వసూళ్ల ఏటీఎస్‌లు
ABN , Publish Date - Aug 01 , 2025 | 12:55 AM
వాహనాల ఫిటెనెస్ పరీక్షల కోసం కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన ఆటోమేటిక్ టెస్టింగ్ సెంటర్లు (ఏటీఎస్) అవినీతిమయమయ్యాయి. ప్రైవేట్ నిర్వాహకుల చేతికి అప్పగించిన ఈ కేంద్రాల్లో నూతన విధానం నిన్న మొన్నటి వరకు బాగానే అమలు జరిగినా ప్రస్తుతం మాత్రం దారి తప్పాయి. వాహనాల కేటగిరీ ప్రాతిపదికన లంచాల ధరలను నిర్దేశించి ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. నూతన జేటీసీగా నియమితులైన వడ్డీ సుందర్ ఈ ఏటీఎస్ కేంద్రాలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.

అవినీతిమయంగా వాహనాల ఆటోమేటిక్ టెస్టింగ్ సెంటర్లు
ఉమ్మడి కృష్ణాజిల్లాలో రెండు కేంద్రాలు.. భారీ వసూళ్లు
అవినీతి రవాణా ఇన్‌స్పెక్టర్ల ఏజెంట్ కనుసన్నల్లోనే...
అక్రమ వసూళ్లకు గతంలో పనిచేసే వారితో ఒప్పందం
వాహనాన్ని బట్టి రేటు నిర్ణయించి డిమాండ్
కొందరు రవాణా ఇన్‌స్పెక్టర్ల అండదండలతోనే..
ఫిర్యాదులపై నూతన జేటీసీ దృష్టిసారించాలి
(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : ఉమ్మడి కృష్ణాజిల్లాలో ఏర్పాటుచేసిన ఆటోమేటిక్ టెస్టింగ్ సెంటర్ల (ఏటీఎస్)లో కొద్దిరోజులకే వసూళ్ల కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కేంద్రాలను ఏర్పాటుచేసిన తొలినాళ్లలో బాగానే సాగినా.. ఇప్పుడు మాత్రం అవినీతిమయమయ్యాయి. ఇటీవల ఉమ్మడి గుంటూరు జిల్లాలోని ఏటీఎస్ కేంద్రాలు అనధికార వసూళ్లకు తెరలేపగా, ఉమ్మడి కృష్ణాజిల్లా కేంద్రాలూ అదే దిశగా పయనిస్తున్నాయి. ఎన్టీఆర్ జిల్లాలో నున్నలోనూ, కృష్ణా జిల్లాలో మచిలీపట్నంలోనూ ఈ ఏటీఎస్ కేంద్రాలు ఉన్నాయి. ఇవి ఆర్‌టీవో కార్యాలయాల పరిధిలో కాకుండా జిల్లాకు ఒక కేంద్రం చొప్పున మంజూరు చేయటం వల్ల వాహనదారులకు దూరాభారమవుతోంది. ఈ సమస్యపై వాహనదారులు పెదవి విరుస్తున్న తరుణంలో తాజాగా వాహనదారులు అక్రమ వసూళ్లను ఎదుర్కొంటున్నారు. వాహనాల కేటగిరీని బట్టి రేటు కట్టి మరీ లంచాలు నిర్ణయిస్తున్నారు. అదేమంటే ముక్కుపిండి వసూలు చే స్తున్నారు. అక్రమ వసూళ్ల విషయాలను కొందరు వాహనదారులు రవాణా అధికారుల దృష్టికి తీసుకొస్తున్నారు. గతంలో రవాణా శాఖ పరిధిలో వాహనాల ఫిట్‌నెస్‌లను విజయవంతంగా చేయించటానికి మధ్యవర్తులుగా ఎవరైతే పనిచేసేవారో వారే ఇప్పుడు ఏటీఎస్ కేంద్రాల్లోనూ చక్రం తిప్పుతున్నారు.
