Share News

వేగవంతంగా..

ABN , Publish Date - Aug 02 , 2025 | 12:43 AM

గత వైసీపీ హయాంలో జగనన్న కాలనీల్లో ఇళ్ల స్థలాల కేటాయింపులో అవకతవకలను సరిచేసే కార్యక్రమానికి ప్రభుత్వం తెరలేపింది. వైసీపీ కార్యకర్తల ముసుగులో ఆ పార్టీ నేతలు, వారి అనుచరులకు అడ్డగోలుగా స్థలాలు ఇచ్చేశారు. కొందరు ఇళ్లు కూడా నిర్మించుకున్నారు. మరికొందరు ఈ స్థలాలను విక్రయించేశారు.

వేగవంతంగా..
గిలకలదిండిలో ఇంటి నిర్మాణాలు ప్రారంభించని లే అవుట్‌

జగనన్న స్థలాల సర్వే

జిల్లాలో అనర్హుల ఏరివేతపై యంత్రాంగం దృష్టి

నాడు వైసీపీ కార్యకర్తల ముసుగులో ఉచిత స్థలాలు

అనర్హులను గుర్తించి తొలగించాలని ప్రభుత్వ ఆదేశాలు

జిల్లాలో రెండు నెలలుగా సాగుతున్న సర్వే ప్రక్రియ

నేటి నుంచి ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని ఆదేశాలు

మండలాలవారీగా చేసేందుకు తహసీల్దార్ల సమావేశాలు

అనర్హుల గుర్తింపులోనూ గందరగోళం

ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం : గత వైసీపీ హయాంలో జగనన్న కాలనీల్లో ఇళ్ల స్థలాల కేటాయింపులో అవకతవకలను సరిచేసే కార్యక్రమానికి ప్రభుత్వం తెరలేపింది. వైసీపీ కార్యకర్తల ముసుగులో ఆ పార్టీ నేతలు, వారి అనుచరులకు అడ్డగోలుగా స్థలాలు ఇచ్చేశారు. కొందరు ఇళ్లు కూడా నిర్మించుకున్నారు. మరికొందరు ఈ స్థలాలను విక్రయించేశారు. స్థలాల పంపిణీ కోసం భూమి కొనుగోలు చేసిన సమయంలోనూ వైసీపీ నాయకులు తెరవెనుక చక్రంతిప్పి కమీషన్లు కాజేశారు. శ్రీసత్యసాయి జిల్లాలో 80 శాతం మంది అనర్హులకు స్థలాలు ఇచ్చారని తేలడంతో కూటమి ప్రభుత్వం అప్రమత్తమైంది. జిల్లాలోని అన్ని జగనన్న కాలనీల్లో స్థలాలు పొందిన లబ్ధిదారుల్లో అర్హులు ఎంతమంది, అనర్హులు ఎంతమంది ఉన్నారనే అంశంపై సర్వే చేయాలని ఆదేశాలు జారీ చేసింది.

ఇప్పటివరకు వెయ్యిమంది గుర్తింపు

జిల్లాలో 1.25 లక్షల ఇళ్ల స్థలాలను ఇచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. స్థలాలు పొందిన వారిలో అన ర్హులు ఎంతమంది ఉన్నారనే అంశంపై రెండు నెలలుగా సర్వే జరుగుతుండగా, రెవెన్యూ, మున్సిపల్‌ సిబ్బంది తమ నివేదికలో ఇప్పటివరకు వెయ్యిమందిని అనర్హులు చూపించారు. వీఆర్వోల సర్వే నివేదిక పూర్తిస్థాయిలో అందలేదు. దీంతో ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. సర్వే ప్రక్రియ నత్తనడకన నడుస్తుండటంతో ఇన్‌చార్జి కలెక్టర్‌ గీతాంజలిశర్మ శుక్రవారం రెవెన్యూ, మున్సిపల్‌ విభాగాల అధికారులతో టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. స్థలాలు పొందిన వారిలో అనర్హులను గుర్తించే ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. శనివారం నుంచే ఈ ప్రక్రియను వేగవంతం చేసి ప్రభుత్వం ఇచ్చిన ప్రత్యేక యాప్‌లో అప్‌లోడ్‌ చేయాలన్నారు. ఈ ఆదేశాల మేరకు తహసీల్దార్లు వారి మండలాల పరిధిలో వీఆర్వోలతో సమావేశం నిర్వహించి అనర్హులను గుర్తించే ప్రక్రియను వేగవంతం చేయనున్నారు.

