Share News

అందంగా అమరావతి

ABN , Publish Date - Apr 29 , 2025 | 12:22 AM

అమరావతి పునర్నిర్మాణ శంకుస్థాపనకు కౌంట్‌డౌన్‌ మొదలైంది. వచ్చేనెల 2వ తేదీన వెలగపూడిలో జరిగే ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ పాల్గొననుండటంతో సభా ప్రాంగణాన్ని అందంగా ముస్తాబు చేస్తున్నారు.

అందంగా అమరావతి
సిద్ధమైన ప్రధాన వేదిక

పునర్నిర్మాణ శంకుస్థాపనకు ప్రత్యేక ఏర్పాట్లు

ప్రధాని మోదీ రానుండటంతో చకచకా పనులు

ఇప్పటికే పూర్తయిన ప్రధాన వేదికలు, గ్యాలరీలు

మోదీ రోడ్డు షో కోసం ప్రత్యేక రోడ్డు నిర్మాణం

నందనవనాలుగా మారిన ప్రధాన రహదారులు

అమరావతికి వచ్చేవారి కోసం సూచిక బోర్డులు

(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : అమరావతి పునర్నిర్మాణ శంకుస్థాపనకు కౌంట్‌డౌన్‌ మొదలైంది. వచ్చేనెల 2వ తేదీన వెలగపూడిలో జరిగే ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ పాల్గొననుండటంతో సభా ప్రాంగణాన్ని అందంగా ముస్తాబు చేస్తున్నారు. పనులన్నీ తుదిదశకు చేరుకున్నాయి. ముఖ్యంగా మూడు వేదికల పనులు పూర్తయ్యాయి. సాంస్కృతిక కళావేదికను సంప్రదాయబద్ధంగా సిద్ధం చేశారు. లక్షా ఇరవై వేలమంది కూర్చునేలా మూడు భారీ వేదికలు ఏర్పాటయ్యాయి. వీటిలో గ్యాలరీ పనులన్నీ పూర్తిచేశారు. వీఐపీలు కూర్చోవటానికి సోఫాలు, అధికారులు కూర్చోవటానికి వీలుగా ఫోమ్‌ కుర్చీలు, ప్రజలు కూర్చోవటానికి వీలుగా కుర్చీలను సిద్ధం చేశారు. వేసవిని దృష్టిలో పెట్టుకుని పెద్ద ఎత్తున కూలర్లను ఏర్పాటు చేస్తున్నారు. ప్రధానమంత్రి దిగే హెలిప్యాడ్‌ నుంచి వేదికకు చేరుకునే వరకూ రోడ్డు మార్గాన్ని బీటీ రోడ్డుగా అభివృద్ధి చేశారు. ప్రధాన రహదారులను మొక్కలతో ముస్తాబు చేశారు. అమరావతికి వచ్చేవారు ఎటు వెళ్లాలో తెలుసుకునేలా అధునాతన డైరెక్షన్‌ బోర్డులు కూడా ఏర్పాటు చేశారు.

Updated Date - Apr 29 , 2025 | 12:23 AM