ఎవరీ మధ్యవర్తులు? ఎక్కడి వారు?
ఉమ్మడి జిల్లాలో పెద్ద టిప్పర్ల యజమానుల నుంచి అక్రమ వసూళ్లకు గానూ అవినీతి రవాణా ఇన్‌స్పెక్టర్ల సిండికేట్ ఒక వ్యక్తిని నియమించుకుంది. ఈ ప్రైవేట్ కలెక్షన్ మాస్టర్‌పై అప్పట్లో ‘ఆంధ్రజ్యోతి’లో కథనం ప్రచురితమైంది. గన్నవరం ఎఫ్‌సీ స్టేషన్‌లో వాహనాలకు రంగులు వేసే కార్మికుడి దగ్గర సహాయకుడిగా వచ్చిన వ్యక్తి ఇప్పుడు ఉమ్మడి కృష్ణా జిల్లాలో అవినీతి రవాణా ఇన్‌స్పెక్టర్ల సిండికేట్‌కు వసూళ్ల మాస్టర్‌గా వ్యవహరిస్తున్నాడు. ఈ వ్యక్తే ఇప్పుడు ఉమ్మడి జిల్లాలోని ఏటీఎస్‌లలో చక్రం తిప్పుతున్నాడు. మరో ముగ్గురు మధ్యవర్తులను నియమించుకుని వసూళ్లు చేస్తున్నాడు. చిటికెలో ఫిట్‌నెస్‌లు చేయిస్తామంటూ వాహనదారుల నుంచి డబ్బు దండుకుంటున్నారు. ఆ సొమ్మును ఎవరికి చేరవేయాలో వారికి చేరవేస్తున్నారు. ఈ అక్రమాల్లో కొందరు రవాణా ఇన్‌స్పెక్టర్ల భాగస్వామ్యం కూడా ఉందన్న ప్రచారం నడుస్తోంది.
వసూళ్లు ఎలా?
వాహనం కేటగిరీని బట్టి అక్రమ వసూళ్లు ఉంటున్నాయి. ఆరు, పది చక్రాల రవాణా వాహనానికి రూ.2 వేలు తప్పనిసరిగా లంచం ఇవ్వాల్సిందే. ఫిట్‌నెస్ సర్టిఫికెట్ ఫీజు రూ.1,020 కంటే రెట్టింపు సంఖ్యలో రూ.2 వేలు లంచం రూపంలో సమర్పించుకోవాల్సి వస్తోంది. 12, 14 చక్రాల వాహనాలకు సంబంధించి రూ.2,700, ట్రాలీల నుంచి రూ.3,700, ప్రైవేట్ బస్సుల నుంచి రూ.4 వేలు, ట్రాక్టర్ అండ్ ట్రాలీల నుంచి రూ.3 వేల నుంచి రూ.5 వేల వరకు కూడా వసూలు చేస్తున్నారు.
సమస్యలున్న వాటినుంచే అక్రమ వసూళ్లు
అన్ని వాహనాల నుంచి అక్రమ వసూళ్లు చేయట్లేదు. సమస్యలున్న వాటి విషయంలోనే వసూళ్లకు పాల్పడుతున్నారు. వాహనాలకు నల్లటి పొగ వస్తే ఇంజన్ సమస్య ఉన్నట్టుగా భావించాల్సి ఉంటుంది. ఈ నల్లటి పొగ సమస్యను ఏటీఎస్ కేంద్రాల్లోనే సరిచేసి ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు ఇస్తున్నారు. దీనికోసం లంచాలు డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ డబ్బు ఇవ్వకపోతే పలు కారణాలు చూపి ఫిట్‌నెస్‌లు చేయకుండా కాలాతీతం చేస్తున్నారు. అదేమంటే.. చాలా వాహనాలకు ఫిట్‌నెస్ చేయాల్సి ఉందని తప్పించుకుంటున్నారు.