Share News

Jogi CID Inquiry: దాటవేత డొంక తిరుగుడు

ABN , Publish Date - Apr 12 , 2025 | 04:24 AM

చంద్రబాబు ఇంటి దాడి కేసులో జోగి రమేశ్‌ సీఐడీ విచారణలో ఎక్కువ ప్రశ్నలకు “తెలియదు” అనే సమాధానం ఇచ్చారు. మీడియా ఎదుట “మళ్లీ అధికారంలోకి వస్తాం” అంటూ ధీమా వ్యక్తం చేశారు

Jogi CID Inquiry: దాటవేత డొంక తిరుగుడు

  • సీఐడీ విచారణలో జోగి రమేశ్‌ తీరు

  • దాడికి కాదు, నిరసనకే బాబు ఇంటికి

  • మా కార్లలో కర్రలు, రాళ్ల గురించి

  • నాకు తెలియదు: మాజీ మంత్రి

  • మరోసారి రావాలన్న అధికారులు

విజయవాడ, ఏప్రిల్‌ 11 (ఆంధ్రజ్యోతి): తెలియదు.. గుర్తు లేదు..! సీఐడీ వేసిన ప్రశ్నలకు మాజీ మంత్రి, వైసీపీ నేత జోగి రమేశ్‌ ఇచ్చిన సమాధానాలివి. ఉండవల్లిలోని అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో విచారణ కోసం శుక్రవారం విజయవాడలోని సీఐడీ ప్రాంతీయ కార్యాలయానికి ఆయన వచ్చారు. ఈ కేసులో జోగి సహా 11 మంది నిందితులుగా ఉన్నారు. ఆయనతోపాటు పది మంది విచారణకు వచ్చారు. అనారోగ్యం కారణంగా ఒకరు రాలేదు. నాటి ఘటనపై సీఐడీ ఎస్పీ శ్రీదేవిరావు నేతృత్వంలోని బృందం గంటపాటు జోగిని విచారించింది. మొత్తం 35 ప్రశ్నలు అడుగగా.. ఆయన చాలావాటికి బదులివ్వలేదని సమాచారం. ఎవరి ఆదేశాలతో ఉండవల్లి కరకట్ట ఎక్కారని ప్రశ్నించగా.. తనకు తానే ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. ఘటన జరిగిన రోజున ఉపయోగించిన సెల్‌ఫోన్‌ గురించి అడుగగా.. దాన్ని మార్చేశానని జవాబిచ్చారు. కొన్ని ప్రశ్నలకు.. చెప్పిన సమాధానాలే మళ్లీ మళ్లీ చెప్పారని విశ్వసనీయంగా తెలిసింది. ఆయన వాంగ్మూలాన్ని నమోదు చేసుకున్న అధికారులు.. మరోసారి విచారణకు హాజరు కావలసి ఉంటుందని చెప్పి ఆయన్ను, ఇతర నిందితులను పంపించివేశారు. వాస్తవానికి నాడు చంద్రబాబు ఇంటిపై దాడి చేయడానికి జోగి మందీమార్బలంతో వెళ్లారు. కార్లలో కర్రలు, రాళ్లు వేసుకుని కరకట్టపై వీరంగం చేశారు. దీనిపై సీఐడీ అధికారుల ప్రశ్నలు, ఆయన సమాధానాలు కింది విధంగా ఉన్నాయి..


సీఐడీ: చంద్రబాబు ఇంటిపై దాడికి ఎందుకు వెళ్లారు?

జోగి: నేను దాడి చేయడానికి వెళ్లలేదు

సీఐడీ: మరి ఎందుకు వెళ్లినట్లు?

జోగి: నిరసన తెలియజేయడానికి మాత్రమే వెళ్లాను.

సీఐడీ: నిరసనకు కారణమేంటి?

జోగి: నాడు సీఎంగా ఉన్న జగన్‌ను ప్రస్తుత స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు అసభ్యకరంగా మాట్లాడారు.

సీఐడీ: నిరసనకు వెళ్తే కర్రలు, రాళ్లు కార్లలో ఎందుకున్నాయ్‌?

జోగి: వాటి గురించి నాకు తెలియదు. నేను గమనించలేదు. టీడీపీ వాళ్లే నా కార్లను ధ్వంసం చేశారు. తిరిగి నాపై కేసు పెట్టారు.


మమ్మల్ని ఏమీ చేయలేరు మళ్లీ అధికారంలోకొస్తాం మీడియా వద్ద ‘ఊగిన’ జోగి రమేశ్‌

‘ఎప్పటి కేసులివి. ఎప్పుడు నోటీసులు ఇస్తున్నారు? మమ్మల్ని ఏమీ చేయలేరు. మళ్లీ అధికారంలోకి వస్తాం’ అని జోగి రమేశ్‌ వ్యాఖ్యానించారు. విచారణ అనంతరం సీఐడీ కార్యాలయం వద్ద విలేకరులతో మాట్లాడుతూ ఊగిపోయారు. సీఐడీ అధికారులను బెదిరించే ధోరణిలో మాట్లాడారు. తాను కేసులకు, నోటీసులకు భయపడనన్నారు. వైఎస్‌ శిష్యుడిగా నిక్కరు వేసుకున్నప్పటి నుంచి కృష్ణా జిల్లా రాజకీయాల్లో ఉన్నానని.. భూమి గుండ్రంగా తిరుగుతుందని, ఎల్లకాలం ఒకేలా ఉండదని.. వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తుందని పదే పదే అన్నారు. ‘సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం విచారణకు హాజరయ్యా. తెలిసిన సమాచారాన్ని అధికారులకు ఇచ్చాను. ఆనాడు అయ్యన్నపాత్రుడు అసభ్యకరంగా జగన్‌ను దూషించారు. ఈ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా చంద్రబాబు నివాసం వద్దకు వెళ్లి నిరసన చేపట్టాం. అయితే నిరసనకు వెళ్లిన నాపై టీడీపీ వాళ్లు దాడి చేశారు. నా కార్లను ధ్వంసం చేశారు. అక్రమంగా కేసు పెట్టి ఏదో సాధించాలనుకుంటున్నారు. నన్ను భయపెట్టలేరు. ఈ మధ్యే వచ్చిన సర్వే ప్రకారం ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే 75 మంది టీడీపీ ఎమ్మెల్యేలకు డిపాజిట్లు గల్లంతవుతాయి. కడుపునిండా అన్నం పెట్టిన జగన్‌ను వదులుకుని.. పలావు పెడతానని చెప్పిన చంద్రబాబును నమ్మి ఓటేసినందుకు జనం బాధపడుతున్నారు. బాబు కుర్చీ కోసం సొంత పుత్రుడు, దత్తపుత్రుడు పోటీపడుతున్నారు. మూడేళ్ల క్రితం జరిగిన ఘటనపై కేసుపెట్టి వేధించాలని చూస్తున్నారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలియజేసే హక్కు లేదా? నన్ను అరెస్టు చేసి ఆనందం పొందాలని చూస్తున్నారు. ఎన్నాళ్లు రెడ్‌బుక్‌ పట్టుకుని తిరుగుతారు? ఎల్లకాలం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండదని గుర్తుపెట్టుకోవాలి’ అని అన్నారు.


For AndhraPradesh News And Telugu News

Updated Date - Apr 12 , 2025 | 04:24 AM