కరెంట్ కనికట్టు!
ABN , Publish Date - Apr 29 , 2025 | 12:28 AM
వైసీపీ హయాంలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని మాజీమంత్రి కొడాలి నాని సాగించిన మరో ధనకార్యం వెలుగులోకి వచ్చింది. గుడివాడ మండలం లింగవరం గ్రామంలో కొడాని నానీకి చెందిన ఓ వెంచర్‌కు నయాపైసా చెల్లించకుండా అప్పన ంగా విద్యుత శాఖ నుంచి రూ.30 లక్షలు ఖర్చు చేయించారు. స్థానిక ఏడీఈ, ఈఈ సహకారంతో అప్పట్లో పనులు చేయించుకున్న గడ్డంగ్యాంగ్ ఇప్పటి వరకు ఆ సొమ్మును చెల్లించలేదు.

గుడివాడలో కొడాలి నాని అండ్ గ్యాంగ్ మరో ధనకార్యం
ప్రైవేట్ వెంచర్‌కు విద్యుత శాఖ నిధులు
60 పోల్స్, 2 ట్రాన్స్‌ఫార్మర్లు, కండెన్సర్ కేబుల్స్‌కు రూ.30 లక్షలు
నయాపైసా చెల్లించకుండా పనులు చేయించుకున్న గ్యాంగ్
వెంచర్‌లోని లబ్ధిదారుల పేరిట దరఖాస్తు చేసి మోసం
సహకరించిన విద్యుత శాఖలోని ఏడీఈ, ఈఈ
బదిలీల నేపథ్యంలో రూ.6 లక్షల సొంత నిధులు చెల్లింపు
(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : గుడివాడ మండలం లింగవరం గ్రామ పంచాయతీ పరిధిలోని కల్యాణమండపం వెనుక ప్రాంతంలో మాజీ మంత్రి కొడాలి నాని, ఆయన అనుచరులు కలిసి సర్వే నెంబర్లు 239/1బీ, 2, 240/1బీ, 3, 244/1, 2ఏ, 2బీ, 3, 4, 5, 245/1, 2, 3, 246, 247/1, 2, 3లో మొత్తం 25.44 ఎకరాల విస్తీర్ణంలో లేఅవుట్ వేశారు. ఈ లే అవుట్‌లో ప్లాట్లను అమ్మిన గడ్డంగ్యాంగ్ ఇంతవరకు లబ్ధిదారులకు అప్పగించలేదు. ఇదే వెంచర్‌లో కొడాలి నాని అండ్ గ్యాంగ్ సాగించిన మరో స్కామ్ ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. వెంచర్‌లో విద్యుత లైన్లు వేసేందుకు విద్యుత శాఖ ద్వారా రూ.30 లక్షలు ఖర్చు చేయించారు. తన తాబేదారుగా ఉన్న అప్పటి అసిస్టెంట్ డిప్యూటీ ఇంజనీర్ (ఏడీఈ) వెంకటేశ్వరరావు ద్వారా ఈ ఖర్చు చేయించినట్టు తెలుస్తోంది. కూటమి ప్రభుత్వం రాకముందే ఏడీఈ వెంకటేశ్వరరావు మచిలీపట్నం బదిలీ అయ్యారు. ఒక ఇంటికి కనెక్షన్ ఇవ్వాలంటేనే నానా నిబంధనలు పెట్టే విద్యుత శాఖ అధికారులు ఏకంగా ఒక వెంచర్‌కు నయాపైసా కట్టకుండా రూ.30 లక్షలు ఖర్చు చేయటం విడ్డూరంగా ఉంది. అడగటమే ఆలస్యం అన్నట్టుగా విద్యుత పోల్స్, కండక్టర్స్, ట్రాన్స్‌ఫార్మర్స్ ఏర్పాటు చేశారు. అప్పట్లో నాని వెంచర్‌లో విద్యుత లైన్లు వేయటం కోసం పది విద్యుత స్తంభాల ఏర్పాటు పేరుతో విద్యుత శాఖకు దరఖాస్తు చేయించారు. అది కూడా అందులో ప్లాట్లు కొనుగోలు చేసిన లబ్ధిదారుల పేరుతో దరఖాస్తు చేయించారు. ఇలా దరఖాస్తు చేయించి, అలా విద్యుత పోల్స్ వేయించేశారు. మొత్తం 60 విద్యుత పోల్స్, రెండు ట్రాన్స్‌ఫార్మర్లను ఎలాంటి డబ్బు కట్టించుకోకుండానే నాటి ఏడీఈ వేయించారు. వెంచర్‌లో ప్రతి 50 మీటర్లకు ఒక విద్యుత పోల్ వేశారు. ఈ లెక్కన 60 విద్యుత పోల్స్‌ను 3 కిలోమీటర్ల పరిధిలో వేశారు. ఈ స్తంభాలకు మూడు లైన్ల చొప్పున కండెన్సర్ కేబుల్స్‌ను వేశారు. వీటి మొత్తం ఖర్చు రూ.30 లక్షలు. ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా తెలివిగా లబ్ధిదారులతో దరఖాస్తు చేయించి.. తమ స్వకార్యాన్ని పూర్తి చేసుకున్నారు. లబ్ధిదారులతో దరఖాస్తు చేయించాలన్న సలహా కూడా అప్పట్లో విద్యుత శాఖ అధికారులే ఇచ్చినట్టు ఆరోపణలు వస్తున్నాయి.
