AP high Court: కార్పొరేషన్ సమావేశానికి భద్రత కల్పించండి
ABN , Publish Date - Jun 18 , 2025 | 05:33 AM
ఈ నెల 20న జరిగే కడప మున్సిపల్ కార్పొరేషన్ జనరల్ బాడీ మీటింగ్‌కు తగిన భద్రత కల్పించాలని మంగళవారం కడప జిల్లా ఎస్పీని హైకోర్టు ఆదేశించింది. బయట వ్యక్తులను కార్పొరేషన్ ప్రాంగణంలోకి అనుమతించవద్దని స్పష్టం చేసింది.

కడప జిల్లా ఎస్పీకి హైకోర్టు ఆదేశం
అమరావతి, జూన్ 17(ఆంధ్రజ్యోతి): ఈ నెల 20న జరిగే కడప మున్సిపల్ కార్పొరేషన్ జనరల్ బాడీ మీటింగ్‌కు తగిన భద్రత కల్పించాలని మంగళవారం కడప జిల్లా ఎస్పీని హైకోర్టు ఆదేశించింది. బయట వ్యక్తులను కార్పొరేషన్ ప్రాంగణంలోకి అనుమతించవద్దని స్పష్టం చేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ న్యాపతి విజయ్ ఉత్తర్వులు జారీ చేశారు. జనరల్ బాడీ మీటింగ్‌కు గట్టి భద్రత కల్పించేలా ఎస్పీని ఆదేశించాలని కోరుతూ మేయర్ కె.సురేశ్‌బాబు, పలువురు కౌన్సిలర్లు హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యం మంగళవారం విచారణకు రాగా పిటిషనర్ తరఫున న్యాయవాది వీఆర్‌రెడ్డి కొవ్వూరి వాదనలు వినిపించారు. కాగా, తన వాదనలను వినకుండానే విచారణ పూర్తయినట్లు పేర్కొంటూ పురపాలక ముఖ్యకార్యదర్శి ఈ నెల 10న జారీ చేసిన మెమోను సవాల్ చేస్తూ మేయర్ కె.సురేశ్‌బాబు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను హైకోర్టు ఈ నెల 19కి వాయిదా వేసింది.