మాయదారి మలుపులు
ABN , Publish Date - Jul 31 , 2025 | 01:03 AM
నిబంధనల ప్రకారం జాతీయ రహదారులపై స్పీడు బ్రేకర్లు ఏర్పాటు చేయకూడదు. స్పీడు బ్రేకర్లు ఏర్పాటుచేస్తే అది జాతీయ రహదారి ఎందుకవుతుంది? రాష్ట్ర రహదారి అవుతుంది. : ఓ కారు యజమాని అభిప్రాయం. నగరంలోని నేతాజీ వంతెన నుంచి కృష్ణలంక పోలీసు స్టేషన్ వరకు ఉన్న స్ర్టెచ్‌లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో మూడు నెలల్లో పదిమంది ప్రాణాలు కోల్పోయారు. ఒక్క నేతాజీ బ్రిడ్జి దగ్గరే ఈ నెలలో ముగ్గురు చనిపోయారు. : ఓ పోలీసు అధికారి చెప్పిన లెక్క. బందరు రోడ్డులోకి రావాలంటే మేం జాతీయ రహదారి దాటాలి. పగటి పూట రోడ్డు దాటుతుంటే పోలీసులు ట్రాఫిక్ ఆపుతున్నారు. రాత్రిపూట ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని రోడ్డు దాటాల్సి వస్తోంది. : ఓ పాదచారి మాట.

డేంజర్ జోన్‌గా నేతాజీ బ్రిడ్జి-పీఎన్‌బీఎస్ మార్గం
గత మూడు నెలల్లో పదిమంది దుర్మరణం
నేతాజీ బ్రిడ్జి వద్ద రోడ్డు దాటాలంటే పద్మవ్యూహమే
సరైన మార్గనిర్దేశం లేక పాదచారులకు అష్టకష్టాలు
తాజా స్పీడ్ బ్రేకర్లతో వాహనదారులకు సమస్య
మసీదు వద్ద బాటిల్ నెక్‌తో ఇరుగ్గా రహదారి
ఎదురెళ్లి ప్రమాదాల బారిన పడుతున్న వాహనదారులు
అమెరికన్ ఆసుపత్రి వద్ద పరిస్థితి మరీ ఘోరం
ఇక్కడి వంతెన రోడ్డుకు డౌన్‌లో ఉండటంతో ప్రమాదాలు
ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్న పోలీసులు
(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : విజయవాడ-గుంటూరు, మచిలీపట్నం-హైదరాబాద్ జాతీయ రహదారులపై నేతాజీ బ్రిడ్జి నుంచి పీఎన్‌బీఎస్ వరకు ఉన్న సె్ట్రచ్ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. నేతాజీ బ్రిడ్జి, అమెరికన్ ఆసుపత్రి వంతెన, సత్యంగారి హోటల్ వద్ద కటింగ్‌లో వాహనదారులు, పాదచారులు ఎక్కువగా ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ ప్రాంతాల్లో ఉన్న భౌగోళిక, ఇంజనీరింగ్ సమస్యలతో ప్రమాదాలు జరుగుతున్నాయి. నేతాజీ బ్రిడ్జి నుంచి పీఎన్‌బీఎస్ వరకు ఉన్న సె్ట్రచ్‌లో మూడు నెలల్లో పదిమంది వాహనదారులు, పాదచారులు ప్రాణాలు కోల్పోయారు. ఒక్క నేతాజీ బ్రిడ్జి వద్దే ఈనెలలో ముగ్గురు ప్రాణాలు విడిచారు. ఎంజీ రోడ్డులో నుంచి రాణిగారితోటలోకి రాత్రి సమయంలో రోడ్డు దాటుతున్న ఓ మహిళను ఫ్లైఓవర్ నుంచి వస్తున్న లారీ ఢీకొంది. అక్కడికక్కడే చనిపోయింది. ఓ వ్యక్తి అన్న క్యాంటీన్‌లో భోజనం చేసి రాణిగారితోట వైపునకు వెళ్తుండగా గుంటూరు వైపు నుంచి వస్తున్న వాహనం ఢీకొనడంతో ప్రాణాలు కోల్పోయాడు. సత్యంగారి హోటల్ వద్ద కూడా రోడ్డు దాటుతున్న వాహనదారులను బస్సులు ఢీకొట్టాయి. జాతీయ రహదారి నగరం మధ్య నుంచి వెళ్లడం, వాహనదారులకు సరిపడా అంతర్గత మార్గాలు లేకపోవడంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో తెలియని పరిస్థితి.
