాష్ట్రంలో ఇతర నగరాల కంటే ఎన్టీఆర్‌ పోలీసు కమిషనరేట్‌ పరిధిలోనే ఎక్కువ సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారన్నారు. విజయవాడలో త్వరలో అన్ని కూడళ్లలో ఏఐ ఆధారిత సిగ్నలింగ్‌ వ్యవస్థను ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. పోలీసు కమిషనర్‌ ఎస్వీ రాజశేఖరబాబు మాట్లాడుతూ కమిషనరేట్‌ పరిధిలో ప్రస్తుతం 6 వేల సీసీ కెమెరాలను సురక్ష ప్రాజెక్టులో దాతల విరాళాలతో ఏర్పాటు చేశామన్నారు. వాటివల్ల జిల్లాలో ఎక్కడ నేరం జరిగినా 24 గంటల్లో ఛేదిస్తున్నామని చెప్పారు. అన్ని పోలీస్‌స్టేషన్లకు డ్రోన్లను సమకూర్చామన్నారు. చరిత్రలో ఇదొక సువర్ణ అధ్యాయంగా పేర్కొన్నారు. ట్రాఫిక్‌ క్రమబద్దీకరణ కోసం ఉపయోగిస్తున్న అస్త్రం టూల్‌ నిర్వహణకు డీజీపీ రూ.కోటి నిధులను విడుదల చేశారని తెలిపారు. అస్త్రం ద్వారా విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీలు సరిత, తిరుమలేశ్వరరెడ్డి, మహేశ్వరరాజు తదితరులు పాల్గొన్నారు.

ఏడీపీసీపై డీజీపీ ప్రశంసలు

ట్రాఫిక్‌ ఏడీసీపీ ఏవీఎల్‌ ప్రసన్నకుమార్‌పై డీజీపీ హరీష్‌కుమార్‌గుప్తా ప్రశంసల జల్లు కురిపించారు. కార్యక్రమం ప్రారంభంలో ఆయన విజయవాడలో ట్రాఫిక్‌ నియంత్రణకు సంబంధించి పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. డ్రోన్లను ఉపయోగించి ట్రాఫిక్‌ను క్రమబద్దీకరించడం, ట్రాఫిక్‌ నిబంధనలను ఉల్లంఘించిన వారికి సీసీ కెమెరాల ద్వారా జరిమానాలను విధించడం వంటి అంశాలను లెక్కలతో సహా వివరించారు. దీనిపై డీజీపీ ఆయన్ను అభినందించారు. ఈనెలఖారున ఉద్యోగ విరమణ చేసే ప్రసన్నకుమార్‌ను తిరిగి విధుల్లోకి తీసుకుంటామని డీజీపీ ప్రకటించారు. కాగా, భారీ శబ్దాలు చేసే వాహనాల సైలెన్సర్లను డీజీపీ సమక్షంలో రోలర్‌తో తొక్కించారు. మొత్తం 500 సైలెన్సర్లను తొక్కించారు.

Updated Date - Aug 01 , 2025 | 12:53 AM