బదిలీలకు అడ్డు అని..
2023లో అంతర్గత బదిలీల నేపథ్యంలో ఏడీఈ వెంకటేశ్వరరావు బదిలీ కావటానికి ఈ వ్యవహారం ఇబ్బందిగా మారింది. రూ.30 లక్షల బకాయి ఉండటంతో ఆయన బదిలీకి అడ్డుగా పరిణమించింది. దీంతో తానే రెండు ఎస్టిమేట్ల కింద ఒక్కో దానికి రూ.3 లక్షలు చొప్పున రెండింటికి రూ.6 లక్షలు చెల్లించినట్టు తెలుస్తోంది. తాత్కాలిక పేమెంట్ రావటంతో ఆయన బదిలీకి మార్గం సుగమం కాగా మచిలీపట్నం వెళ్లిపోయారు.
ఈఈ డైరెక్షన్‌లోనే..
ఈ బాగోతంలో స్థానిక ఏడీఈతో పాటు అప్పటి ఈఈ పాత్ర కూడా ప్రధానంగా ఉందని తెలుస్తోంది. అప్పట్లో కొడాలి నాని మంత్రి కావటంతో ఆయన చెప్పిందే శాసనం అన్నట్టుగా ఈఈ రామకృష్ణ వ్యవహరించారని తెలుస్తోంది. అప్పట్లో ఎస్‌ఈగా మురళీమోహన్ ఉన్నారు. ఆయన దృష్టికి తీసుకెళ్లకుండానే ఈఈ డైరెక్షన్ మేరకు ఏడీఈ వెంకటేశ్వరరావు వెంచర్‌కు మెటీరియల్‌ను తర లించినట్టు తెలుస్తోంది. ఈ వ్యవహారం ఈఈ బదిలీకి కూడా ఇబ్బందికరంగా మారుతుందన్న ఉద్దేశంతోనే ఏడీఈతో బలవంతంగా డబ్బు కట్టించినట్టు తెలుస్తోంది. ఆ తర్వాత ఈఈ కూడా బదిలీపై మచిలీపట్నం వెళ్లిపోయారు.
ట్రాన్స్‌ఫార్మర్ల ఖర్చుకే చెల్లింపులు
వాస్తవంగా ఏడీఈ తాను కట్టిన సొంత డబ్బు కొడాలి నాని వెంచర్‌లో వేసిన రెండు ట్రాన్స్‌ఫార్మర్లకే సరిపోయింది. 60 పోల్స్, 3 కిలోమీటర్ల కండెన్సర్ కేబుల్స్‌కు రూ.24 లక్షల చెల్లింపులు జరగలేదు. లబ్ధిదారుల పేరుతో వెంచర్ మొత్తం విద్యుత పోల్స్, ట్రాన్స్‌ఫార్మర్స్ వేసి ప్రభుత్వం దిగిపోయే వరకు పైసా కూడా వసూలు చేయలేదు. రూ.30 లక్షల విలువచేసే మెటీరియల్‌ను కొడాలి నాని వెంచర్‌కు ఖర్చుపెట్టి, ఆ తర్వాత ఆ మొత్తాన్ని డ్యామేజీ లాస్‌లో చూపించాలన్న ప్రయత్నం చేసినట్టు తెలిసింది. ఈ పథకం బెడిసికొట్టడంతో ఏడీఈ చేతి చమురు వదిలించుకోక తప్పలేదు.