నేతాజీ బ్రిడ్జి వద్ద నరకం
కనకదుర్గమ్మ వారధి పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్య తారస్థాయికి చేరింది. వారధికి అనుసంధానమై ఉన్న ఫ్లైఓవర్ ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు ఏర్పాటుచేసిన స్పీడు బ్రేకర్లతో ఆ ప్రదేశంపై ఇప్పుడు తీవ్ర చర్చ నడుస్తోంది. వారధి ఫ్లైఓవర్‌కు ముందుభాగాన జాతీయ రహదారిపై నేతాజీ బ్రిడ్జి ఉంది. ఇది జాతీయ రహదారిని, ఎంజీ రోడ్డును కలుపుతుంది. కృష్ణలంక, రాణిగారితోట ప్రాంతాల ప్రజలు ఎంజీ రోడ్డులోకి ఈ మార్గంలోనే వెళ్తారు. నేతాజీ బ్రిడ్జికి ఎదురుగా రాణిగారితోటలోకి వెళ్లడానికి, అక్కడి నుంచి జాతీయ రహదారి పైకి రావడానికి కటింగ్ ఉంది. ఈ ప్రదేశంలోనే విజయవాడ-గుంటూరు-విజయవాడ మార్గానికి మధ్యలో ఇనుప బద్దెలతో ఏర్పాటుచేసిన మూవింగ్ గేట్‌ను డివైడర్‌గా ఏర్పాటు చేశారు. ఎంజీ రోడ్డులో నుంచి వీఐపీలు మంగళగిరి వెళ్లే సమయాల్లో ఈ గేటును తెరుస్తున్నారు. ఆ సమయంలో రెండువైపులా వాహనాలను ఆపుతారు. రాణిగారితోట చుట్టుపక్కల ప్రదేశాల నుంచి ఎంజీ రోడ్డులోకి వెళ్లేవారు జాతీయ రహదారిని దాటి నేతాజీ బ్రిడ్జి మీదకు వస్తారు. అక్కడి నుంచి పశువుల ఆసుపత్రి కూడలికి చేరుకుని ఎంజీ రోడ్డులోకి ప్రవేశిస్తారు. సరిగ్గా గుంటూరు వైపు నుంచి వచ్చే వాహనాలు ఇక్కడే ఫ్లైఓవర్ దిగుతాయి. మరికొన్ని వాహనాలు ఎంజీ రోడ్డులోకి మలుపు తిరిగి నేతాజీ బ్రిడ్జి పైకి వెళ్తున్నాయి. పై నుంచి దిగే క్రమం కావడంతో వాహనాలు వేగంగా వస్తున్నాయి. వాటిని గమనించకుండా పాదచారులు రోడ్డు దాటడంతో ప్రాణాలు కోల్పోతున్నారు. పగటిపూట అయితే.. పాదచారులు రోడ్డు దాటేటప్పుడు ట్రాఫిక్ పోలీసులు వాహనాలను ఆపుతున్నారు. రాత్రిపూట పోలీసులు ఉండకపోవడంతో పాదాచారులు వాహనాలను గమనించకుండా రోడ్డు దాటేస్తున్నారు. ఫ్లైఓవర్, పీఎన్‌బీఎస్ వైపు నుంచి వచ్చే వాహనాలు వేగంగా వస్తుండటంతో స్పీడు బ్రేకర్లు ఉన్న ప్రదేశంలో ఈనెలలో ముగ్గురు దుర్మరణం చెందారు. ఈ ప్రమాదాల నియంత్రణకు విజయవాడ-గుంటూరు-విజయవాడ మార్గంలో ఏర్పాటుచేసిన స్పీడు బ్రేకర్లు ఇప్పుడు కొత్త సమస్యను తీసుకొచ్చాయి. సరిగ్గా ఇక్కడికి వచ్చే సరికి వాహనాలు నెమ్మదిగా కదలడంతో ట్రాఫిక్ ఆగిపోతోంది.
