AP High Court: నకిలీ నెయ్యి నిందితులకు బెయిల్
ABN , Publish Date - Jul 04 , 2025 | 03:15 AM
టీటీడీ (తిరుమల తిరుపతి దేవస్థానం)కి నకిలీ నెయ్యి సరఫరా చేసిన కేసులో భోలేబాబా డెయిరీ డైరెక్టర్లు పోమిల్ జైన్(ఏ3), విపిన్ జైన్(ఏ4), వైష్ణవి డెయిరీ సీఈవో అపూర్వ వినయ్‌కాంత్ చావడా(ఏ5)లకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.

భోలేబాబా డైరెక్టర్లు, వైష్ణవి డెయిరీ సీఈవోలకు మంజూరు
అమరావతి, జూలై 3(ఆంధ్రజ్యోతి): టీటీడీ (తిరుమల తిరుపతి దేవస్థానం)కి నకిలీ నెయ్యి సరఫరా చేసిన కేసులో భోలేబాబా డెయిరీ డైరెక్టర్లు పోమిల్ జైన్(ఏ3), విపిన్ జైన్(ఏ4), వైష్ణవి డెయిరీ సీఈవో అపూర్వ వినయ్‌కాంత్ చావడా(ఏ5)లకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. తిరుపతి రెండవ అదనపు ఫస్ట్‌క్లాస్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ సంతృప్తి మేరకు రూ.25వేలతో ఒక్కొక్కరూ రెండు పూచీకత్తులు సమర్పించాలని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ కె.శ్రీనివాసరెడ్డి గురువారం తీర్పు ఇచ్చారు. కాగా, పిటిషనర్లకు షరతులు విధించాలని సీబీఐ తరఫు న్యాయవాది పీఎ్‌సపీ సురే్‌షకుమార్ కోరగా, ఇప్పటికే అధికారులు ఛార్జిషీట్ దాఖలు చేశారని, ఈ దశలో ఎలాంటి షరతులు విధించగలమని న్యాయమూర్తి ప్రశ్నించారు. అనంతరం ఆ అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి దర్యాప్తునకు సహకరించాలని, దర్యాప్తు అధికారి కోరినప్పుడు విచారణకు హాజరుకావాలని పిటిషనర్లను ఆదేశించారు. ఈ కేసులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న పోమిల్ జైన్, విపిన్ జైన్, అపూర్వ వినయ్‌కాంత్ చావడా దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లపై హైకోర్టులో ఇటీవల వాదనలు ముగియంతో న్యాయమూర్తి గురువారం బెయిల్ మంజూరు చేస్తూ నిర్ణయం వెల్లడించారు.