Farmers Scheme: రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం..
ABN , Publish Date - Jul 31 , 2025 | 04:19 PM
ఏపీ రైతాంగానికి ఇది నిజంగా గుడ్ న్యూస్. ‘అన్నదాత సుఖీభవ’ పథకం అమలు చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందడుగు వేసింది. ఈ నేపథ్యంలోనే గురువారం నాడు అన్నదాత సుఖీభవ పథకం అమలుపై సంబంధిత అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు.

అమరావతి, జులై 31: ఆంధ్రప్రదేశ్ రైతాంగానికి ఇది నిజంగా గుడ్ న్యూస్. ‘అన్నదాత సుఖీభవ’ పథకం అమలు చేయడానికి ఏపీ ప్రభుత్వం ముందడుగు వేసింది. ఈ నేపథ్యంలోనే గురువారం నాడు అన్నదాత సుఖీభవ పథకం అమలుపై సంబంధిత అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లాల కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు సీఎం. ఆగస్టు 2వ తేదీన ‘అన్నదాత సుఖీభవ’ పథకాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం సన్నద్ధం అవుతోంది. అదే రోజున పీఎం కిసాన్ పథకం నిధులనూ కేంద్ర ప్రభుత్వం విడుదల చేయనుంది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రూ.6,000 సాయంతో కలిపి రాష్ట్ర వాటాగా మరో రూ.14,000 కూటమి ప్రభుత్వం ఇవ్వనుంది.
అన్నదాత సుఖీభవ పథకం కింద ఏడాదికి రైతుకు రూ.20,000లను 3 విడతలుగా ప్రభుత్వం ఇవ్వనుంది. మొదటి విడతలో రాష్ట్రం వాటా రూ.5,000.. కేంద్రం వాటా రూ.2,000 చొప్పున ఆగస్టు 2న విడుదల చేయనున్నారు. రాష్ట్రంలోని 46,85,838 మంది రైతులకు ‘అన్నదాత సుఖీభవ’తో లబ్ధి చేకూరనుంది. ఇందుకోసం రూ.2,342.92 కోట్ల నిధులను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో పీఎం కిసాన్ మొదటి విడత కింద కేంద్ర ప్రభుత్వం రూ.831.51 కోట్లు రైతుల ఖాతాలో జమ చేయనుంది. కాగా, ఆగస్టు 2న ప్రకాశం జిల్లా దర్శిలో ‘అన్నదాత సుఖీభవ’ పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించనున్నారు.
రాజధానిపై సమీక్ష..
ఏపీ రాజధాని అమరావతి బ్యూటిఫికేషన్, గ్రీన్-బ్లూ మాస్టర్ ప్లాన్‌పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి సురేశ్ కుమార్, ఏడీసీ సీఎండీ లక్ష్మీ పార్థసారథి హాజరయ్యారు. అమరావతిలో ట్రంక్ రోడ్లు, ఇతర అనుబంధ రోడ్లు, ఎల్పీఎస్ రోడ్లు, బఫర్ జోన్లలో ప్లాంటేషన్, బ్యూటిఫికేషన్, అవెన్యూ ప్లాంటేషన్‌పై చర్చించారు. అమరావతిలో అంతర్జాతీయస్థాయి ప్రమాణాలతో పార్కులు, హరిత ప్రాంతం ఉండేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఔషధ మొక్కలను నాటడంతోపాటు అమరావతిలో బయోడైవర్సిటీ ఉండేలా కార్యాచరణ చేపట్టాలని అధికారులకు సీఎం సూచించారు. గ్రీన్ బెల్ట్ ప్రాంతంలో దేశీయ వృక్షజాతులు ఉండేలా చూడాలని స్పష్టం చేశారు. రివర్ ఫ్రంట్ కూడా సుందరంగా కనిపించేలా శ్రద్ధ పెట్టాలని అధికారులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.
Also Read:
మీ ఇన్నర్ స్ట్రెంత్ ఏంటో తెలుసుకోవాలనుందా?
ఉలిక్కి పడేలా చేసిన ఫిర్యాదు.. తవ్వకాల్లో శవాలు
For More Andhra Pradesh News and Telugu News..