Fake Ayodhya Temple: భక్తి ముసుగులో.. అయోధ్య రామాలయాన్నే..
ABN , Publish Date - Jul 22 , 2025 | 05:56 AM
భక్తి ముసుగులో ఫక్తు వ్యాపారానికి తెరతీశారు. అయోధ్య రామాలయాన్నే దానికోసం ఎంచుకున్నారు.

భక్తి పేరుతో విశాఖలో భారీ దోపిడీకి స్కెచ్
బీచ్‌లో అయోధ్య నమూనా ఆలయం ఏర్పాటు
దర్శనం టికెట్ రూ.50, చెప్పులకు రూ.5 వసూలు
కల్యాణోత్సవం పేరుతో మరో దోపిడీకి తెర
ఒక్కో టికెట్ రూ.2,999లకు విక్రయం
భద్రాద్రి నుంచి పండితులు వస్తారంటూ ప్రచారం
ఈ ప్రచారంపై భద్రాచలం దేవస్థానం ఈఓ విచారణ
నిర్వాహకులపై విశాఖ కలెక్టర్‌కు, పోలీసులకు ఫిర్యాదు
విశాఖపట్నం, జూలై 21(ఆంధ్రజ్యోతి): భక్తి ముసుగులో ఫక్తు వ్యాపారానికి తెరతీశారు. అయోధ్య రామాలయాన్నే దానికోసం ఎంచుకున్నారు. ఆ రామాలయం సెట్ వేసి భారీగా డబ్బులు కొట్టేస్తున్నారు. అయోధ్యకు వెళ్లి రాముడిని ఎప్పుడు చూస్తామో, ఇక్కడ దర్శనం చేసుకుంటే పుణ్యం వస్తుంది కదా! అనుకునే భక్తులే టార్గెట్‌గా విశాఖపట్నంలో పెద్దఎత్తున దోపిడీ చేస్తోంది ఓ బృందం. బీచ్ రోడ్డులో పార్క్ హోటల్ పక్కనే ఖాళీ స్థలంలో మే నెలాఖరులో అయోధ్య రామాలయం సెట్ వేశారు. రెండు నెలలే ఉంటుందని ప్రకటించారు. భక్తులు భారీగా వస్తున్నారు. నమూనా ఆలయంలోకి వెళ్లాలంటే రూ. 50 టికెట్ తీసుకోవాల్సిందే. చెప్పులు పెట్టుకోవడానికి ఇంకో రూ. 5 చెల్లించాలి. లోపలికి వెళ్లాక రాముడిని కళ్లారా చూసి నమస్కారం చేసుకునేలోపే అక్కడ ఉండే సిబ్బంది బయటకు లాగేస్తున్నారు. పగటి పూట జనాలు లేకపోయినా సరే పెద్దపెద్దగా కేకలు వేస్తూ నానా హంగామా చేస్తున్నారు. భక్తులు ఎక్కువగా వచ్చే సాయంత్రం వేళ బౌన్సర్లను పెడుతున్నారు.
బీచ్ రోడ్‌లో ట్రాఫిక్ జామ్
శని, ఆదివారాల్లో రద్దీ ఎక్కువగా ఉంటోంది. కార్లు, ద్విచక్ర వాహనాలను బీచ్ రోడ్డులో పార్కు చేస్తున్నారు. వందలాది వాహనాలతో పార్కింగ్ ప్రదేశాలన్నీ నిండిపోయి సాధారణ ప్రజలు నడిచి వెళ్లడానికి కూడా రోడ్డుపై ఖాళీ ఉండడం లేదు. ఆ రెండు రోజుల్లో పార్క్ హోటల్ జంక్షన్‌లో ట్రాఫిక్‌ను నియంత్రించడం పోలీసులకు సాధ్యపడడం లేదు. అయితే బీజేపీ పేరు చెప్పి నిర్వాహకులు పోలీస్ అధికారులను అటువైపు రానీయడం లేదని తెలుస్తోంది. ఆ పార్టీ యూత్ కమిటీలో రాష్ట్ర స్థాయి నేత దందాలో కీలకంగా ఉన్నారని ప్రచారం జరుగుతోంది.
కల్యాణోత్సవం అంటూ ప్రచారం
నిజానికి ఈ నెలాఖరుతో నమూనా ఆలయ ప్రదర్శన ముగించాలి. దీంతో మరో దోపిడీకి నిర్వాహకులు తెరలేపారు. ఈనెల 29న అయోధ్య రాముడికి కల్యాణోత్సవం నిర్వహిస్తామని, దానికి రూ. 2,999 టికెట్ తీసుకోవాలని ప్రచారం చేస్తున్నారు. ఫ్లెక్సీలు పెట్టి టికెట్లు కూడా విక్రయిస్తున్నారు. భద్రాచలంలోని సీతారామచంద్ర స్వామి దేవస్థానం పండితులు వచ్చి కల్యాణం క్రతువు నిర్వహిస్తారని కూడా సోషల్ మీడియాలో ప్రచారం హోరెత్తిస్తున్నారు. ఈ ప్రచారంపై భద్రాచలం ఆలయ అధికారులకు తెలిసి విచారణ నిర్వహించారు. అక్కడి నుంచి పండితులెవరూ విశాఖపట్నం రావడం లేదని తేలింది. కల్యాణోత్సవంపై కనీస సమాచారం కూడా ఇవ్వకుండా దేవాలయం పేరును దుర్వినియోగం చేస్తున్నట్టు గుర్తించిన ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎల్.రమాదేవి.. విశాఖపట్నం కలెక్టర్‌కు, పోలీస్ కమిషనర్‌కు, 3వ పట్టణ పోలీస్ స్టేషన్‌కు, దేవదాయ శాఖ అధికారులకు ఆదివారం ఫిర్యాదు చేశారు. దీనిపై మూడో పట్టణ పోలీసులు సోమవారం నమూనా ఆలయం వద్దకు వెళ్లి ప్రాథమిక విచారణ చేశారు. అయితే తమ వెనుక బీజేపీ ఎంపీ ఒకరు ఉన్నారని నిర్వాహకులు ప్రచారం చేస్తున్నారని, కేసు నమోదుకు పోలీసులు తటపటాయిస్తున్నారని తెలిసింది. ఇక్కడ ప్రదర్శన ఏర్పాటులో తప్పులేదని, కానీ దానిని వ్యాపారాత్మకంగా నిర్వహించడం, భద్రాచలం పేరును ఉపయోగించడం వారి దుర్బుద్ధిని వెల్లడిస్తోందని భక్తులు ఆరోపిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఆర్టీఐలో సామాజిక న్యాయం ఎక్కడ? ప్రభుత్వానికి ఎమ్మెల్సీ కవిత సూటి ప్రశ్న..
రేవంత్ నాటుకోడి.. కేటీఆర్ బాయిలర్ కోడి
Read latest Telangana News And Telugu News