Fake News: తప్పుడు వార్తలతో ప్రజాస్వామ్యానికి చేటు
ABN , Publish Date - Jun 25 , 2025 | 03:25 AM
సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారమవుతున్న ఫేక్ వార్తలతో ప్రజాస్వామ్యానికి చేటు అని ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్ ఆలపాటి సురే్‌షకుమార్ ఆందోళన వ్యక్తం చేశారు

ఏపీయూడబ్ల్యూజే సెమినార్‌లో ప్రెస్ అకాడమీ చైర్మన్ ఆలపాటి
నేడు, రేపు ఒంగోలులో యూనియన్ రాష్ట్ర మహాసభలు
ఒంగోలు, జూన్ 24 (ఆంధ్రజ్యోతి): సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారమవుతున్న ఫేక్ వార్తలతో ప్రజాస్వామ్యానికి చేటు అని ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్ ఆలపాటి సురే్‌షకుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. వాటి ప్రభావం నేడు అత్యధికంగా తెలుగు సమాజంలో ఉందని, జర్నలిస్టులు, పౌర సమాజం విచక్షణతో గుర్తించి అడ్డుకోవాలని కోరారు. ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో మంగళవారం ఒంగోలులో ‘కృత్రిమ మేధ- సామాజిక మాధ్యమాలు-వాస్తవాలు నిర్ధారణ’ అనే అంశంపై జరిగిన సెమినార్‌లో ఆలపాటి మాట్లాడారు. కొన్ని రాజకీయ పార్టీలు అధికారం కోసం ఈ విధమైన అబద్ధపు ప్రచారాలపై ఆధారపడుతున్నాయని విమర్శించారు.
తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె.శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ సామాజిక మాధ్యమాల్లో వచ్చే ఫేక్ న్యూస్‌ను నిర్ధారించుకోకుండా ప్రచారం చేస్తే ఇబ్బందులు తప్పవని, ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర 36వ మహాసభలు బుధ, గురువారాల్లో ఒంగోలులో జరగనున్నాయి. బుధవారం జరిగే ప్రారంభ సభలో పలువురు రాష్ట్ర మంత్రులు, జర్నలిస్టు యూనియన్ నాయకులు పాల్గొననున్నారు.