Home Minister Anitha Slams Jagan: అదంతా క్రిమినల్ లీడర్ ప్రీ ప్లాన్
ABN , Publish Date - Apr 10 , 2025 | 03:44 AM
హోం మంత్రి వంగలపూడి అనిత, జగన్ పర్యటనను ముందస్తు ప్రణాళికతో చేసిన డ్రామాగా అభివర్ణించారు. పోలీసులపై వ్యాఖ్యలపై ఆమె తీవ్రంగా స్పందించి, విచారణ జరుగుతోందని తెలిపారు. జగన్‌పై ఫిర్యాదులు కూడా నమోదయ్యాయి

విచారణ జరుగుతోంది: హోం మంత్రి అనిత
విశాఖపట్నం, ఏప్రిల్ 9(ఆంధ్రజ్యోతి): సత్యసాయి జిల్లా రామగిరి మండలంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి పర్యటన మొత్తం డ్రామాలా సాగిందని హోంమంత్రి వంగలపూడి అనిత ఆరోపించారు. విశాఖలోని పార్టీ కార్యాలయంలో బుధవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ శవరాజకీయాలు చేయాలని జగన్ చూస్తున్నారని మండిపడ్డారు. ఆయన్ను తిరిగి తీసుకువెళ్లడానికి వీలుకాని హెలికాప్టర్.. ఆయన వెళ్లిన 15 నిమిషాల్లోనే ఎలా ఎగిరిందని ప్రశ్నించారు. పక్కా ప్రణాళిక ప్రకారమే ఇదంతా చేశారనిపిస్తోందని, దీనిపై విచారణ జరుగుతోందని చెప్పారు. ప్రస్తుతం పులివెందుల ఎమ్మెల్యేగా ఉన్న జగన్‌కు.. మాజీ సీఎంగా జడ్ ప్లస్ కేటగిరీ భద్రత ఇస్తున్నామని, ఇది చాలా ఎక్కువన్నారు. పోలీసుల బట్టలూడదీస్తామన్న భాష, పద్ధతి సరైంది కాదని తప్పుబట్టారు. అనంతపురం డీఐజీ, జిల్లా ఎస్పీ ఇద్దరూ మహిళలేననే విషయం గుర్తుందా అని ప్రశ్నించారు. జగన్‌కు కౌంటర్ ఇచ్చిన రామగిరి ఎస్‌ఐను ఆమె అభినందించారు. జగన్ పర్యటన సందర్భంగా వైసీపీ శ్రేణులు వాట్సా్‌ప ద్వారా రెచ్చగొట్టే ప్రయత్నం చేశారని, దీంతో ఎస్పీ అప్రమత్తమై సంయమనం పాటించాలని పదేపదే కోరారన్నారు. నిఘా వర్గాల హెచ్చరికతో 1,100 మంది పోలీసులను బందోబస్తుకు నియమించామన్నారు. అయినా కావాలని సీన్ క్రియేట్ చేయాలని చూశారని, క్రిమినల్ నాయకుడు ఎలా ఉంటారో మంగళవారం జగన్ నిరూపించుకున్నారని అన్నారు.
హెలిప్యాడ్ వద్దకు అనుమతి ఉన్నవారు తప్ప మిగతావారు వెళ్లకూడదని, అటువంటిది జగన్ హెలికాప్టర్ వద్దకు వైసీపీ నాయకులు భారీగా వచ్చారని, పలువురు పోలీసులు గాయపడ్డారన్నారు. అయినా ఎంతో శ్రమతో విధులు నిర్వహించిన పోలీసులను తప్పుబట్టారని విమర్శించారు. ఇదంతా క్రిమినల్ లీడర్ ప్రీ ప్లాన్ అని ఆరోపించారు. భద్రతా వైఫల్యం ఆరోపణలపై చర్చకు సిద్ధంగా ఉన్నానని సవాల్ విసిరారు. కారుమూరి వ్యాఖ్యలపైనా అనిత మండిపడ్డారు. ఇలా రౌడీల్లా మాట్లాడినందుకే 11 సీట్లకు పడిపోయారని, అయినా.. వారికి బుద్ధి రావడంలేదని అన్నారు.
జగన్‌పై పోలీసులకు ఫిర్యాదు
పోలీసులను బట్టలు ఊడదీసి నిలబెడతానని జగన్ చేసిన వ్యాఖ్యలపై వీఎంఆర్‌డీఏ చైర్మన్, టీఎన్‌ఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రణవ్‌గోపాల్ అనుచరులు బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. జగన్‌పై కేసు నమోదు చేసి, అరెస్టు చేయాలని కోరారు.