పూర్తయిన మినీ గోకులాలు
ABN , Publish Date - Apr 27 , 2025 | 11:49 PM
పశు పోషకులకు ఆసరా అందించి పాడి పరిశ్రమలను అబివృద్ధిపరచాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం మంజూరు చేసిన మినీ గోకులాలు చాలా వరకు నిర్మాణాలు పూర్తయ్యాయి.

బిల్లుల కోసం అన్నదాతల ఎదురుచూపులు
రాజుపాలెం, ఏప్రిల్ 27 (ఆంధ్రజ్యోతి): పశు పోషకులకు ఆసరా అందించి పాడి పరిశ్రమలను అబివృద్ధిపరచాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం మంజూరు చేసిన మినీ గోకులాలు చాలా వరకు నిర్మాణాలు పూర్తయ్యాయి. అయితే బిల్లులు అందకపోవడంతో అన్నదాతలు వాటి కోసం ఎదురు చూస్తున్నారు. ఉపాది పథకం కింద మినీ గోకులాలకు నిధులు మంజూరు కావడంతో షెడ్లు నిర్మించుకుంటే తమ పశువులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవనే ఉద్దేశ్యంతో అప్పులు తెచ్చి షెడ్ల నిర్మాణం సకాలంలో పూర్తి చేసిన రైతన్నలకు బిల్లులు నిరాశపరుస్తున్నాయి. రాజుపాళెం మండలంలో 19 మినీ గోకులాలు ఇస్తే ఫిబ్రవరి నెలలోనే పూర్తి చేసినట్లు రైతన్నలు తెలిపారు. ఒక్కో మినీ గోకులా నికి రూ.2.30లక్షలు మంజూరు చేయడంతో రైతు వాటా కింద 10 శాతం వేసుకుని సకాలంలో పూర్తి చేశారు. అయితే పశువుల షెడ్ల నిర్మాణం పూర్తి చేసుకున్న రైతన్నలు మండల కార్యాలయం చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వచ్చింది. మంచి ఆసరా ఇచ్చినా బిల్లులు సకాలంలో అందిస్తే మరిన్ని షెడ్లను నిర్మించుకునేందుకు రైతులు ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికైనా సకాలంలో ఉపాధి హామీ అధికారులు స్పందించి డబ్బులు పడేలా కృషి చేయాలని మినీ గోకులాల నిర్మాణ రైతులు కోరుతున్నారు.
బిల్లులు మంజూరు కావాల్సి ఉంది
రాజుపాళెం మండలానికి 25 మినీ గోకులాలు మంజూరు కాగా ఇప్పటి దాకా 19 మినీగోకులాలు పూర్తయ్యాయని రాజుపాళెం మండల పశువైద్యాధికారి డాక్టర్ ప్రదీప్‌రెడ్డి పేర్కొన్నారు. షెడ్ల నిర్మాణానికి సంబంధించి బిల్లులు ఆలస్యం అయిన విషయం వాస్తవమేనన్నారు. కాగా ఉపాధి పథకం కింద బిల్లులు పంపారని ఏపీవో లక్ష్మినారాయణ తెలిపారు.