Maoist Leader Hidma: మావోయిస్టు అగ్రనేత హిడ్మా ఎన్‌కౌంటర్‌లో బిగ్ ట్విస్ట్
ABN , Publish Date - Nov 19 , 2025 | 09:10 AM
మావోయిస్టు అగ్రనేత హిడ్మా ఎన్‌కౌంటర్‌లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. పోలీసులకు హిడ్మా రాసినట్లు ఓ లేఖ ప్రస్తుతం సంచలనం రేపుతోంది.
విజయవాడ ,నవంబరు18(ఆంధ్రజ్యోతి): మావోయిస్టు అగ్రనేత హిడ్మా (Maoist Leader Hidma) ఎన్‌కౌంటర్‌లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. హిడ్మా చివరి లేఖ పేరుతో సోషల్ మీడియాలో ఒక లేఖ వైరల్ అవుతోంది. ఆ సమాచారం తమకు తెలియదని ఏపీ పోలీసు అధికారులు తెలిపారు. తాను పోలీసులకు లొంగిపోవాలనుకున్నానని హిడ్మా చెప్పినట్లు తెలుస్తోంది. తన ఆలోచనలు, నిర్ణయాలపై బస్తర్‌లోని ఓ జర్నలిస్ట్‌కు హిడ్మా లేఖ రాసినట్లు సమాచారం. నవంబరు 10వ తేదీన జర్నలిస్టుకు లేఖ రాసినట్లు వార్తలు వస్తున్నాయి.
ఈ లేఖలో ఏముందంటే..
‘నా ఆయుధాలు విడిచి పెట్టాలని నేను ఆలోచిస్తున్నాను. నేను ఆంధ్రప్రదేశ్‌కు రావాలని అనుకుంటున్నాను. నేను ఎక్కడ లొంగిపోవాలన్నది కమిటీతో మాట్లాడి నిర్ణయించాల్సి ఉంది. మా భద్రతకు పోలీసులు హామీ ఇస్తే లొంగిపోయేందుకు సిద్ధం. త్వరలో హిందీతో పాటు తెలుగులోనూ ఆడియో మెసేజ్ పంపుతాం. ఆయుధాలు విడిచే ముందు కొన్ని అంశాలపై చర్చించాల్సి ఉంది. లొంగిపోయిన మావోయిస్టు నాయకులు సోను, సతీశ్‌లు అవకాశవాదులు. దీర్ఘకాలిక ప్రజాయుద్ధ మార్గంలో అచంచలంగా ఉన్నాం. సోను, సతీశ్ కొంతమంది ఇతర కేడర్లను మోసం చేసి కొంతమంది లొంగిపోయేలా చేశారు. మావోయిస్టు పార్టీ లైన్‌ను వక్రీకరించారు. వారు చేసిన ఆరోపణలన్నీ కూడా అబద్ధం. వీరమరణం పొందే ముందు మావోయిస్టు అగ్రనేతలు మహాశివుడు, నంబాల కేశవ్‌రావు ఆయుధాలు వదిలి శాంతి చర్చలకు సిద్ధం కావాలని చెప్పినట్లుగా ఎలాంటి ఆధారం లేదు. సోను, సతీశ్‌లు తప్పుడు విషయాలను నమ్మి లొంగిపోయారు. లొంగిపోయిన ఇతర మావోయిస్టు కేడర్లు పునరాలోచించాలి. ప్రజాహిత దృక్పథంతో పనిచేస్తే విప్లవ పక్షంలోకి తిరిగి రావచ్చు’ అని హిడ్మా పేర్కొన్నట్లు ప్రచారం జరుగుతోంది.
మావోయిస్ట్ అగ్రనేతల ఎన్‌కౌంటర్...
అయితే, నిన్న(మంగళవారం) మారేడుమిల్లిలో ఏపీ పోలీసులు పలువురు మావోయిస్ట్ అగ్రనేతలను ఎన్‌కౌంటర్ చేసిన విషయం తెలిసిందే. ఈ ఎన్‌కౌంటర్‌లోనే హిడ్మా మరణించారు. ఈ క్రమంలోనే విజయవాడ, ఏలూరు, కాకినాడ, తదితర ప్రాంతాల్లో మావోయిస్టులు భారీగా పోలీసులకు పట్టుబడిన విషయం తెలిసిందే. ఈ ఎన్‌కౌంటర్‌పై మావోయిస్టు పార్టీ ఇప్పటివరకు స్పందించలేదు.
ఏపీ పోలీసులు ఏమన్నారంటే..
ఈ నేపథ్యంలోనే ఏపీ పోలీసులు మావోయిస్టుల ఎన్‌కౌంటర్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలిసిపోవాలని సూచించారు. మావోయిస్టుల చర్యలను తప్పనిసరిగా అడ్డుకుంటామని స్పష్టం చేశారు. ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన వారి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం సంబంధిత కుటుంబాలకు అప్పగిస్తామని ఏపీ పోలీసులు పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
వందకుపైగా పైరసీ వెబ్‌సైట్లు.. రవి నెట్‌వర్క్‌లో షాకింగ్ విషయాలు
సౌదీ అరేబియా ఘటన.. వెంటనే సహాయక చర్యలు ప్రారంభించండి.. సీఎం రేవంత్‌రెడ్డి కీలక ఆదేశాలు
Read Latest AP News And Telugu News