Share News

ఉత్తుత్తి తనిఖీలు

ABN , Publish Date - Aug 02 , 2025 | 12:51 AM

ఏదైనా సంఘటనలు జరిగితేనే స్పందించటం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులకు అలవాటైపోయింది. ప్రైవేట్‌ ఆసుపత్రులు, క్లినిక్‌లు, మెడికల్‌ ల్యాబ్‌ల వంటి వాటిని క్రమంగా తనిఖీలు చేస్తుంటే, సృష్టి ఫెర్టిలిటీ సెంటర్‌ వంటి మోసాలు ముందే వెలుగులోకి వచ్చేవి. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టుగా సృష్టి ఉదంతం తర్వాత వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ఇప్పుడు స్పందించడం, అది కూడా ల్యాబ్‌లు, చిన్నచిన్న క్లినిక్‌లలోనే తనిఖీ చేస్తుండటం విమర్శలకు దారితీస్తోంది.

ఉత్తుత్తి తనిఖీలు

ఫెర్టిలిటీల జోలికే వెళ్లని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు

సృష్టి వ్యవహారం నేపథ్యంలో కేవలం హడావిడే..

చిన్నచిన్న ల్యాబ్‌లు, క్లినిక్‌లకే పరిమితం

నగరంలోని ఫెర్టిలిటీ సెంటర్లపై పెట్టని దృష్టి

తనిఖీలు నిర్వహిస్తేనే అక్రమాలు బయటపడేది

విజయవాడ, ఆగస్టు 1 (ఆంధ్రజ్యోతి) : సృష్టి ఫెర్టిలిటీ సెంటర్‌ అడ్డగోలు వ్యవహారాలపై రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ వ్యవహారానికి కేంద్రం హైదరాబాద్‌ అయినప్పటికీ దానికి సంబంధించిన మూలాలు విజయవాడ, విశాఖపట్నంలో ఉన్నట్టు తెలంగాణ పోలీసులు గుర్తించారు. నగరంలో ఇలాంటివి 17 వరకు ఉన్నాయి. ఇవి అధికారికంగా నిర్వహిస్తున్నారా? అనధికారికంగా నిర్వహిస్తున్నారా? అనేఅనుమానాలు లేకపోలేదు. అయినా ఇలాంటి వాటిని వదిలేసి, కేవలం ల్యాబ్‌లు, ఏఆర్‌టీ క్లినిక్‌లనే వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తనిఖీ చేయడం విస్మయానికి గురిచేస్తోంది. సృష్టి వ్యవహారం వెలుగులోకి వచ్చాక రెండు తెలుగు రాష్ర్టాల్లో ఆయా జిల్లాల వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ఐవీఎఫ్‌ కేంద్రాలపై తనిఖీలు నిర్వహించారు. ఎన్టీఆర్‌ జిల్లా ఆరోగ్యశాఖ అధికారుల్లో మాత్రం స్పందన లేదు. ఇప్పటికే జిల్లాలోని కొన్ని ఐవీఎఫ్‌, సరోగసీ కేంద్రాలపై అనేక ఆరోపణలు ఉన్నాయి. వీటిపై పూర్తిస్థాయిలో దృష్టిసారించాల్సిన అవసరం ఉంది.

సృష్టి మూలాలు ఇక్కడ ఉన్నాయా?

సృష్టి ఫెర్టిలిటీ వ్యవహారంపై హైదరాబాద్‌ పోలీసులు లోతుగానే విచారణ జరుపుతున్నారు. దీనికి సంబంధించిన మూలాలు నగరంలోనూ ఉన్నట్టు గుర్తించారు. నగరంలోని యూనివర్సిల్‌ ఫెర్టిలిటీ సెంటర్‌.. డాక్టర్‌ నమ్రతకు చెందినదిగా పోలీసుల విచారణలో వెలుగులోకి వచ్చింది. ఈ కేంద్రాన్ని సుమారు 27 ఏళ్లుగా నిర్వహిస్తున్నట్టు తేలింది. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు క్రమం తప్పకుండా తనిఖీలు చేసి ఉంటే యూనివర్శిల్‌ ఫెర్టిలిటీ సెంటర్‌ బాగోతాలు బయటపడేవి. పోలీసులు విచారణ చేసే వరకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ఏం చేస్తున్నారో అర్థంకాని పరిస్థితి ఏర్పడింది. అసలు జిల్లాలో ఎన్ని ఫెర్టిలిటీ సెంటర్లు ఉన్నాయి, వాటికి సంబంధించిన రిజిస్ర్టేషన్లు, అనుమతులు ఉన్నాయా లేదా అనే విషయాలను తనిఖీ చేయాల్సిన అధికారులు కనీసం ఆయా సెంటర్లలోకి వెళ్లి లోతుగా దర్యాప్తు చేసిన దాఖలాలు లేవు. సృష్టి వ్యవహారం వెలుగులోకి వచ్చాక కేవలం నమ్రతకు చెందిన యూనివర్సిల్‌ ఫెర్టిలిటీ సెంటర్‌ను తప్ప మిగిలిన సెంటర్లపై తనిఖీలు చేయలేదనే ఆరోపణలు వస్తున్నాయి. నిరుపేద మహిళలే లక్ష్యంగా సరోగసీ నిర్వహిస్తున్నారన్న ఆరోపణలు ఎప్పటినుంచో ఉన్నాయి. ఇప్పటికైనా అధికారులు దృష్టిసారించాల్సిన అవసరం ఉంది.

సంచలనమైనా స్పందన లేదు

సృష్టి ఫెర్టిలిటీ వ్యవహారం సంచలనమైనా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారుల్లో ఎలాంటి చలనం లేకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సుమారు వారం అవుతున్నా ఇప్పటికీ జిల్లాలోని ఫెర్టిలిటీ కేంద్రాలపై తనిఖీలు చేసింది లేదు.

Updated Date - Aug 02 , 2025 | 12:51 AM