Tirupati: శ్రీవారిమెట్టు మార్గంలో ఏనుగుల బీభత్సం..
ABN , Publish Date - Jul 30 , 2025 | 11:47 AM
చంద్రగిరి మండలం శ్రీవారిమెట్టు మార్గంలో మంగళవారం రాత్రి ఏనుగులు హల్‌చల్ చేశాయి. రాత్రి 8.30 గంటలకు 11 ఏనుగులు ఈ మార్గంలోని పంప్ హౌస్, మయూర డైరీ ఫామ్, శ్రీనివాసమంగాపురం ఎస్టీ కాలనీ, సత్యసాయి ఎస్టీ కాలనీ ప్రాంతాల్లో తిరుగుతూ భయాందోళన కలిగించాయి.

- వరి, మామిడి తోటల ధ్వంసం
- గంటన్నర ఆలస్యంగా భక్తులకు అనుమతి
చంద్రగిరి(తిరుపతి): చంద్రగిరి మండలం శ్రీవారిమెట్టు మార్గంలో మంగళవారం రాత్రి ఏనుగులు హల్‌చల్ చేశాయి. రాత్రి 8.30 గంటలకు 11 ఏనుగులు ఈ మార్గంలోని పంప్ హౌస్, మయూర డైరీ ఫామ్, శ్రీనివాసమంగాపురం ఎస్టీ కాలనీ, సత్యసాయి ఎస్టీ కాలనీ ప్రాంతాల్లో తిరుగుతూ భయాందోళన కలిగించాయి. విషయం తెలుసుకున్న అటవీ అధికారులు సిబ్బందితో వెళ్ళి డ్రోన్ల ద్వారా ఏనుగుల సంచారాన్ని గుర్తించారు. వీటిని శేషాచలం(Sheshachalam) అడవుల్లోకి మళ్లించడానికి ప్రయత్నించారు.
ఈలోగానే అవి సత్యసాయి ఎస్టీ కాలనీ సమీపంలో మేడసాని ఆనందనాయుడికి చెందిన మామిడి, అరటి చెట్లను ధ్వంసం చేశాయి. చెంచయ్య వరి పొలాన్ని తొక్కేశాయి. మంగళవారం ఉదయం 6.30 గంటలకు ఏనుగుల గుంపు శేషాచలం అటవీ ప్రాంతంలోకి వెళ్లిందని తెలిశాక రైతులు ఊపిరి పీల్చుకున్నారు. శ్రీవారిమెట్టు మార్గంలో సాధారణంగా రోజూ ఉదయం 5 గంటలకే భక్తులను అనుమతిస్తారు. ఏనుగుల సంచార సమాచారంతో 6.30 గంటలకు శ్రీనివాస మంగాపురం నుంచి శ్రీవారిమెట్టుకు బస్సుల్లో అనుమతించారు.
శ్రీనివాసమంగాపురం ఎస్టీ కాలనీ, నరసింగాపురం పంచాయతీలోని సత్యసాయి ఎస్టీ కాలనీ, రామిరెడ్డిపల్లె పంచాయతీలోని వైకుంఠపురం ఎస్టీ కాలనీ, ఎ.రంగంపేట పంచాయతీలోని ఎంబీయూ విద్యాసంస్థ ప్రాంతం, రాగిమాకుల ఎస్టీ కాలనీ, దుర్గం ఎస్టీకాలనీల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నాగపట్ల రేంజ్ ఫారెస్ట్ అధికారులు సూచించారు. ఈ ప్రాంతాల ప్రజలతో వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేశామన్నారు. ఏనుగుల కదలికల గురించి తెలిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని కోరారు.
ఈ వార్తలు కూడా చదవండి..
శ్రావణ మాసంలో శుభవార్త.. బంగారం, వెండి ధరల్లో ఊహించని తగ్గింపు!
బీసీ రిజర్వేషన్ల కోసం 72 గంటల దీక్ష
Read Latest Telangana News and National News