ప్రజారోగ్యంలో అవినీతి రోగం
ABN , Publish Date - Aug 01 , 2025 | 12:52 AM
కార్పొరేషన్ ప్రజారోగ్యశాఖలో అవినీతి, అక్రమాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. కార్మికులకు చెల్లించాల్సిన బిల్లులు మొదలు జీతాల బిల్లులు ట్రెజరీకి పంపడం, సిబ్బంది అంతర్గత సర్దుబాట్ల వరకు ఈ శాఖలోని అధికారులు, ఆఫీసు సిబ్బందికి ఆమ్యామ్యాలు ముట్టజెప్పా ల్సిందే. ఏళ్ల తరబడి ఈ పరిస్థితి కొనసాగుతున్నా ఏ స్థాయిలోనూ అరికట్టలేకపోతున్నారు. ప్రజారోగ్య విభాగమంతా ఇక్కడున్న ఓ ఉద్యోగి కనుసన్నల్లో నడుస్తోందన్న ఆరోపణలు వస్తున్నాయి.

కార్పొరేషన్‌లోని విభాగంలో కాసులే పరమావధి
ఏ పని చేయాలన్నా, బిల్లులు పెట్టాలన్నా ఆమ్యామ్యాలే..
మస్తర్లలో మాయ చేస్తూ రోజూ రూ.వేలల్లో హాంఫట్
ఓ ఉద్యోగి కనుసన్నల్లో జరుగుతున్న అవినీతి
పట్టించుకునేవారు లేక వివాదాస్పద వ్యవహారాలు
కార్పొరేషన్, జూలై 31 (ఆంధ్రజ్యోతి) : కార్పొరేషన్‌లో విధులు నిర్వహించే కార్మికులు అనారోగ్యం, ఇతరత్రా సమస్యలతో విధులకు హాజరుకాకపోతే.. ఆ తర్వాత విధుల్లో చేరడానికి ముడుపులు ముట్టజెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. రిటైర్డ్ ఉద్యోగుల పింఛన్లు, ఇతర ప్రయోజనాలకు సంబంధించిన ఏ ఫైల్ పెట్టినా రూ.లక్షల్లో సమర్పించుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. అత్యవసర పనులు చేపట్టేటపుడు, దసరా, భవానీ దీక్షలు, ఇతర సమయాల్లో అయితే పరిస్థితి మరీ దారుణంగా ఉంటోంది. కాంట్రాక్టర్లకు కొమ్ముకాస్తూ మస్తర్ల గోల్‌మాల్ వ్యవహారాలతో భారీగా అక్రమాలకు పాల్పడటం కార్పొరేషన్‌లోని ప్రజారోగ్య విభాగంలో నిత్యకృత్యం. అనారోగ్యంతో విధులకు రాలేకపోయిన ఓ మహిళా కార్మికురాలు విధుల్లో చేరేందుకు గతంలో డబ్బు వసూలు చేయడమే కాకుండా, లైంగికంగా వేధింపులకు కూడా గురిచేశారు. ఈ విషయం అప్పటి కమిషనర్ వరకు వెళ్లింది. విచారణ జరిపి సదరు గుమస్తాను సస్పెండ్ చేశారు. ఇదే విభాగంలోని ఒక పర్యవేక్షక అధికారి.. కాంట్రాక్టర్‌కు కొమ్ముకాస్తూ మస్తర్ల గోల్‌మాల్ వ్యవహారంలో భారీగా అక్రమాలకు పాల్పడ్డాడని, పెద్ద ఎత్తున ముడుపులు తీసుకున్నాడనే ఆరోపణలు రావడంతో అతడిని కూడా విధుల నుంచి సస్పెండ్ చేశారు. ఇలా నిత్యం వివాదాస్పదంగా ఉంటున్న ఈ విభాగంపై కమిషనర్ పర్యవేక్షణ లేకపోవడంతో అవినీతి రోజురోజుకూ కొండలా పెరిగిపోతోంది.
బిల్లులు.. జేబుకు చిల్లులు
సిబ్బంది బకాయిలు, ప్రయోజనాల బిల్లులు, ఉద్యోగ విరమణ అనంతరం చెల్లింపులకు సంబంధించి ఏదైనా సరే ఈ ప్రజారోగ్య విభాగంలోని సిబ్బందికి చేతులు తడపాల్సిందే. కాసులు ముట్టజెప్పిన వారి బిల్లులు మాత్రం ముందే సిద్ధం చేస్తున్నారు.
మస్తర్లలో మాయ
శానిటరీ ఇన్‌స్పెక్టర్లపై ప్రజారోగ్య విభాగం అధికారుల పర్యవేక్షణ లోపించడంతో నగరంలోని పలు డివిజన్లలో ఇప్పటికీ మస్తరు వేయడంలో మాయాజాలం కొనసాగుతోంది. కొంతమంది పీహెచ్‌వర్కర్ల నుంచి వేల రూపాయలు దండుకుంటూ మస్తరు అయ్యాక వారిని ఇంటికి పంపేస్తు న్నారు. కొంతమంది కార్మికులు తమకు బదులు ప్రైవేట్ వ్యక్తులను పనిలోకి పంపేందుకు శానిటరీ ఇన్‌స్పెక్టర్లకు నెలకు ఇంత అని ముట్టజెబుతున్నారు. నగరంలోని మూడు సర్కిళ్లలో సుమారు 4 వేల మంది వరకు ఆప్కాస్ సిబ్బంది పనిచేస్తున్నారు. వీరికి రోజూ ఆయా డివిజన్ల పరిధిలో మస్తరు తీసుకుని జీతాల కోసం ప్రధాన కార్యాలయానికి పంపిస్తారు. ఇక్కడ కమాండ్ కంట్రోల్ రూమ్‌లో మస్తరు విభాగంలో పనిచేసే వారిలో కొందరు మస్తర్లలో మార్పులు చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. డివిజన్ల పరిధిలో విధులకు హాజరుకాని వారిని హాజరైనట్టుగా చూపించి వచ్చిన డబ్బును శానిటరీ ఇన్‌స్పెక్టర్లు, ప్రజారోగ్య విభాగంలోని అవినీతి సిబ్బంది పంచుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఆప్కాస్ సిబ్బంది వారి సొంత అవసరాల కోసం శాలరీ సర్టిఫికెట్ తీసుకోవాలన్నా ఇక్కడి సిబ్బందికి రూ.1,000 చెల్లించాల్సిందే.