TDP BC Leader: సర్దార్ గౌతు లచ్చన్న సేవలు స్ఫూర్తిదాయకం
ABN , Publish Date - Apr 20 , 2025 | 05:38 AM
యనమలకుదురులో గౌతు లచ్చన్న విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యేలు బోడె ప్రసాద్, గౌతు శిరీష. లచ్చన్న సేవలు, బీసీలకు ప్రాధాన్యత, సామాజిక సమానత్వం కోసం చేసిన కృషిని కొనియాడారు

ఎమ్మెల్యేలు బోడె ప్రసాద్, గౌతు శిరీష
యనమలకుదురులో గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ
పెనమలూరు, ఏప్రిల్19(ఆంధ్రజ్యోతి): స్వాతంత్య్ర ఉద్యమంలో జైలు జీవితం గడిపిన ఉద్యమకారుడు, సర్దార్ వల్లభాయ్ పటేల్ తర్వాత సర్దార్ అని పిలిపించుకొన్న గొప్ప వ్యక్తి గౌతు లచ్చన్న సేవలు స్ఫూర్తిదాయకమని ఎమ్మెల్యేలు బోడె ప్రసాద్, గౌతు శిరీష పేర్కొన్నారు. గౌతు లచ్చన్న వర్ధంతి సందర్భంగా శనివారం యనమలకుదురులో ఏర్పాటు చేసిన లచ్చన్న విగ్రహాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. చిన్నతనంలోనే జమిందారీ, ఈనాం వ్యవస్థల రద్దు కోసం ఇచ్చాపురం నుంచి తడ వరకు 2400 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ఆ రోజుల్లో పెను సంచలనం సృష్టించారని కొనియాడారు. అంటరానితనంపై కత్తి ఎత్తిన లచ్చన్న దళితులకు దేవాలయ ప్రవేశం, విద్యాభివృద్ధికి విశేష కృషి చేశారని తెలిపారు. ఐదుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎమ్మెల్సీగా, మంత్రిగా సుదీర్ఘ కాలం చట్టసభల్లో ప్రజాగొంతుకై ప్రాతినిధ్యం వహించారన్నారు. టంగుటూరి ప్రకాశం పంతులు, బెజవాడ రాజగోపాల్ రెడ్డి మంత్రివర్గాల్లో వ్యవసాయ శాఖ, కార్మికశాఖల మంత్రిగా పనిచేశారని, తన గురువు ఎన్జీ రంగా కోసం తాను రాజీనామా చేసి శ్రీకాకుళం నుంచి రంగాను ఎంపీగా గెలిపించిన ఘనతను దక్కించుకున్నారన్నారు.
లచ్చన్న ఆదర్శాలకు అనుగుణంగా టీడీపీ బీసీలకు ప్రాధాన్యత కల్పించడం, ఆయన కుమారుడు శివాజీ, మనుమరాలు శిరీషలు కూడా టీడీపీలో ఎమ్మెల్యేలుగా పార్టీపదవులు ఇచ్చి గౌరవించిందన్నారు. లచ్చన్నను ఆదర్శంగా తీసుకొని నాయకులు, కార్యకర్తలు నడుచుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణ, నాయకులు కొనకళ్ల బుల్లయ్య, వీరంకి గురుమూర్తి, అనుమోలు ప్రభాకరరావు, వెలగపూడి శంకరబాబు, శొంఠి శివరాంప్రసాద్, మొక్కపాటి శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.