Share News

Electrical Hazards: విద్యుత్‌ ప్రమాదాలు బాధాకరం

ABN , Publish Date - Jul 02 , 2025 | 06:52 AM

ఏటా విద్యుత్‌ ప్రమాదాలు పెరిగి ఆస్తి, ప్రాణ నష్టం జరగడం ఆందోళన కలిగిస్తోందని విద్యుత్‌ తనిఖీ అధికారి జి.విజయలక్ష్మి పేర్కొన్నారు. విజయవాడలోని విద్యుత్‌సౌధలో మంగళవారం నిర్వహించిన ‘‘విద్యుత్‌ భద్రతా దినం’’లో ఆమె మాట్లాడుతూ..

Electrical Hazards: విద్యుత్‌ ప్రమాదాలు బాధాకరం

  • నియంత్రించేందుకు చర్యలు: తనిఖీ అధికారి జి.విజయలక్ష్మి

విజయవాడ, జూలై 1 (ఆంధ్రజ్యోతి): ఏటా విద్యుత్‌ ప్రమాదాలు పెరిగి ఆస్తి, ప్రాణ నష్టం జరగడం ఆందోళన కలిగిస్తోందని విద్యుత్‌ తనిఖీ అధికారి జి.విజయలక్ష్మి పేర్కొన్నారు. విజయవాడలోని విద్యుత్‌సౌధలో మంగళవారం నిర్వహించిన ‘‘విద్యుత్‌ భద్రతా దినం’’లో ఆమె మాట్లాడుతూ.. విద్యుత్‌ వినియోగించే ప్రతి ఒక్కరిలో భద్రతపై అవగాహన పెంచడంతో పాటు విద్యుత్‌ ప్రమాదాల నివారణకు తీసుకోవలసిన జాగ్రత్తలను తెలియపరచడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమన్నారు. ఏటా జూన్‌ 26 నుంచి జూలై 2వ తేదీ వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తునామని తెలిపారు. విద్యుత్‌ విషయంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఆమె సూచించారు. ప్రతి ఇంటికి ఎర్తింగ్‌ ఇచ్చినప్పుడు రెండు ఎర్త్‌ ఎలక్ర్టోడ్‌లను అమర్చుకోవాలని సూచించారు. ఇళ్లలో వినియోగించే ఇన్వర్టర్లను సరైన గాలి, వెలుతురు తగిలే ప్రాంతంలో ఉంచాలన్నారు. ఎలక్ర్టిక్‌ వాహనాల చార్జింగ్‌ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని లేదంటే బ్యాటరీ పేలి ప్రాణాలు కోల్పోయే ప్రమాదముందని ఆమె పేర్కొన్నారు. ఇళ్లపై ఏర్పాటుచేసుకునే సౌరవిద్యుత్‌ పలకలను నియమాలకనుగుణంగా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. వ్యవసాయ పంపు సెట్లకు సంబంధించిన మోటార్‌ స్టార్టర్ల స్విచ్‌ల కోసం ఇనుప బోర్డును ఏర్పాటు చేయకపోవడం మంచిదని తెలిపారు. విద్యుత్‌ షాక్‌కు గురైన వ్యక్తిని రక్షించే ప్రయత్నంలో చేతులతో తాకకుండా ఎండు కర్ర, ప్లాస్టిక్‌ వస్తువులతో తీగలను వేరు చేయాలని చెప్పారు. హైటెన్షన్‌ విద్యుత్‌ తీగల కింద భవనాలు నిర్మించొద్దని విజయలక్ష్మి హెచ్చరించారు.

Updated Date - Jul 02 , 2025 | 07:04 AM