Share News

ఒక ఊరు..నూరు లాడ్జిలు!

ABN , Publish Date - Aug 03 , 2025 | 12:15 AM

ఆ ఆలయానికి వెళితే వసతికి వెతుక్కోవాల్సిన పనే ఉండదు.. ఆలయం ఎదుట నిలబడి ఎటు చూసినా రూమ్స్‌ అద్దెకు ఇవ్వబడును అంటూ బోర్డులు దర్శనమిస్తాయి..

ఒక ఊరు..నూరు లాడ్జిలు!
ఆలయం వద్ద ప్రతి ఇంటి ముందు రూమ్స్‌ కలవు బోర్డులు

ఏ వీధిలో చూసినా గెస్ట్‌రూమ్‌లు

లాడ్జిలుగా మారుతున్న నివాసాలు

ఏ ఇంటికెళ్లినా అద్దెకు రూమ్స్‌

శ్రీ పాదుడి ఆలయం వద్ద డిమాండ్‌

ఇప్పటికే 100 లాడ్జిలు నిర్వహణ

నిర్మాణంలో మరో 150

రోజురోజుకు పెరుగుతున్న భక్తులు

1500 మందికి ఉపాధి

(ఆంధ్రజ్యోతి-పిఠాపురం)

ఆ ఆలయానికి వెళితే వసతికి వెతుక్కోవాల్సిన పనే ఉండదు.. ఆలయం ఎదుట నిలబడి ఎటు చూసినా రూమ్స్‌ అద్దెకు ఇవ్వబడును అంటూ బోర్డులు దర్శనమిస్తాయి.. ఎందుకంటే అక్కడ ప్రతి ఇల్లూ ఒక అతిథి గృహమే.. ఈ నేపథ్యంలో ఏ ఇంటి తలుపు తట్టినా అతిథిదేవోభవ అంటూ ఆహ్వానిస్తారు.. అదిరే సౌకర్యాలతో ఆతిథ్యం ఇస్తారు.. ఫ్రీగా అనుకునేరు.. అంతా డబ్బులకే.. ఇదెక్కడో కాదండోయ్‌.. పిఠాపురంలోని శ్రీపాద శ్రీవల్లభుడి ఆలయం చుట్టూ ఉన్న పరిస్థితి.. ఒక 100 వరకూ లాడ్జిలు ఉన్నాయంటే అతిశయోక్తి కాదేమో.. ఇక్కడ కాశీ తరహాలో వసతి సదుపాయాలు ఉంటాయి.. అక్కడ ప్రతి ఇల్లు ఒక వసతి గృహమే. వీధులు, సందులు ఎక్కడ చూసినా ‘రూమ్‌లు అద్దెకు ఇవ్వబడును’ అంటూ ఇంగ్లీషు, హిందీ, మరాఠీ భాషల్లో బోర్డులు కనిపిస్తాయి. శ్రీపాదుడి ఆలయానికి చుట్టూ 200 మీటర్ల పరిధిలో ఇప్ప టికే 100కిపైగా లాడ్జిలు ఉన్నాయి. మరో 50 వరకూ నిర్మాణంలో ఉన్నాయి. భక్తులకు గదులు అద్దెకు ఇవ్వడం ద్వారా పలువురు ఉపాధి పొం దుతున్నారు.కాశీ తరహాలో ఒక ఆలయం చుట్టూ ఇన్ని వసతి సముదాయాలు ఉన్న పరిస్థితి గోదావరి జిల్లాల్లో ఎక్కడా కానరాదు.

శ్రీపాదశ్రీవల్లభుడి భక్తుల రాక..

మరాఠీలు, ఉత్తరాది రాష్ట్రాలు వారు తమ ఇంటి ఇలవేల్పుగా దత్తాత్రేయస్వామి ప్రథమ అవతారమైన శ్రీపాదశ్రీవల్లభుడిని భావిస్తారు. ఈ మేరకు ఆయన జన్మించిన పిఠాపురం పట్టణంలోని శ్రీపాదశ్రీవల్లభ మహాసంస్థానానికి ఏటా 20 లక్షల మంది భక్తులు వస్తుంటారు. మహారాష్ట్రతో పాటు కర్నాటక, ఉభయ తెలుగు రాష్ట్రాలు, ఉత్తరాది నుంచి భక్తులు ఇక్కడకు వచ్చి శ్రీపాద శ్రీవల్లభుడిని దర్శించుకుంటారు. ఏటా గురువారాలు, చిత్తనక్షత్రం వచ్చే రోజులతో పాటు శ్రీపాద శ్రీవల్లభ జయంతి సప్తాహా మహోత్సవాలు, దత్త జయంతి ఉత్సవాలు, విజయదశమి, ఇతర పర్వదినాల సమయాల్లో భక్తుల రద్దీ అధికంగా ఉం టుంది.ఈ ఆలయానికి వచ్చే భక్తులు కనిష్ఠంగా మూ డు రోజులు, గరిష్ఠంగా తొమ్మిది రోజులు ఉంటారు. కొందరు ఏటా నెల రోజుల పాటు ఉండి శ్రీపాదశ్రీవల్లభ చరిత్ర, గురుచరిత్ర పారాయణ చేసుకుంటారు.

భక్తనివాసాలుగా..

