Share News

Payyavula Keshav: రాష్ట్రాభివృద్ధిపై జగన్‌ కుట్రలు

ABN , Publish Date - Jul 09 , 2025 | 04:29 AM

రాష్ట్రంలో అభివృద్ధిని అడ్డుకునేందుకు మాజీ సీఎం జగన్‌ కుట్రలు చేస్తున్నారని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌ ధ్వజమెత్తారు. జగన్‌కు తోడు మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి గంటల తరబడి ప్రెస్‌మీట్లు పెడుతూ రాష్ట్రాభివృద్ధిపై అక్కసు వెళ్లగక్కుతున్నారని ఆరోపించారు.

Payyavula Keshav: రాష్ట్రాభివృద్ధిపై జగన్‌ కుట్రలు

  • ఎండీసీ బాండ్లు కొనొద్దంటూ 200 మంది ఇన్వెస్టర్లకు మెయిళ్లు

  • ప్రధాని, ఆర్థిక మంత్రి, ఆర్‌బీఐ, సెబీ, ఇతర ఎక్స్చేంజీలకు ఫిర్యాదు

  • హైకోర్టులో కేసులు.. వాటిపై బుగ్గన ప్రెస్‌మీట్లు.. జగన్‌ ట్వీట్లు

  • అయినా చంద్రబాబు ప్రభుత్వంపై నమ్మకం కోల్పోని ఇన్వెస్టర్లు

  • ఏపీఎండీసీ ఇష్యూ ఓవర్‌ సబ్‌స్ర్కైబ్‌ కావడమే దీనికి నిదర్శనం: పయ్యావుల

అమరావతి, జూలై 8(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో అభివృద్ధిని అడ్డుకునేందుకు మాజీ సీఎం జగన్‌ కుట్రలు చేస్తున్నారని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌ ధ్వజమెత్తారు. జగన్‌కు తోడు మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి గంటల తరబడి ప్రెస్‌మీట్లు పెడుతూ రాష్ట్రాభివృద్ధిపై అక్కసు వెళ్లగక్కుతున్నారని ఆరోపించారు. అధికారంలో ఉన్నప్పుడు బ్రాండ్‌ ఏపీని ప్రత్యక్షంగా నాశనం చేసి, ఇప్పుడు తప్పుడు ట్వీట్లతో, విష ప్రచారాలతో పరోక్షంగా నాశనం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం అమరావతి సచివాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) బాండ్ల జారీ ద్వారా రూ.9వేల కోట్ల రుణం సమీకరించాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. అయితే ఈ బాండ్లను ఎవరూ కొనకుండా జగన్‌తోపాటు వైసీపీ నేతలు బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, లేళ్ల అప్పిరెడ్డి, ఉదయ భాస్కర్‌ అనే మరో వ్యక్తి ఎలాంటి కుట్రలు పన్నారో, వాటిని ప్రభుత్వం ఎలా అధిగమించిందో వివరించారు. ‘‘జర్మనీలో ఉద్యోగం చేసే ఉదయ్‌ భాస్కర్‌ అనే వ్యక్తి ద్వారా ఏపీఎండీసీ ఇష్యూ చేసే బాండ్లు కొనొద్దంటూ 200 మందికి పైగా ఇన్వెస్టర్లకు మెయిళ్లు పెట్టించారు. వీటిని ఆ ఇన్వెస్టర్లు ఏమాత్రం పట్టించుకోకపోవడంతో ఏపీఎండీసీ బాండ్ల వ్యవహారంపై వైసీపీ నేత లేళ్ల అప్పిరెడ్డితో హైకోర్టులో పిల్‌ వేయించారు. విషయం కోర్టు పరిధిలో ఉందని, పెట్టుబడులు పెట్టొద్దని ఇన్వెస్టర్లకు మరోసారి మెయిళ్లు పంపారు. కోర్టులో ఉండగా బాండ్ల జారీపై ముందుకెలా వెళ్తారంటూ రోతపత్రికలో రాతలు రాశారు. వాటిపై బుగ్గన ప్రెస్‌మీట్లు, జగన్‌ ట్వీట్లు చేసి, మళ్లీ వాటిని ఇన్వెస్టర్లకు పంపించారు. అయినప్పటికీ చంద్రబాబు ప్రభుత్వంపై ఇన్వెస్టర్లు విశ్వాసం కోల్పోలేదు. ఈ బాండ్లకు పెట్టుబడులు రాకూడదని జగన్‌ విశ్వప్రయత్నాలు చేసినా ఎండీసీ ఇష్యూ ఓవర్‌ సబ్‌స్ర్కైబ్‌ అవడం చంద్రబాబు ప్రభుత్వంపై వారికున్న విశ్వాసానికి ప్రతీక’’ అని పయ్యావుల పేర్కొన్నారు.


