Srisailam Temple: శ్రీశైలంలో ఉచిత స్పర్శ దర్శనం ప్రారంభం
ABN , Publish Date - Jul 02 , 2025 | 06:45 AM
శ్రీశైలంలో సామాన్య భక్తులకు మల్లికార్జున స్వామి ఉచిత స్పర్శ దర్శనం మంగళవారం నుంచి ప్రారంభమైంది. ఉదయం ఆలయ అధికారులు పర్యవేక్షణలో ఉచిత దర్శనం, స్పర్శ దర్శనాలను కల్పించారు.

నంద్యాల, జూలై 1(ఆంధ్రజ్యోతి): శ్రీశైలంలో సామాన్య భక్తులకు మల్లికార్జున స్వామి ఉచిత స్పర్శ దర్శనం మంగళవారం నుంచి ప్రారంభమైంది. ఉదయం ఆలయ అధికారులు పర్యవేక్షణలో ఉచిత దర్శనం, స్పర్శ దర్శనాలను కల్పించారు. సుమారుగా ఏడాది తరువాత శ్రీశైలంలో ఉచిత స్పర్శ దర్శనం సేవలు ప్రారంభం కావడం విశేషం. గతంలో మాదిరిగా మంగళ, బుధ, గురు, శుక్ర వారాల్లో మధ్యాహ్నం 1:45 గంటల నుంచి 3:45 గంటల వరకు భక్తులకు అనుమతిస్తున్నట్టు ఈఓ శ్రీనివాసరావు తెలిపారు. శ్రీశైల మల్లికార్జున స్వామి స్వయంగా స్పర్శించి, ఆధ్యాత్మిక అనుభూతిని ప్రతి భక్తుడు పొందాలనే భక్తుల కోరిక మేరకు కొత్తగా టోకెన్ విధానాన్ని అమలు చేశామన్నారు. అంతేకాకుండా ప్రతిరోజూ ఆఫ్‌లైన్‌లో శ్రీశైలంలో ప్రత్యేక కౌంటర్ల ద్వారా టోకెన్లను జారీ చేస్తామన్నారు. భక్తుడి పేరు, ఆధార్, ఫోన్ నంబర్ నమోదు చేసి టోకెన్లు ఇస్తామన్నారు. స్కానింగ్ చేసిన తర్వాతే ఉచిత దర్శనానికి అనుమతిస్తామని తెలిపారు.