Share News

నిర్లక్ష్యమే ని‘దర్శనం’

ABN , Publish Date - Aug 02 , 2025 | 12:48 AM

మరో నెలా 20 రోజుల్లో ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు మొదలవుతాయి. ఏటా మాదిరిగానే ఈ ఏడాది కూడా భారీ ఏర్పాట్లు చేస్తున్నారు, అధికారులు సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ సిబ్బందికి ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. ‘సామాన్య భక్తులకే తొలి ప్రాధాన్యత’ అనే నినాదాన్ని చెబుతున్న జిల్లా యంత్రాంగం ఏటా ఆ లక్ష్యాన్ని చేరుకుంటుందా లేదా అనేదే అనుమానం. అంతరాలయ దర్శనాల్లో ఆంక్షలు, ప్రొటోకాల్‌ వీఐపీల రాకలో పరిమితులు, తిరుమల బ్రహ్మోత్సవాల తరహా విధానాల అమలుతోనే ఈసారైనా సామాన్య భక్తులు అమ్మను కనులారా దర్శించుకుని ఆనందంతో బయటకు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఆ దిశగా ఇప్పటి నుంచే ప్రణాళికలు వేయాల్సిన అవసరం ఉంది.

నిర్లక్ష్యమే ని‘దర్శనం’

ఏటా ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల్లో జరుగుతుంది అదే..

అంతరాలయ దర్శనాలను కట్టడి చేయడంలో అడ్డంకులు

అధికారిక, అనధికారిక అంతరాలయ దర్శనాలతోనే అవస్థలు

సామాన్య భక్తులకు త్వరగా దర్శనం అవ్వని పరిస్థితి

తిరుమల బ్రహ్మోత్సవాల విధానాన్ని ఎందుకు అవలంబించరు?

ఈసారైనా కట్టడి చేయాలని కోరుతున్న సామాన్య భక్తులు

దశాబ్దాలుగా సాగుతున్న సమస్యను పరిష్కరించాలని వేడుకోలు

(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల నిర్వహణకు సంబంధించి రెండు దశాబ్దాలుగా జరుగుతున్న తీరూతెన్నులు చూస్తే.. సామాన్య భక్తులకు తలెత్తుతున్న ఇబ్బందులే ప్రధానంగా కనిపిస్తున్నాయి. అంతరాలయ దర్శనాల వల్లే ఇలా జరుగుతుందనేది అందరికీ తెలిసిన విషయమే. అధికార, అనధికార అంతరాలయ దర్శనాలతో సామాన్య భక్తులు ఇబ్బందులు పడటమే కాకుండా నిర్వహణ తీరుపై తిరగబడే పరిస్థితులు వస్తున్నాయి. రాష్ట్రంలోనే రెండో అతిపెద్ద దేవస్థానమైనప్పటికీ ఈ అంతరాలయ దర్శనాలను కట్టడి చేయలేని పరిస్థితి ఏర్పడింది. తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాల సమయంలో మాదిరిగా.. ఇంద్రకీలాద్రిపై కూడా ఎలాంటి సిఫార్సులు, వీఐపీల సేవలో తరించకుండా సామాన్య భక్తులే లక్ష్యంగా పనిచేయాల్సిన అవసరం ఉంది.

అధికార, అనధికార దర్శనాలు ఎందుకు అనుమతించటం?

కొందరు దర్జాగా అంతరాలయ దర్శనాలు చేసుకుంటుంటే, ఎందరో సామాన్య భక్తులు క్యూలైన్లలో ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఉత్సవాల్లో చాలామంది నేరుగా చినరాజగోపురం వద్దకు వచ్చేస్తున్నారు. లోపలికి పంపించే వరకు పట్టుబడుతున్నారు. ఈ అంతరాలయ దర్శనాలతో రూ.500 టికెట్‌ కొనుగోలు చేసిన వారి క్యూ కూడా ముందుకు కదలని పరిస్థితి ఏర్పడింది. ప్రతి ఉత్సవాల్లోనూ రూ.500 టికెట్‌ కొనుగోలు చేసిన భక్తులు, అనధికారిక అంతరాలయ దర్శనాలు చేసుకునే వారి మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి.

సిఫార్సులు దరిచేరనీయొద్దు

ఉత్సవాల్లో కొండపై డ్యూటీలు చేసే పోలీసులు, రెవెన్యూ, దేవస్థాన, ఎమ్మెల్యేలు, వారి కార్యాలయాల సిబ్బంది, నామినేటెడ్‌ పదవులు కలిగినవారు ప్రొటోకాల్‌ ముసుగులో అనధికారికంగా దర్శనానికి వస్తున్నారు. వీరికి అడ్డు చెప్పేవారే లేరు. ఇక ఉత్సవ కమిటీ సభ్యులు కూడా అంతే. వీరిని నియంత్రించే సాహసం ఎవరూ చేయలేకపోతున్నారు.

ఘాట్‌రోడ్డులో క్రమబద్ధీకరణ ఏదీ?

ఏటా వీవీఐపీలు, ఉభయదాతలకు ప్రొటోకాల్‌ పేరుతో ప్రత్యేక వాహనాలను ఘాట్‌రోడ్డులో నడుపుతున్నారు. ఉచిత బస్సులు కూడా నడుస్తాయి. వీటిని వేటికోసం ఏర్పాటుచేశారో ఆ విషయం నెరవేరదు. ఎవరుపడితే వారు ఈ వాహనాల్లో వచ్చేస్తూ చినరాజగోపురం వద్దకు చేరుకుంటున్నారు. ఇక్కడ ఒక్కసారిగా రద్దీ పెరిగిపోతుండటంతో అధికారులు కూడా దర్శనానికి అనుమతిచ్చేస్తున్నారు. వీరంతా అంతరాలయ దర్శనాలకు వెళ్లడం వల్ల ఇతర క్యూలపై ప్రభావం పడుతోంది.

Updated Date - Aug 02 , 2025 | 12:48 AM