ఆర్‌బీఐ, సెబీ చెప్పినా వినరా?

‘‘లేళ్ల అప్పిరెడ్డి విష ప్రచారం సరైన ఫలితాలు ఇవ్వడం లేదని భావించి వైసీపీ రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డిని రంగంలోకి దించారు. ఆయన ఏపీఎండీసీ బాండ్ల వ్యవహారం రాజ్యాంగ విరుద్ధం, నిబంధనలకు విరుద్ధమంటూ ప్రధాని, కేంద్ర ఆర్థిక మంత్రి, ఆర్‌బీఐ, సెబీ, ఇతర ఎక్స్చేంజీలకు ఫిర్యాదులు ఇచ్చారు. సాధారణంగా బాండ్ల ఇష్యూకి 4 గంటల్లోగా అనుమతి వస్తుంది. కానీ, ఈ ఫిర్యాదుల కారణంగా 15 రోజులు పట్టింది. చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్నది సరైనదేనని, ఇందులో నిబంధనల ఉల్లంఘన లేదని కేంద్రం, సెబీ, ఆర్‌బీఐ తేల్చిచెప్పిన తర్వాతే బాండ్ల ఇష్యూకి అనుమతి దొరికింది. రూ.9,000 కోట్ల రుణం కూడా వచ్చింది. ఇంత జరిగాక కూడా ఇది తప్పంటూ జగన్‌ ట్వీట్లు, బుగ్గన ప్రెస్‌మీట్లు పెడుతున్నారు. సెబీ, ఆర్‌బీఐ చెప్పినా కూడా వినరా?’’ అని మంత్రి ప్రశ్నించారు. ‘‘డైరెక్ట్‌ డెబిట్‌ విధానం తప్పంటూ గగ్గోలు పెడుతున్న బుగ్గన... ఆయన ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడే దాన్ని బెవరేజెస్‌ కార్పొరేషన్‌లోకి తీసుకొచ్చారు. ఇప్పుడు దీన్ని ఆర్‌బీఐ కూడా ఆమోదించింది. ఇటీవల తెలంగాణ ప్రభుత్వానికి డైరెక్ట్‌ డెబిట్‌ విధానంలో అప్పు తీసుకోవడానికి అనుమతిచ్చింది. ప్రస్తుతం చాలా రాష్ట్రాల్లో ఇదే అమలవుతోంది’’ మంత్రి పయ్యావుల వెల్లడించారు.

ఎవరిచ్చిన జీవో తప్పు

‘‘ఏపీఎండీసీ బాండ్ల జారీ ద్వారా రూ.7వేల కోట్లు అప్పు తెచ్చుకునేందుకు అనుమతిస్తూ వైసీపీ ప్రభుత్వంలో 2024 మార్చి 15న బుగ్గన జీవో 35 ఇచ్చారు. ఇప్పుడు అదే బాండ్ల జారీ ద్వారా రూ,9,000 కోట్లు అప్పు తెచ్చుకునేందుకు 2025 మార్చి 11న మేం జీవో 32 ఇచ్చాం. ఇందులో ఏ జీవో తప్పో బుగ్గన చెప్పాలి. బెవరేజెస్‌ కార్పొరేషన్‌ వ్యవహారంలో అప్పు కోసం ఏకంగా గవర్నర్‌ పేరునే వివాదాల్లోకి లాగారు. దీంతో ఆగ్రహించిన గవర్నర్‌ అప్పటి సీఎస్‌ను పిలిపించి, తిడితే దాన్ని సవరించుకున్నారు’ అని పయ్యావుల గుర్తు చేశారు.

ఉద్యోగుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం

రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టడం కోసం 75 కేంద్ర పథకాలను తిరిగి ప్రారంభించామని మంత్రి తెలిపారు. ‘జగన్‌ హయాంలోని 24,000 కోట్ల పెండింగ్‌ బిల్లులు చెల్లించాం. ఇందులో ఉద్యోగులకు రూ.7,000 కోట్లకు పైగా చెల్లించాం. ఉద్యోగుల సంక్షేమం కోసం బాధ్యతగా పనిచేస్తున్నాం. వారి కష్టాలు గుర్తున్నాయి’అని మంత్రి అన్నారు.

Updated Date - Jul 09 , 2025 | 04:30 AM