Share News

నీరంతా వృథా.. ఊరంతా వ్యథ..

ABN , Publish Date - Aug 02 , 2025 | 12:41 AM

ఓవైపు లక్షల క్యూసెక్కుల కృష్ణానది నీరు కడలిపాలవుతోంది. మరోవైపు చుక్కనీరు లేక ఎకరాలకు ఎకరాలు నెర్రలిస్తున్నాయి. చెంతనే నిండుకుండలా నీరు ఉబికి వస్తున్నా.. వరి పైరుకు చుక్కనీరు చిక్కలేని విచిత్ర పరిస్థితులు జిల్లా అన్నదాతలను కన్నీటిలో ముంచేశాయి. కొద్దిరోజులుగా వరుణుడు ముఖం చాటేయడం, ఎండలు మండిపోతుండటం, ఎగువ ప్రాంత రైతులు సాగునీటిని దిగువకు రానీయకపోవడం వంటి కారణాల వల్ల పామర్రు, పెడన, మచిలీపట్నం నియోజక వర్గాల్లో సాగునీటి ఎద్దడి నెలకొంది. నీటిపారుదల శాఖ అధికారుల అనాలోచితన నిర్ణయాల వల్లే ఇలా జరుగుతోందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. - మచిలీపట్నం/కూచిపూడి, ఆంధ్రజ్యోతి

నీరంతా వృథా.. ఊరంతా వ్యథ..
మొవ్వ మండలంలోని యద్దనపూడి, పెడసనగల్లు గ్రామాల్లో నెర్రలిచ్చిన వరి పొలాలు

జిల్లాలో కొనసాగుతున్న నీటి ఎద్దడి

బ్యారేజీ నుంచి రోజూ లక్షల క్యూసెక్కుల నీరు సముద్రంలోకి..

కృష్ణమ్మ చెంతే ఉన్నా వరిపైరుకు చుక్కనీరు అందని దుస్థితి

కాల్వల్లో తూడు పేరుకుపోవడంతో నీరు పారని దీనావస్థ

కంకిపాడు వద్ద ఇప్పుడు తూడు, నాచు తొలగింపు పనులు

వరద నీరు వస్తున్న సమయంలో అధికారుల హడావిడి తంతు

నీరందక నెర్రలిచ్చిన మొవ్వ మండలంలోని పంట పొలాలు

పెడన నియోజకవర్గంలోని రైతుల పరిస్థితి కూడా ఇంతే..

పంటలు ఎండిపోతున్నాయని ఎమ్మెల్యే కాగిత వద్ద ఆవేదన

మొవ్వ మండలంలో నెర్రలిచ్చిన పొలాలు

మొవ్వ మండలంలోని కూచిపూడి, యద్దనపూడి, మొవ్వ, పెదముత్తేవి, ఐనంపూడి, కారకంపాడు తదితర గ్రామాల్లోని పంట పొలాలకు సాగునీరు అందట్లేదు. వీరంకిలాకు సెక్షన్‌ నుంచి ఈ గ్రామాల్లోని పొలాలకు బీమనది, ఐనంపూడి కాల్వల ద్వారా సాగునీరు అందాల్సి ఉంది. కంకిపాడు వద్ద ప్రధాన కాల్వలో తూడు, నాచు పెరిగిపోయాయని, వాటిని తొలగించే పనులు కొద్దిరోజులుగా చేస్తుండటంతో ఈ ప్రాంతాలకు నీటి విడుదలను తగ్గించామని అధికారులు చెబుతున్నారు. పదిహేను రోజులుగా బీమనది, ఐనంపూడి పంటకాల్వలకు నీటి విడుదలను నిలిపివేయడంతో పంట పొలాలు నెర్రెలిచ్చివెక్కిరిస్తున్నాయి. పొలాలు నెర్రెలిచ్చాయని, పైరు ఎండిపోయే పరిస్థితికి చేరిందని నీటిపారుదల శాఖ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు వాపోతున్నారు. రెండు రోజుల్లో నీటిని విడుదల చేస్తామని చెప్పడమే తప్ప.. ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే వేలాది రూపాయలు ఖర్చుచేసి వరిసాగు చే శామని, పొలాలు నెర్రెలు ఇచ్చేంతగా ఎండిపోయినా నీటిపారుదల శాఖ అధికారులు తమగోడును వినడం లేదని పెడనగల్లు నీటిసంఘం అధ్యక్షుడు యద్దనపూడి రాజశేఖర్‌తో పాటు పలు గ్రామాల రైతులు వాపోతున్నారు.

పెడన నియోజకవర్గంలోనూ నీటి ఎద్దడి

పెడన నియోజకవర్గంలోని పెడన, గూడూరు, బంటుమిల్లి, కృత్తివెన్ను మండలాల్లో సాగునీటి ఎద్దడి నెలకొంది. దీంతో రైతులు ఈ విషయాన్ని ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్‌ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో రైతులతో కలిసి ఎమ్మెల్యే కాగిత శుక్రవారం కౌతవరం లాకుల వద్దకు వెళ్లారు. అక్కడి పరిస్థితులను పరిశీలించారు. బంటుమిల్లి కెనాల్‌కు 950 క్యూసెక్కుల నీటిని విడుదల చేయాల్సి ఉండగా, కేవలం 450 క్యూసెక్కులే విడుదల చేస్తుండటంపై నీటిపారుదల శాఖ డీఈ ఎస్‌.శ్రీనును ఆయన నిలదీశారు. పెడన నియోజకవర్గంలోని భూముల్లో చౌడుశాతం అధికంగా ఉంటోందని, సాగునీటిని సక్రమంగా విడుదల చేయకపోవడంతో ఎండల తీవ్రతకు వెదజల్లే పద్ధతిన సాగుచేసిన వరిపైరు ఎండిపోతోందని ఎమ్మెల్యే అధికారులతో అన్నారు. బంటుమిల్లి కెనాల్‌కు సక్రమంగా సాగునీటిని అందజేయాలని అధికారులను ఆదేశించారు. కైకలూరు తదితర ప్రాంతాల్లోని చేపల చెరువులకు నీటిని విడుదల చేసి, పెడన నియోజకవర్గంలోని పొలాలకు విడుదల చేయకపోవడం ఏమిటని నిలదీశారు.

సముద్రంలోకి 189 లక్షల క్యూసెక్కులు

ప్రకాశం బ్యారేజీ నుంచి శుక్రవారం సాయంత్రం 1.89 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేశామని నీటిపారుదల శాఖ అధికారులు చెబుతున్నారు. జిల్లాలోని అన్ని ప్రధాన కాల్వలకు పూర్తిస్థాయిలో 17 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నామని అంటున్నారు. పామర్రు నియోజకవర్గంలోని మొవ్వ, కూచిపూడి, పెదముత్తేవి తదితర ప్రాంతాలకు బీమనది, ఐనంపూడి కాల్వ ద్వారా సాగునీరు అందించాల్సి ఉందని, ఒకటి, రెండు రోజుల్లో నీటిని పూర్తిస్థాయిలో విడుదల చేస్తామని చెబుతున్నారు.

Updated Date - Aug 02 , 2025 | 12:41 AM