పెండింగ్‌లో 20 వేల దరఖాస్తులు

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లో ఇప్పటివరకు స్థలాల కోసం 20 వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. సచివాలయాల ద్వారా పేదలు ఈ దరఖాస్తులు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో జగనన్న కాలనీల్లో స్థలాలు తీసుకున్న వారిలో అనర్హులను గుర్తించి, వారి పట్టాలు రద్దుచేసి, అర్హులకు ఇస్తారా... అనే అంశంపై చర్చ జరుగుతోంది. ఈ అంశంలోనూ ఇబ్బందులు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. గతంలో స్థలాలు ఇచ్చిన కొద్దిరోజులకే లబ్ధిదారుడి పేరిట రిజిస్ర్టేషన్‌ చేయించారని చెబుతున్నారు. ఇప్పుడు జరిగే సర్వేలో అనర్హులను గుర్తించి, వారికి నోటీసులు జారీచేసి, స్థలం వెనక్కి తీసుకోవాలంటే తీవ్రజాప్యమయ్యే పరిస్థితి ఉందనేది వారి అభిప్రాయం. చాలామంది అనర్హులు ఇప్పటికే ఇళ్లు కూడా నిర్మించుకున్నారు. ఉదాహరణకు మచిలీపట్నం కరగ్రహారం లే అవుట్‌లో 16 వేల ఇళ్ల స్థలాలు ఉన్నాయి. వీటిలో అధికశాతం మంది ఇళ్ల నిర్మాణం ప్రారంభించలేదు. కొందరు వివిధ అవసరాల కోసం స్థలాలను విక్రయించేశారు. ఈ స్థితిలో ఎవరిని అర్హులుగా, అనర్హులుగా గుర్తిస్తారనే అంశం గందరగోళం ఏర్పడింది. గిలకలదిండిలో 950 మందికిపైగా లబ్ధిదారులకు స్థలాలు ఇవ్వగా, ఇక్కడ ఒక్క ఇల్లు కూడా నిర్మించలేదు. ఖాళీ స్థలాలపై సర్వేచేసి ఎలాంటి నివేదికను ఇస్తారనే అంశంపైనా చర్చ నడుస్తోంది.

రెండు నెలలుగా సాగుతున్న సర్వే

జగనన్న కాలనీల్లో ఇచ్చిన స్థలాలు పొందిన లబ్ధిదారుల్లో ఎంతమంది అనర్హులు ఉన్నారనే అంశంపై సర్వేచేసి నివేదిక ఇవ్వాలని రెండు నెలల క్రితమే ప్రభుత్వం ఆదేశించింది. దీంతో రెవెన్యూ విభాగంలోని వీఆర్వోలు, మున్సిపల్‌ విభాగ అధికారులు సర్వే చేస్తున్నారు. కానీ, వేగవంతంగా జరగట్లేదు. గ్రామ, పట్టణ స్థాయిలో వైసీపీ నాయకులు అడ్డుపడుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. స్థలాల జాబితాలు తయారుచేసే సమయంలో గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందిపై వివిధ రూపాల్లో వైసీపీ నాయకులు ఒత్తిడి తెచ్చి అనర్హులనూ అర్హులుగా చూపించారు. స్థలాలు ఇప్పించారు. అక్రమంగా స్థలాలు తీసుకున్నారని పలువురు ఫిర్యాదులు చేసినా.. అప్పట్లో అధికారులు పట్టించుకోలేదు.

Updated Date - Aug 02 , 2025 | 12:43 AM