తోటలో ఆటలు
ABN , Publish Date - Apr 29 , 2025 | 12:31 AM
అతను వాలీబాల్ ఆటగాడు. అంతకంటే ముఖ్యంగా ఓ మాజీ రౌడీషీటర్. ఓ ఫుట్‌బాల్ ఆటగాడి హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఇతనిపై పోలీసులు రౌడీషీట్ తొలగించడంతో పేట్రేగిపోతున్నాడు. గన్నవరంలోని సూరంపాలెంలో మామిడి తోటలే కేంద్రంగా డెన్‌ను ఏర్పాటుచేసుకుని బెట్టింగులతో పాటు కోడిపందేలు, పేకాట, వ్యభిచార కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడు.

సూరంపాలెంలో మాజీ రౌడీషీటర్ లీలలు
మామిడి తోటలే డెన్‌గా పేకాట, వ్యభిచారం, బెట్టింగ్‌లు
ఫుట్‌బాల్ ఆటగాడి హత్యకేసులో ప్రధాన నిందితుడు
అప్పట్లో రౌడీషీట్ తెరిచిన పటమట పోలీసులు
తాజాగా రౌడీషీట్ తొలగించడంతో అంఘిక కార్యకలాపాలు
(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : గన్నవరంలోని సూరంపాలెంలో మామిడి తోటలే కేంద్రంగా ఓ మాజీ రౌడీషీటర్ వ్యవహారాలు నడిపిస్తున్నాడు. బెట్టింగులు పరుగులు తీయిస్తున్నాడు. ఎన్టీఆర్ పోలీసు కమిషనరేట్‌లో అధికారులు రౌడీషీట్ ఎత్తివేయడంతో పేట్రేగుతున్న అతడు తన వ్యవహారాలను చక్కబెట్టడానికి మరో రౌడీషీటర్‌ను సహాయకుడిగా పెట్టుకున్నాడు. ఇదీ కంపా గౌతమ్ అలియాస్ బాబీ వ్యవహారం. గుణదల పాత పంచాయతీ కార్యాలయం వద్ద ఉండే గౌతమ్ వాలీబాల్ ఆటగాడు. ఓ యువతి విషయంలో రేగిన వివాదంతో కొన్నాళ్ల క్రితం ఫుట్‌బాల్ ఆటగాడు ఆకాశ్‌ను మరికొంతమంది స్నేహితులతో కలిసి చంపేశాడు. జక్కంపూడి కాలనీకి చెందిన గ్యాంగ్‌ను తీసుకుని ఆకాశ్ తన స్నేహితులతో ఉండగా హత్య చేశాడు. దీనిపై పటమట పోలీసులు కేసు నమోదు చేసి రౌడీషీట్ తెరిచారు.
సూరంపాలెంలో డెన్
ఆకాశ్ హత్య కేసుతో రౌడీషీట్ తెరిచిన తర్వాత గౌతమ్ బుద్ధిమంతుడిగా మారినట్టు వ్యవహరించాడు. గన్నవరం సమీపాన ఉన్న సూరంపాలెంలో ఉన్న మామిడితోటల్లోకి మకాం మార్చాడు. నాడు హత్య కేసులో ఉన్న గ్యాంగ్‌తో అక్కడి నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడు. తోటలో 100 వరకు పందెం కోళ్లను పెంచుతున్నాడు. అక్కడే కోడిపందేలు నిర్వహిస్తున్నాడు. దీంతోపాటు పేకాట, వ్యభిచార కార్యకలాపాలకు తోటలను కేంద్రంగా చేశాడు. వాటితో పాటు బెట్టింగ్ వ్యవహారాలు సాగిస్తున్నాడు. విజయవాడలో తనకు పరిచయం ఉన్న వారిని బెట్టింగ్‌లోకి వచ్చేలా చేశాడు. ప్లంటర్ల నుంచి డబ్బు వసూలు చేయడానికి తనతో పాటు కేసులో ఉన్న నిందితులను ఉపయోగించుకుంటున్నాడు. ఈ వసూళ్లలో జక్కంపూడి కాలనీకి చెందిన కనపర కపిల్‌దేవ్ కీలకంగా వ్యవహరిస్తున్నాడు. అతడిపైనా పటమట పోలీస్‌స్టేషన్‌లో రౌడీషీట్ ఉంది. గౌతమ్ వ్యవహారాలపై నిఘా పెట్టిన పోలీసులు స్టేషన్‌కు రావాలని సమాచారం పంపారు. తనపై షీట్ లేనప్పుడు ఎందుకు రావాలని పోలీసులను ఎదురు ప్రశ్నించాడు. అక్కడితో ఆగకుండా ఓ ఏసీపీ స్థాయి అధికారి పేరు చెప్పి సమాచారం పంపిన పోలీసులను బెదిరించినట్టు తెలిసింది.
షీట్ ఎలా మాయం?
పోలీసులు హత్యలు, గొడవల్లో పాల్గొనే వారిపై రౌడీషీట్ తెరుస్తారు. చోరీలు పదేపదే చేసేవారిపై క్రైం షీట్ తెరుస్తారు. అనుమానితులపై సస్పెక్ట్ షీట్ తెరుస్తారు. ప్రతి ఆదివారం స్టేషన్లలో నిర్వహించే కౌన్సెలింగ్‌కు వీరు హాజరుకావాలి. ఆ తర్వాత టాస్క్‌ఫోర్స్ పోలీసులు నిర్వహించే కౌన్సెలింగ్‌కు హాజరుకావాలి. ఒకసారి రౌడీషీట్ తెరిచాక దాన్ని తొలగించడానికి చాలా ప్రక్రియ ఉంటుంది. ఒకసారి రౌడీషీట్ తెరిచాక అప్పటికి చేసిన నేరంపై తప్ప మరో కేసు నమోదు కాకూడదు. కేసు విచారణ పూర్తయి అందులో నిర్దోషిగా బయటకు వచ్చిన తర్వాత మాత్రమే షీట్‌ను తొలగించాల్సి ఉంటుంది. ఫుట్‌బాల్ ఆటగాడు ఆకాశ్ హత్యలో ప్రధాన నిందితుడిగా ఉన్న గౌతమ్ అలియాస్ బాబీపై కేసు ఇంకా కోర్టు విచారణలో ఉండగానే షీట్‌ను తొలగించారు. కోర్టు ఆదేశాలతో ఈ షీట్‌ను తొలగించినట్టు పోలీసులు చెబుతున్నారు. గౌతమ్‌పై ఇతర జిల్లాల్లోనూ కేసులు ఉన్నాయి. సత్యసాయి జిల్లాలో కియా పోలీస్‌స్టేషన్‌లో బెట్టింగ్ కేసులు ఉన్నాయి. ఇదికాకుండా హైదరాబాద్ కమిషనరేట్‌లోనూ గౌతమ్‌పై ఈ తరహా కేసులు ఉన్నాయి. అయినా అతడిపై ఉన్న షీట్‌ను తొలగించడం గమనార్హం. గౌతమ్‌ను పోలీసులు తేలిగ్గా తీసుకుంటే, తోటల్లో ఉన్న బ్యాచ్‌లు నగరంలోకి అడుగుపెట్టే ప్రమాదం లేకపోలేదు.