భక్తుల రద్దీ దృష్ట్యా నివాస గృహాలు లాడ్జిలు, భక్తనివాస్‌లు, వసతి సముదాయాలుగా మారిపోయాయి. ఆలయ వసతి సముదాయాల్లో 70 గదులు ఉన్నాయి. ఇవి పూర్తిగా ఉచితమైనా భక్తుల అవసరాలను తీర్చలేకపోతున్నాయి. ఇప్పుడు ఈ క్షేత్రం చుట్టూ 200 మీటర్ల పరిధిలో 100కిపైగా లాడ్జిలు ఉన్నాయి. ఇవి గాక పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో 15 వరకూ ఉన్నా పర్వదినాల సమయాల్లో రూమ్‌లు సరిపోని పరిస్థితి. సాధారణ రోజుల్లో 12 గంటలకు రూ.వెయ్యి, 24 గంటలకు రూ.1500 నుంచి రూ.2,500 వరకూ అద్దెగా వసూలు చేస్తున్నారు. పర్వదినాల సమయంలో మాత్రం 12 గంటల ప్రాతిపదికన అద్దె రూ.2 వేల నుంచి రూ.4 వేల వరకూ ఉంటోంది. భక్తులు వసతిని ఆలయ పరిసరాల్లో ఉన్న గృహాల యజమానులు తమ ఆదాయ వనరుగా మార్చుకున్నారు. పలువురు గృహాల యజమానులు వసతి తీసుకునే భక్తులకు ఇష్ట మైన ఆహారాన్ని తయారు చేసి అందిస్తున్నారు. ఆహారంతో కలిసి అద్దెలు వసూలు చేస్తారు.

ఇరుకుగా వీధులు..

ఆలయ పరిసరాల్లో రోడ్లు ఇరుగ్గా ఉంటాయి. ఒక కారు వెళ్తే మరో వాహనం వచ్చేందుకు మార్గం ఉండదు. అటువంటి చోట 100కిపైగా లాడ్జిలు, వసతి సముదాయాలను నిర్మించారు. కొన్ని సందుల్లోకి ద్విచక్ర వాహనాలు మినహా ఆటోలు వెళ్లలేవు. కాశీ తరహాలో ఇక్కడ వీధులు కనిపిస్తాయి. అటువంటి వాతావరణం ఉభయ గోదావరి జిల్లాలోని పిఠాపురంలోని శ్రీపాదశ్రీవల్లభ మహాసంస్థానం వద్ద కనిపిస్తోంది. దీనివల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా 1500 మందికి పైగా ఉపాధి కలుగుతోందని పలువురు తెలిపారు. ఇక్కడ వసతిగృహాలు, లాడ్జిలకు ఉన్న డిమాండ్‌తో స్థలాల రేట్లు గణనీయంగా పెరిగాయి. ఇక్కడ సెంటు స్థలం ప్రస్తుతం రూ.30 లక్షల నుంచి రూ.50 లక్షల వరకూ ఉంది.కొందరు సినీ ప్రముఖులు ఇక్కడ స్థలాలు కొనుగోలు చేశారు. వారు కొంత పెద్దస్థాయిలో హోటళ్లు నిర్మించాలని భావిస్తున్నట్టు సమాచారం.

ఇక్కడ కొబ్బరికాయ కొట్టరు..

శ్రీపాదశ్రీవల్లభుడికి కొబ్బరికాయ కొట్టరు. శ్రీపాదుడు కొలువై ఉన్న ఆలయ ప్రాంగణంలోని ఔదంబర వృక్షానికి కొబ్బరికాయలను కట్టి వేలాడతీసి చుట్టూ ప్రదిక్షణలు చేసి కోర్కెలు నెరవేర్చమని వేడుకుంటారు.కోర్కెలు నెరవేరిన తర్వాత మళ్లీ శ్రీపా దశ్రీవల్లభుడిని దర్శించుకుని పూజలు చేస్తారు.

భక్తులకు వసతి.. ఎందరికో ఉపాధి

శ్రీపాదశ్రీవల్లభ మహాసంస్థానానికి భక్తులు అధికంగా తరలివస్తున్నారు. భక్తులకు ఇబ్బంది లేకుం డా ఆలయ పరిసరాల్లో గృహ యజమానులు తమ ఇళ్లనే వసతి సముదాయాలుగా మార్చి అద్దెకు ఇస్తున్నారు. భక్తులకు దగ్గరలో వసతి లభిస్తోంది.

-పెనుగొండ కొండలరావు, విశ్రాంత సాంఘిక సంక్షేమ శాఖాధికారి, పిఠాపురం

టెంపుల్‌ సిటీగా అభివృద్ధి చేయాలి

పిఠాపురంను టెంపుల్‌ సిటీగా అభివృద్ధి చేస్తే భక్తులకు మెరుగైన సౌకర్యాలు,వసతి లభిస్తా యి. ప్రభుత్వం పర్యాటకాభివృద్ధిలో భాగంగా హౌస్‌ స్టే కల్పిస్తున్న గృహ యజమానులను ప్రోత్సాహించాలి. డిప్యూటీ సీఎం పవన్‌ చొరవ చూపాలి.

- తోట ఏడుకొండలు, విశ్రాంత అర్బన్‌ బ్యాంకు ఉద్యోగి, పిఠాపురం

Updated Date - Aug 03 , 2025 | 12:16 AM