ఎఫ్‌వోబీపై ముందుకెళ్లి వెనక్కి
నేతాజీ బ్రిడ్జి దాటాక మరో ప్రమాదకరమైన ప్రదేశం అమెరికన్ ఆసుపత్రి బ్రిడ్జి. పీఎన్‌బీఎస్‌కు వెళ్లే మార్గంలో ఈ బ్రిడ్జికి ఎదురుగా, వారధి ఐలాండ్‌కు సమీపాన రోడ్డు కటింగ్ ఉంది. కృష్ణలంకలోకి వెళ్లడానికి ఇదొక మార్గం. ఇదికాకుండా కృష్ణలంక జాతీయ రహదారిపై ఉన్న ఫ్లైఓవర్‌కు దిగువన అండర్ పాస్ నుంచి మరో మార్గం ఉంది. కృష్ణలంక నుంచి ఎంజీ రోడ్డులోకి వెళ్లే వాహనదారులు అమెరికన్ ఆసుపత్రి సమీపాన ఉన్న వంతెన వద్ద యూటర్న్ తీసుకుని వెళ్తున్నారు. ఎంజీ రోడ్డు నుంచి కృష్ణలంకలోకి వెళ్లే పాదచారులు ఇక్కడే రహదారిని దాటతారు. ఇక్కడ వంతెన పల్లంగా ఉండటం, జాతీయ రహదారి ఎత్తులో ఉండటంతో అమెరికన్ ఆసుపత్రి వైపు నుంచి జాతీయ రహదారిపైకి వచ్చే వాహనాలు ఇక్కడే వేగంగా పైకి వస్తున్నాయి. పీఎన్‌బీఎస్ వైపు నుంచి వచ్చే వాహనాలు వేగంగా రావడంతో యూటర్న్ వద్ద, అమెరికన్ ఆసుపత్రి వంతెన వద్ద ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇక్కడ ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మిస్తే బాగుంటుందన్న ప్రతిపాదన అధికారుల నుంచి వ్యక్తమైంది. దీనివల్ల ఎలాంటి ప్రయోజనం లేదని భావించి వెనక్కి తగ్గారు. ఒకవేళ నిర్మించినా పాదచారులు ఉపయోగించరని భావిస్తున్నారు.
విస్తరిస్తేనే ఫలితం
వారధి ఫ్లైఓవర్ కింద బౌద్ధచక్రం ఐలాండ్ వద్ద మూడు మలుపులు ఉన్నాయి. రాణిగారితోట, గీతానగర్ కట్ట, రామలింగేశ్వరనగర్ నుంచి ఎంజీ రోడ్డులోకి వెళ్లడానికి ఫ్లై ఓవర్ కింద ఒక మలుపు ఉంది. ఇక్కడ మలుపు తీసుకున్న వాహనాలు నేతాజీ బ్రిడ్జి మీదకు వెళ్తాయి. బ్రిడ్జికి సమీపాన ఉన్న మసీదు ప్రహరీతో ఇక్కడ రహదారి బాటిల్‌నెక్‌గా మారింది. ఐలాండ్ వరకు విశాలంగా ఉన్న రహదారి కాస్త ముందుకొచ్చే సరికి ఇరుకైంది. ఎంజీ రోడ్డు నుంచి కృష్ణలంకలోకి, గుంటూరువైపు మార్గంలోకి వెళ్లాల్సిన వాహనదారులు నేతాజీ బ్రిడ్జి మీద నుంచి ఎడమ వైపునకు తిరిగి సాయిబాబా గుడి ముందుగా వెళ్లి రాణిగారితోట వద్ద యూటర్న్ తీసుకోవాలి. ఇది దూరం కావడంతో వాహనదారులు బ్రిడ్జి నుంచి కుడి వైపునకు తిరిగి వ్యతిరేక మార్గంలో వెళ్తున్నారు. పీఎన్‌బీఎస్ నుంచి వచ్చే వాహనాలు వేగంగా వస్తుండటంతో ఇక్కడ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇక్కడ బాటిల్‌నెక్ రోడ్డును విస్తరించి కుడి వైపునకు వాహనాలను రాకుండా అడ్డుకట్ట వేస్తేనే ప్రమాదాలను అరికట్టవచ్చు. అలాగే, సాయిబాబా గుడివైపు నుంచి రామలింగేశ్వరనగర్ క్రాస్‌రోడ్డు వరకు సర్వీసు రహదారిని నిర్మిస్తే నేతాజీ బ్రిడ్జి-పీఎన్‌బీఎస్ సె్ట్రచ్‌లో ప్రమాదాలు తగ్గుతాయని వాహనదారులు అభిప్రాయపడుతున్నారు.