Vijayasai SIT Investigation: నిన్న వస్తానన్నారు.. నేడు రాలేదు
ABN , Publish Date - Apr 17 , 2025 | 12:58 PM
Vijayasai SIT Investigation: మద్యం కుంభకోణం వ్యవహారంలో సిట్ విచారణకు మాజీ ఎంపీ విజయ సాయిరెడ్డి డుమ్మా కొట్టారు. ఒకరోజు ముందే వస్తానని చెప్పిన సాయిరెడ్డి.. కొన్ని కారణాల వల్ల రాలేకపోతున్నట్లు సమాచారం పంపారు.

విజయవాడ, ఏప్రిల్ 17: వైసీపీ హయాంలో మద్యం కుంభకోణం కేసులో సిట్ విచారణకు మాజీ ఎంపీ విజయ సాయిరెడ్డి (Former MP Vijayasai Reddy) గైర్హాజరయ్యారు. వివిధ కారణాల వల్ల ఈరోజు విచారణకు రాలేకపోతున్నట్లు సిట్‌కు సమాచారం పంపారు. ఎప్పుడు వస్తానో మళ్లీ సమాచారం ఇస్తానని సిట్ అధికారులకు కబురు పంపించారు. ఈ కేసుకు సంబంధించి రేపు (ఏప్రిల్ 18)న విచారణకు రావాల్సిందిగా విజయసాయిరెడ్డికి సిట్ నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ముందుగా నిర్ణయించుకున్న కార్యక్రమాలు ఉన్నాయని అందుకే ఒకరోజు ముందుగానే అంటే ఈరోజు విచారణకు వస్తానని సిట్ అధికారులకు సాయిరెడ్డి సమాచారం ఇచ్చారు. అందుకు సిట్ అధికారులు కూడా తాము సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. అయితే ఇప్పుడు రాలేనని, మళ్లీ మరోసారి వస్తానని విజయసారెడ్డి చెప్పడం పోలీసులను అవాక్కయ్యేలా చేసింది.
గత ప్రభుత్వ హయాంలో మద్యం కుంభకోణంలో వేల కోట్ల రూపాయలు అక్రమంగా దోచుకున్నారని నిర్ధారణ అయ్యింది. దీనిపై విచారణ జరిపిన సిట్.. పలు ఆధారాలను కూడా సేకరించింది. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారం మొత్తానికి కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి సూత్రధారి అని, ఆయన కనుసన్నల్లోనే మద్యం కుంభకోణం నడిచిందని నిర్ధారించారు. అయితే ఇప్పటికే మూడు సార్లు విచారణకు రావాల్సిందిగా కసిరెడ్డికి సిట్ నోటీసులు జారీ చేసింది. అయితే మూడు సార్లు కూడా విచారణకు డుమ్మా కొట్టారు. అంతేకాకుండా కసిరెడ్డి ఫోన్లు కూడా స్విచ్‌ఆఫ్ చేసిన పరిస్థితి. ఆయన కుటుంబసభ్యులను కలిసి నోటీసులు ఇచ్చారు. అలాగే కసిరెడ్డి తండ్రికి నోటీసులు జారీ చేశారు. మరోవైపు ఈ కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి రేపు విచారణకు హాజరుకావాల్సిందిగా నోటీసులు ఇచ్చారు. అయితే మిథున్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. విచారణలో న్యాయవాదిని అనుమతించాలని, వీడియో రికార్డింగ్ చేసేలా ఆదేశించాలని పిటిషన్‌లో కోరారు. మిథున్ రెడ్డి వేసిన పిటిషన్‌పై ఈరోజు విచారణకు వచ్చే అవకాశం ఉంది.
కాగా.. మిథున్ రెడ్డితో కలిసి విజయసాయిరెడ్డిని విచారించాలని భావించిన సిట్.. విచారణకు రావాల్సిందిగా సాయిరెడ్డికి నోటీసులు ఇచ్చారు. గతంలో కాకినాడ పోర్ట్ వ్యవహారానికి సంబంధించి సీఐడీ విచారణకు హాజరైన సమయంలో మొత్తం మద్యం కుంభకోణంపై మీడియా అడిగిన ప్రశ్నకు సాయిరెడ్డి సంచలనంగా వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యవహారం అంతా కసిరెడ్డి కనుసన్నల్లోనే నడిచిందని, దానికి సంబంధించి ఎలాంటి సమాచారం కావాలన్నా అధికారులకు తాను అందిస్తానని గతంలో ప్రకటించారు. ఈ నేపథ్యంలో సాయిరెడ్డికి నోటీసులు ఇచ్చిన సిట్ అధికారులు.. విచారణకు వచ్చి తన వద్ద ఉన్న వివరాలు ఇవ్వాల్సిందిగా కోరారు. కొన్ని కారణాల వల్ల ముందు రోజే వస్తారని సమాచారం పంపారు మాజీ ఎంపీ. దీంతో ఈరోజు ఉదయమే విజయవాడ సీపీ కార్యాలయంలో ఉన్న సిట్ కార్యాలయంలో సిట్ బృందం చేరుకుంది. సీపీ కార్యాలయం బయట కూడా భారీ భద్రతను ఏర్పాటు చేశారు. అయితే మధ్యాహ్నం 12 అయినప్పటికీ సాయిరెడ్డి విచారణకు రాలేదు. కొన్ని కారణాల వల్ల విచారణకు హాజరుకాలేకపోతున్నానని, మళ్లీ ఎప్పుడు వచ్చేది సమాచారం అందిస్తానని సిట్ అధికారులకు కబురు పంపారు. విజయసాయిరెడ్డి వ్యవహారంతో సిట్ అధికారులు అవాక్కైన పరిస్థితి. ముందు రోజే వస్తానని స్వయంగా సమాచారం ఇచ్చి.. మధ్యాహ్నం వరకు కూడా ఎదురు చూసేలా చేసి మరి ఇప్పుడు మళ్లీ రాలేకపోతున్నట్లు సమాచారం పంపడంపై పోలీసులు ఆరా తీస్తున్న పరిస్థితి.