Share News

46 లక్షల మందికి అన్నదాత సుఖీభవ

ABN , Publish Date - Aug 03 , 2025 | 12:19 AM

రాష్ట్రంలో 46 లక్షల మంది రైతులకు అన్నదాత సుఖీభవ -పీఎం కిసాన్‌ మొదటి విడత పెట్టుబడి సాయం అందించినట్టు రాష్ట్ర జల వనరులశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు.

46 లక్షల మందికి అన్నదాత సుఖీభవ
కొవ్వూరులో అన్నదాత సుఖీభవ చెక్‌ అందజేస్తున్న మంత్రి నిమ్మల, ఎమ్మెల్యే ముప్పిడి, కలెక్టర్‌

కొవ్వూరు, ఆగస్టు 2(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో 46 లక్షల మంది రైతులకు అన్నదాత సుఖీభవ -పీఎం కిసాన్‌ మొదటి విడత పెట్టుబడి సాయం అందించినట్టు రాష్ట్ర జల వనరులశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. కొవ్వూరు లిటరరీ క్లబ్‌ కల్యాణ మండపంలో ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు అధ్యక్షతన శనివారం నియోజకవర్గ అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్‌ 2025-26 మొదటి విడత నిధుల జమ కార్యక్రమాన్ని ప్రారం భించి మాట్లాడారు. జగన్మోహనరెడ్డి ప్రభు త్వంలో వ్యవసాయశాఖ నిర్వీర్యమైపోయిందన్నారు.గత ఐదేళ్ల వైసీపీ పాలనలో ఆరుగాలం పండించిన ధాన్యం అమ్మకాలకు రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారన్నారు. సొమ్ములు సకాలం లో చెల్లించలేదన్నారు. కూటమి ప్రభుత్వం గత ప్రభుత్వం రైతులకు బకాయిపడిన ధా న్యం సొమ్ము రూ.1640 కోట్లు చెల్లించిందన్నారు. అంతే కాదు ధాన్యం విక్రయించిన 48 గంటల్లో రైతు ఖాతాకు సొమ్ము జమ చేస్తు న్నామన్నారు.ప్రజాస్వామ్యంలో జగన్‌లాంటి వ్యక్తులు ఉండడానికి అనర్హులన్నారు. ఎవరైనా చనిపోతే వారం రోజుల్లో పరామర్శకు వెళ్తాం. జగన్‌రెడ్డి సంవత్సరం తరువాత పరామర్శకు వెళ్తారన్నారు. దేశచరిత్రలో బెట్టింగ్‌ రాయుళ్లకి, గంజాయి బ్యాచ్‌, బ్లేడ్‌ బ్యాచ్‌లకి విగ్రహావిష్కరణ చేసిన ఘనత ఒక జగన్మోహనరెడ్డికే చెల్లిందన్నారు. 2047కి తెలుగుజాతి ప్రపంచంలో అగ్రగామిగా ఉండాలని చంద్రబాబు, పవన్‌, నరేంద్ర మోదీ కృషిచేస్తుంటే మరోప్రక్కన అడుగడుగునా సమస్యలు సృష్టిస్తున్నారన్నారు.పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు మళ్లీ పట్టాలెక్కించారన్నారు. ఈ ఏడాది డిసెంబరు నాటికి డయాఫ్రమ్‌ వాల్‌, ప్రాజెక్టు పూర్తిచేయాలని లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ఉందన్నారు. చాగల్లు మండలంలో ఉన్న ముంపుగ్రామాల సమస్యను పరిష్కరిస్తానన్నారు. రాష్ట్రం లో 1050 ఎత్తిపోతల పథకాలు ఉంటే వాటిలో 540 పథకాలు పనిచేయడం లేదన్నారు. ప్రైవేటు ఏజెన్సీలకు ఇచ్చి మరమ్మతులు చేసి నిర్వహించే బాధ్యతలు అప్పగించేలా రైతుల పక్షాన ప్రతిపాదనలు తయారుచేస్తున్నామన్నారు. సుమారు 6 వేల కోట్లతో ప్రతిపాదనలు వచ్చాయన్నారు. మంగళవారం సమావేశం నిర్వహించి నిర్ణయం తీసుకుందామని సీఎం చెప్పారన్నారు. మరమ్మతులకు గురై మూతపడిన లిఫ్టులను పునః ప్రారంభిస్తామన్నారు. కొవ్వూరు నియోజకవర్గంలో ఎత్తిపోతల పథకాలు మరమ్మతులకు గురయ్యాయని, గ్రామా లు ముంపుకు గురవుతున్నాయని ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు తెలిపారు.జిల్లా కలెక్టర్‌ పి.ప్రశాంతి మాట్లాడుతూ అన్నదాత సుఖీభవ పెట్టుబడి సాయం కింద రైతుల ఖాతాల్లో మొదటి విడతగా రూ. 7 వేలు జమచేయడం జరుగుతుందన్నారు. జిల్లాలో లక్షా 14 వేల మందికి రూ.79 కోట్లు జమచేశారన్నారు. భూమిలేని కౌలు రైతులకు ఈ పథకం వర్తిస్తుందన్నారు. కౌలు రైతులకు అక్టోబర్‌, జనవరి నెలల్లో రూ. 20 వేలు జమ చేస్తామన్నారు. ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతు సత్యనారాయణను మార్గదర్శిగా ఎంపిక చేసినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆర్డీవో రాణిసుస్మిత, ద్విసభ్య కమిటీ సభ్యులు జొన్నలగడ్డ సుబ్బరాయచౌదరి, కంఠమణి రామకృష్ణారావు, ఏఎంసీ చైర్మన్‌ నాదెళ్ళ శ్రీరామ్‌, బీజేపీ జిల్లా అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర,ఎంపీపీ కాకర్ల నారాయుడు, అదనపు ఎస్పీ సుబ్బరాజు, జిల్లా వ్యవసాయాధికారి ఎన్‌.మాధవరావు, సి.హెచ్‌.శ్రీనివాసరావు,ఎ.గంగాధర్‌,సూరపనేని చిన్ని, దాయ న రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 03 , 2025 | 12:19 AM