ఉధృతంగా..
ABN , Publish Date - Aug 01 , 2025 | 12:50 AM
ఉధృతంగా.. Intensely..

పులిచింతల, ప్రకాశం బ్యారేజీకి వరద పోటు
సాగర్ నుంచి పెరిగిన నీటి ప్రవాహం
ముక్త్యాల వద్ద ఉత్తరవాహిని పరవళ్లు
నీటమునిగిన భవానీ ముక్తేశ్వరాలయం
చినలంక చప్టాపైకి చేరిన వరద
గురువారం సాయంత్రం వరకు ఉధృతి
నేటికి తగ్గే అవకాశం : ఇరిగేషన్ అధికారులు
లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తం
విజయవాడ సిటీ/జగ్గయ్యపేట రూరల్/ఇబ్రహీంపట్నం/కంచికచర్ల, జూలై 31 (ఆంధ్రజ్యోతి) : నాగార్జున సాగర్ నుంచి నీటి ప్రవాహం కొనసాగుతున్న నేపథ్యంలో జిల్లాలోని పులిచింతల ప్రాజెక్టు, ప్రకాశం బ్యారేజీ నిండుకుండలా దర్శనమిస్తున్నాయి. నాగార్జున సాగర్ నుంచి 2.26 లక్షల క్యూసెక్కుల నీరు బుధవారం అర్ధరాత్రికి పులిచింతల ప్రాజెక్టుకు చేరుకోవడంతో నీటిమట్టం 53.34 మీటర్లకు చేరుకుంది. దీంతో గురువారం ఉదయం 6 గంటలకు ప్రాజెక్ట్ ఎనిమిది గేట్లను మూడు మీటర్ల మేర ఎత్తి 2.75 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. పులిచింతల నుంచి వచ్చిన నీటితో ప్రకాశం బ్యారేజీలో నీటిమట్టం 12 అడుగులు దాటింది. దీంతో ఉదయం 10 గంటలకు బ్యారేజీ 55 గేట్లను 6 అడుగుల మేర, 15 గేట్లను 7 అడుగుల మేర ఎత్తి 2.60 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదిలారు. మరో వైపు కృష్ణా తూర్పు కాల్వకు 10,187 క్యూసెక్కులు, కృష్ణా పశ్చిమ కాల్వకు 6,522 క్యూసెక్కులు, గుంటూరు కాల్వకు 200 క్యూసెక్కుల నీటిని వదిలారు. గంటలోనే నీటి ఉధృతి పెరగడంతో ఉదయం 11 గంటలకు బ్యారేజీ 30 గేట్లను 6 అడుగుల మేర, 40 గేట్లను 7 అడుగుల మేర ఎత్తి 2.72 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేశారు. సాయంత్రానికి ఎగువ వరద ప్రవాహం కాస్త తగ్గుముఖం పట్టడంతో రాత్రి 8 గంటలకు 60 గేట్లను 6 అడుగులు, పది గేట్లను 5 అడుగుల మేర ఎత్తి 2.49 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి పంపారు. శుక్రవారం ఉదయానికి వరద ప్రవాహం తగ్గుముఖం పట్టే అవకాశం ఉన్న నేపథ్యంలో గేట్ల ఎత్తును తగ్గించేస్తామని కృష్ణా రివర్ కన్జర్వేటీవ్ ఈఈ రావెళ్ల రవికిరణ్ తెలిపారు.
ఫెర్రి వద్ద ఉధృతి
ఫెర్రి వద్ద వరద ఉధృతి కొనసాగుతోంది. గురువారం సాయంత్రానికి 3 లక్షల క్యూసెక్కుల వరద ఫెర్రి వద్దకు చేరింది. దీని ప్రభావంతో చినలంక చప్టాపై కొద్దిగా వరద నీరు పారుతోంది. అత్యవసర పరిస్థితుల్లో చప్టా దాటడానికి బోట్లను ఏర్పాటు చేశారు. వరద 6 లక్షల నుంచి 7 లక్షల క్యూసెక్కులకు చేరితే ఏటిపట్టు గ్రామాలతో పాటు ఫెర్రీలోని పల్లపు ప్రాంతాలు మునుగుతాయని అధికారులు చెబుతున్నారు. ఏటిపట్టు గ్రామాల ప్రజలను ఖాళీ చేయించాల్సి వస్తే వారికోసం ఇబ్రహీంపట్నం ట్రక్ టెర్మినల్‌లో, మూలపాడు జడ్పీ ఉన్నత పాఠశాలలో పునరావాస కేంద్రాలు ఏర్పాటుకు రంగం సిద్ధం చేసినట్లు తహసీల్దార్ వై.వెంకటేశ్వర్లు తెలిపారు.
పులిచింతల వద్ద తగ్గుముఖం
పులిచింతల వద్ద కృష్ణానది వరద తగ్గుముఖం పట్టింది. గురువారం సాయంత్రం 6 గంటలకు పులిచింతల నుంచి ప్రకాశం బ్యారేజీకి 2.04 లక్షల క్యూసెక్కులు విడుదల చేశారు. రెండు రోజుల పాటు మూడు లక్షల క్యూసెక్కుల వరదతో పరవళ్లు తొక్కిన కృష్ణానది కాస్త తగ్గింది. పులిచింతల ప్రాజెక్టు గరిష్ట నీటినిల్వ సామర్థ్యం 45.77 టీఎంసీలు కాగా, గురువారం సాయంత్రానికి 40.00 టీఎంసీలు ఉన్నాయి. నాగార్జున సాగర్ నుంచి ఇన్‌ఫ్లో తగ్గింది. ప్రస్తుతం సాగర్ నుంచి 2.14 లక్షల క్యూసెక్కుల వరద పులిచింతలకు చేరుతోంది. అయితే, పులిచింతల ఎనిమిది గేట్లు మూడు మీటర్ల ఎత్తున ఎత్తి దిగువకు 2.04 లక్షల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. నందిగామ ఆర్‌డీవో కె.బాలకృష్ణ నది తీర గ్రామాల్లో పర్యటించి పరిస్థితిని సమీక్షించారు.
ముక్త్యాల వద్ద పరవళ్లు
ఎగువ నుంచి వస్తున్న వరదతో ముక్త్యాల వద్ద కృష్ణానది ఉత్తరవాహిని పరవళ్లు తొక్కుతోంది. ప్రవాహం అధికంగా ఉండటంతో గ్రామంలోని భవానీ ముక్తేశ్వరస్వామి ఆలయం నీట మునిగింది. నది పరివాహక గ్రామాలైన ముక్త్యాల, రావిరాల, వేదాద్రి గ్రామాల్లో వరద ముంపు పొంచి ఉండటంతో రెవెన్యూ, పోలీస్ శాఖాధికారులు అప్రమత్తమయ్యారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని, పడవలు నడపొద్దని సూచిస్తున్నారు. ముఖ్యంగా రావిరాల గ్రామానికి వరద ముంపు అధికంగా ఉండటంతో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అవసరమైన సౌకర్యాలపై అధికారులు దృష్టి సారించారు. కృష్ణానదిపై గుంటూరు వైపునకు వెళ్లే ముక్త్యాల-మాదిపాడు, వేదాద్రి-గింజుపల్లి పడవలను నిలిపివేశారు. సీఐ వెంకటేశ్వర్లు, ఇన్‌చార్జి తహసీల్దార్ మనోహర్, ఆయా శాఖల అధికారులను అప్రమత్తం చేశారు.