వనమెల్లా చెరిచి..
ABN , Publish Date - Jul 31 , 2025 | 01:04 AM
జగ్గయ్యపేట రిజర్వు ఫారెస్ట్ కనుమరుగవుతోంది. పర్యావరణాన్ని కాపాడే ఈ దట్టమైన అటవీ ప్రాంతం మైనింగ్ కార్యకలాపాల కారణంగా రానురానూ కుచించుకుపోతోంది. ఈ ప్రభావం జగ్గయ్యపేట ప్రజలపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. అటవీ విస్తీర్ణం తగ్గిపోవటంతో భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. ఇప్పటికే తాగు, సాగునీటి కోసం తెలంగాణాపై ఆధారపడుతుండగా, భవిష్యత్తులో పరిస్థితి ఏమిటా.. అని నియోజకవర్గ ప్రజలు భయాందోళన చెందుతున్నారు.

కనుమరుగవుతున్న జగ్గయ్యపేట అటవీ ప్రాంతం
సున్నపురాయి నిక్షేపాల తవ్వకాలతో తగ్గుతున్న విస్తీర్ణం
6,905.42 హెక్టార్లకు గానూ 4,200 హెక్టార్లే మిగులు
వైసీపీ హయాంలో అడ్డదిడ్డంగా కేటాయింపులు, తవ్వకాలు
కూటమి ప్రభుత్వంలోనూ రాజకీయ నేతల కన్ను
ఇప్పటికే అడుగంటుతున్న భూగర్భ జలాలు
కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ దృష్టి పెట్టాలి
(ఆంధ్రజ్యోతి, జగ్గయ్యపేట రూరల్) : జగ్గయ్యపేట రిజర్వు ఫారెస్ట్ మొత్తం 6,905.42 హెక్టార్లలో విస్తరించి ఉంది. మిగిలిన అడవుల మాదిరిగా కాకుండా సున్నపురాయి నిక్షేపాలతో కూడుకున్న అటవీ ప్రాంతమిది. దండకారణ్యంలా కనిపించదు. ఇక్కడి సున్నపురాయి నిక్షేపాలపై ఆధార పడి జగ్గయ్యపేటలో పలు సిమెంట్ ఫ్యాక్టరీలు ఏర్పడ్డాయి. ఇక్కడి రిజర్వు ఫారెస్టులో ప్రస్తుతం మైనింగ్‌కు అనుమతులు పోను 4,200 హెక్టార్ల అటవీ ప్రాంతమే మిగిలి ఉంది. ఈ ప్రాంతాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత జిల్లా యంత్రాంగంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం పైనా ఉంది.
పరిధి ఇలా..
జగ్గయ్యపేట నియోజకవర్గ పరిధిలో మొత్తం 6,905.42 హెక్టార్ల రిజర్వ్ ఫారెస్ట్ ఉంది. జగ్గయ్యపేట మండలం చిల్లకల్లు గ్రామంలోని సర్వే నెంబరు 260లో 153 హెక్టార్లు, రావిరాలలో సర్వే నెంబర్ 124లో 666.24 హెక్టార్లు, బండిపాలెంలో 341, 339/2, 3/2, 4/2లలో 273 హెక్టార్లు, పోచంపల్లిలో 360లో 430.97 హెక్టార్లు, గౌరవరంలో 310లో 45.96 హెక్టార్లు, గండ్రాయిలో 220, 221 223/1లో 204 హెక్టార్లు, తక్కెళ్లపాడులో 98లో 58.53 హెక్టార్లు, రామచంద్రునిపేట గ్రామంలో 94లో 27.89 హెక్టార్లు, జగ్గయ్యపేటలోని 236లో 1770.42 హెక్టార్లు, త్రిపురవరంలో సర్వే నెంబరు ఒకటిలో 98.53 హెక్టార్లు, బూదవాడ 328/5, 361, 344, 61, 376, 362లో 823 హెక్టార్ల మేర ఫారెస్ట్ విస్తరించి ఉంది.
మైనింగ్ కార్యకలాపాల కోసం కేటాయింపులు ఇలా..
జగ్గయ్యపేట రిజర్వు ఫారెస్ట్‌లో మైనింగ్ కార్యకలాపాల కోసం మొత్తం 1,900 హెక్టార్లను కేటాయించారు. రామ్‌కో సిమెంట్స్‌కు 220.72 హెక్టార్లు, ఆలా్ట్రటెక్ కర్మాగారానికి 622.229 హెక్టార్లు, విశాఖ స్టీల్ ప్లాంట్‌కు 900 హెక్టార్లు, కాకతీయ సిమెంట్స్‌కు 120.46 హెక్టార్ల భూములు ఇచ్చారు. వన సంరక్షణ సమితికి మరో 2,500 హెక్టార్లు కేటాయించారు.
రాజకీయ గద్దల కన్ను
రిజర్వు ఫారెస్ట్‌లో కేటాయింపులు పోను ఇంకా 4,200 హెక్టార్ల అటవీ ప్రాంతం ఉంది. సున్నపురాయి నిక్షేపాలు ఉండటంతో వీటిపై రాజకీయ గద్దల కన్ను పడింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో కడప, కర్నూలు ప్రాంతాలకు చెందిన నేతలు 4,200 హెక్టార్లలో మైనింగ్‌కు దరఖాస్తు చేసుకున్నట్టు తెలుస్తోంది. కూటమి అధికారంలోకి రావటంతో కేటాయింపులు ఆగాయని సమాచారం. కేటాయింపులు అమల్లోకి వస్తే దాదాపు రిజర్వు ఫారెస్ట్ కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడింది. కూటమి ప్రభుత్వంలోనూ అధికార పార్టీ నాయకులు కొందరి కన్ను ఈ సున్నపురాయి నిక్షే పాలపై పడింది. మిగులు అటవీ ప్రాంతాన్ని కనుక మైనింగ్‌కు అప్పగిస్తే పర్యావరణ సమతుల్యత దెబ్బతినటంతో పాటు జగ్గయ్యపేట కరువు ప్రాంతంగా మారే పరిస్థితి ఏర్పడుతుంది. సాగు, తాగునీటి కోసం తెలంగాణాపై ఆదారపడాల్సిన వస్తుంది.
గాడితప్పిన వన సంరక్షణ
వన సంరక్షణ కింద రెండు దశాబ్దాల కిందట 2,500 హెక్టార్లు కేటాయించినా ఆశించిన లక్ష్యం నెరవేరలేదు. వనాలు పర్యవేక్షణలోపంతో కుమరుగయ్యాయి. కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నా క్షేత్రస్థాయిలో సత్ఫలితాలు ఇవ్వట్లేదు. ప్రకృతి సంపదను ప్రైవేట్ సంస్థలకు దోచిపెట్టే కార్యక్రమానికి ముగింపు పలికి.. మిగిలిన అటవీ ప్రాంతాన్నైనా సంరక్షించగలిగితే భావితరాలకు మంచిచేసిన వారవుతారు.