Share News

మద్ద‘తుని’.. కూడగట్టుకుని..

ABN , Publish Date - Apr 29 , 2025 | 12:53 AM

టీడీపీ మద్దతుని సంపాదించింది.. చైర్మన్‌ పీఠాన్ని కైవసం చేసుకుంది. కాకినాడ జిల్లా తుని మునిసిపాలిటీలో చైర్‌పర్సన్‌ పీఠంతోపాటు వైస్‌ చైర్మన్‌ను టీడీపీ దక్కించుకుంది.

మద్ద‘తుని’.. కూడగట్టుకుని..

ప్రశాంతంగా మునిసిపల్‌ ఎన్నిక

చైర్‌పర్సన్‌, వైస్‌ చైర్మన్ల ఏకగ్రీవం

చైర్‌పర్సన్‌గా భువన సుందరి

వైస్‌ చైర్మన్‌గా ఆచంట సురేష్‌

పట్టణంలో 144 అమలు

తునిరూరల్‌,ఏప్రిల్‌28(ఆంధ్రజ్యోతి): టీడీపీ మద్దతుని సంపాదించింది.. చైర్మన్‌ పీఠాన్ని కైవసం చేసుకుంది. కాకినాడ జిల్లా తుని మునిసిపాలిటీలో చైర్‌పర్సన్‌ పీఠంతోపాటు వైస్‌ చైర్మన్‌ను టీడీపీ దక్కించుకుంది. టీడీపీ మద్దతు ప్రకటించిన చైర్‌పర్సన్‌ నార్ల భువన సుందరి, వైస్‌చైర్మన్‌ ఆచంట సురేష్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తుని మునిసిపాలిటీలో మొత్తం 30 మంది కౌన్సిల్‌ ఉండగా, వీరంతా వైసీపీ నుంచే గెలిచారు. వీరిలో ఒకరు మృతి చెందగా, మరొకరు రాజీనామా చేశారు. దీంతో 28 మంది కౌన్సిల్‌ సభ్యులు ఉండగా 15మంది కౌన్సిలర్లు టీడీపీలోకి చేరడంతో వైసీపీ బలం సన్నగిల్లింది. ఈనేపథ్యంలో ఎన్నిక లాంఛన మైంది. ఎన్నికల పరిశీలకులు, కాకినాడ జేసీ రాహుల్‌మీనా, ఎన్నికల అధికారి, డీపీవో రవి కుమార్‌ సోమవారం ఉదయం 11 గంటలకు మునిసిపల్‌ కౌన్సిల్‌ హాల్లో ఎన్నిక నిర్వహించా రు. 26వ వార్డు కౌన్సిలర్ల కొచ్చెర్లపాటి రూపాదేవి 18వ వార్డు కౌన్సిలర్‌ నార్ల భువన సుందరిని చైర్‌పర్సన్‌ అభ్యర్థిగా ప్రతిపాదించగా 24వ వార్డు కౌన్సిలర్‌ పులి సత్యనారాయణ మ ద్దతు తెలిపారు. దీంతో మునిసిపల్‌ చైర్‌పర్స న్‌గా నార్ల భువనసుందరి ఏకగ్రీవంగా ఎన్నికై నట్టు ప్రకటించారు. వైస్‌చైర్మన్‌గా 19వ వార్డు కౌన్సిలర్‌ ఆచంట సురేష్‌ను 28వ వార్డు కౌన్సిలర్‌ చింతకాయల భారతి ప్రతిపాదించగా 9వ వార్డు కౌన్సిలర్‌ వాసంశెట్టి శ్రీనివాస్‌ మద్దతు తెలపగా, వైస్‌చైర్మన్‌గా సురేష్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మునిసిపల్‌ ఎక్స్‌ అఫీషియో మెంబర్‌గా ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే యనమల దివ్య హాజరై చైర్‌పర్సన్‌, వైస్‌ చైర్మన్లను అభి నందించారు. తర్వాత ఎన్నికల అధికారి రవికుమార్‌ నియామకపత్రాలు అందజేసి ప్రమాణస్వీకారం చేయించారు. ముహూర్త సమయా నికి ఎమ్మెల్యే దివ్య చైర్‌పర్సన్‌ భువన సుందరిని మునిసిపల్‌ పీఠంపై కూర్చోబెట్టి అభినం దించారు. ఎన్నికల నేపథ్యంలో మునిసిపల్‌ కా ర్యాలయం, పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్‌ అమలుచేశారు. డీఎస్పీ శ్రీహరిరాజు, సీఐలు గీతారామకృష్ణ, చెన్నకేశవరావు ఆధ్వర్యంలో భారీగా పోలీసులు మోహరించారు.

పదవి బాధ్యతగా భావించి పనిచేస్తా

తనపై నమ్మకం ఉంచి చైర్మన్‌గా అవకాశం ఇచ్చినం దుకు ఆనందంగా ఉంది. ఈ పదవిని బాధ్యతగా భావించి పట్టణాభివృద్ధికి కృషి చేస్తా. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు, ఎమ్మెల్యే యనమల దివ్య సూచనలతో ముందుకు వెళతా. పట్టణంలో శానిటేషన్‌ మెరుగుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటా.

-నార్ల భువన సుందరి, చైర్‌పర్సన్‌

తుని అభివృద్ధే లక్ష్యం: ఎమ్మెల్యే దివ్య

తుని నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నాం. పట్టణాభివృద్ధికి కంకణబద్దులై తనతో అడుగులు వేసేందుకు 15 మంది కౌన్సిలర్లు స్వచ్ఛందంగా టీడీపీలో చేరారు. వారందరి సహకారంతో పట్టణాన్ని స్మార్ట్‌గా తీర్చిదిద్దేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తా.

Updated Date - Apr 29 , 2025 | 12:53 AM