ఐఆర్‌ఎస్ కాదు.. ఐఏఎస్ నా కల!
ABN , Publish Date - Apr 28 , 2025 | 01:07 AM
కష్టేఫలి అన్నారు పెద్దలు.. ఆ మాటకు అచ్చు గుద్దినట్టు సరిపోతాడు ఈ చిత్రంలో కనిపి స్తున్న యువకుడు.. ఐఏఎస్ సాధించాలన్నది అతని కల. అయితే రెండు సార్లు తప్పినా ఒప్పుకోలేదు.. మూడో సారి ప్రయత్నించారు.. 274 ర్యాంక్ సాధించాడు.

ఐఏఎస్ వచ్చే అవకాశం తక్కువ
మళ్లీ ఐఏఎస్‌కు ప్రయత్నిస్తా
సివిల్స్ ర్యాంకర్ వినయ్
కొవ్వూరు, ఏప్రిల్ 27 (ఆంధ్రజ్యోతి) : కష్టేఫలి అన్నారు పెద్దలు.. ఆ మాటకు అచ్చు గుద్దినట్టు సరిపోతాడు ఈ చిత్రంలో కనిపి స్తున్న యువకుడు.. ఐఏఎస్ సాధించాలన్నది అతని కల. అయితే రెండు సార్లు తప్పినా ఒప్పుకోలేదు.. మూడో సారి ప్రయత్నించారు.. 274 ర్యాంక్ సాధించాడు.ఆదివారం స్వగ్రామం కొవ్వూరు చేరుకున్నాడు. ఈ మేరకు పలువురు అభినందనలు తెలిపారు. కొవ్వూరుకు చెందిన డి.జగదీశ్వరరావు విద్యుత్‌శాఖలో కొవ్వూరు పట్టణ ఏఈగా పనిచేస్తున్నారు.తల్లి దుర్గ గృహిణి. జగదీశ్వరరావు పెద్ద కుమారుడు సాయి సంతోష్ జర్మనీలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. చిన్నకుమారుడు దొమ్మేటి వినయ్ పశ్చిమ బెంగాల్‌లోని దుర్గాపూర్ ఎన్‌ఐ టీలో బీటెక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. చిన్నతనం నుంచి సివిల్స్ సాధించాలనే కల ఉండడంతో సాఫ్ట్‌వేర్ వైపు చూడలేదు. బీటెక్ పట్టా అందుకున్న వెంటనే సివిల్స్ ప్రయత్నాలు ఆరంభించాడు. మూడు సార్లు ప్రయత్నం చేశాడు. 2022 తొలి ప్రయత్నంలో ప్రిలిమ్స్, మెయిన్స్‌లో అర్హత సాధించినా, ఇంటర్వ్యూలో స్వల్ప మార్కులతో చేజారిపోయింది.రెండో సారి అదే పరిస్థితి. మూడో సారి పొలిటికల్ సైన్సు అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ విభాగంలో ప్రయత్నించి 274వ ర్యాంకు సాధించాడు. ఈ ర్యాంక్‌కు ఐఆర్‌ఎస్ వస్తుందని.. ఐఏఎస్ సాధించాలనే నా కలను మరో ప్రయత్నంలో నెరవేర్చుకుంటానని తెలిపాడు. లయన్స్ క్లబ్ అధ్యక్షుడు మద్దిపాటి సత్యనారాయణ, జొన్నలగడ్డ శ్రీనివాస్, ముళ్ళపూడి కాశీ విశ్వనాథ్, కొవ్వూరు రూరల్, గోపాలపురం విద్యుత్ శాఖ ఏఈలు సిహెచ్.శ్రీనివాసరావు, దూసనపూడి శ్రీనివాస్, జేఈ కె.వి.వి.సత్యనారాయణ, మొగళ్ళపు వెంకట్రావు తదితరులు అభినందనలు తెలిపారు.