Pawan Kalyan: గత ప్రభుత్వం ఛీత్కారాలను మర్చిపోయారా.. డిప్యూటీ సీఎం పవన్ పేషీ..
ABN , Publish Date - May 24 , 2025 | 05:45 PM
Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది కావస్తున్నా తెలుగు సినిమా సంఘాల ప్రతినిధులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని మర్యాదపూర్వకంగా కలిశారా అని పవన్ పేషీ ప్రశ్నించింది.

తెలుగు చిత్ర పరిశ్రమపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కార్యాలయం సంచలన ప్రకటన విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది కావస్తున్నా.. తెలుగు సినిమా సంఘాల ప్రతినిధులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని మర్యాదపూర్వకంగా కలిశారా అని పవన్ పేషీ ప్రశ్నించింది. గత ప్రభుత్వం సినిమా రంగంవారిని, అగ్ర నటులను ఛీత్కరించిన తీరును గుర్తు చేసింది. ఇకపై ప్రభుత్వంతో వ్యక్తిగత చర్చలు ఉండవని, సినిమా సంఘాల ప్రతినిధులే రావాలని స్పష్టం చేసింది. ఇంకా ఆ ప్రకటనలో ఏముందంటే..
‘ కూటమి ప్రభుత్వం వ్యక్తులను కాదు.. సినిమా రంగం అభివృద్ధినే చూస్తుంది. ఏపీలో తెలుగు సినిమా రంగానికి పరిశ్రమ హోదా కల్పించి, అభివృద్ధి చేయాలని.. ఈ రంగంలో ఉన్నవారి గౌరవమర్యాదలకు భంగం వాటిల్లకుండా చూస్తుంటే.. తెలుగు సినీ రంగంలో ఉన్నవారికి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం పట్ల కనీస మర్యాద, కృతజ్ఞత కనిపించడం లేదు. ఎన్.డి.ఏ. కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది కావస్తున్నా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని తెలుగు సినిమా సంఘాలు కనీసం ఒకసారి కూడా మర్యాదపూర్వకంగా కలవలేదు.
కేవలం తమ చిత్రాల విడుదల సందర్భంలో ప్రభుత్వం ముందుకు రావడం మినహా, చిత్ర రంగం అభివృద్ధి కోసం సంఘటితంగా రాలేదు. అందరూ కలసి రావాలి అని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సూచించినా సానుకూలంగా స్పందించలేదు. తెలుగు సినిమా రంగంలోని అగ్ర నటులను, సాంకేతిక నిపుణులను గత ప్రభుత్వం ఛీత్కరించి.. ఇక్కట్ల పాలు చేసిందో తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి, నిర్మాతల మండలి, మూవీ ఆరిస్ట్స్ అసోసియేషన్ లాంటి సంఘాలు మరిచిపోయినట్లున్నాయి.
రూ.కోట్ల రూపాయల పెట్టుబడులతో రూపొందే చిత్రాలకు అన్ని విధాలా ప్రోత్సాహం ఇవ్వడంతోపాటు, సృజనాత్మకత ముడిపడిన ఈ వ్యాపారంలో ఉన్నవారి గౌరవ మర్యాదలకు భంగం వాటిల్లకూడదు. గత ప్రభుత్వం వ్యక్తులను చూసి పనులు చేసేది. కక్ష సాధింపులకు దిగేది. తమకు నచ్చనివారి సినిమాల విడుదల సమయంలో తహసీల్దార్లను థియేటర్ల దగ్గర నియమించి ఎన్ని ఇబ్బందులుపెట్టిందో నిర్మాతలు మరచిపోతే ఎలా? ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చెప్పిన విధంగానే కూటమి ప్రభుత్వం వ్యక్తులను చూడలేదు.
అక్కినేని నాగార్జున కుటుంబానికి చెందినవారి చిత్రం విడుదలైనప్పుడు సైతం ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తగిన విధంగా ప్రోత్సహించింది. వ్యవస్థ బాగుండాలి, దానిపై ఆధారపడ్డవారు ఇబ్బందిపడకూడదు అనేదే కూటమి ప్రభుత్వ విధానం. తెలుగు సినిమా రంగంవారు తమ సినిమా విడుదల సమయంలో వ్యక్తిగతంగా వచ్చి అర్జీలు ఇచ్చి, టిక్కెట్ ధర పెంచమని కోరడం ఎందుకు.. అందరూ కలసి వచ్చి ప్రభుత్వంతో స్పష్టంగా చర్చించమని పవన్ కల్యాణ్ గారు సూచించారు.
దిల్ రాజు, అల్లు అరవింద్, డి.సురేశ్ బాబు, వై.సుప్రియ, చినబాబు, సి.అశ్వనీదత్, నవీన్ ఎర్నేని తదితర నిర్మాతలు కలిసినప్పుడు అందరూ సంఘటితంగా ఉంటే పరిశ్రమగా అభివృద్ధి చేయవచ్చు అని కూడా చెప్పారు. అయినా ఎవరికి వారు వ్యక్తిగతంగా వచ్చి తమ సినిమాలకు టికెట్ ధరలు పెంచమని సినిమాటోగ్రఫీ శాఖకి అర్జీలు ఇస్తూ వచ్చారు. సినిమా రంగానికి పరిశ్రమ హోదా ఇచ్చేందుకు ఆలోచనలు చేస్తున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్.. తెలుగు సినిమాకి చెందిన కొందరు ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్‌ను కూడా తగిన విధంగానే స్వీకరించాలని నిర్ణయించుకున్నారు‘ అని పేర్కొంది.
ఇవి కూడా చదవండి
Vijayawada Durgamma: దుర్గగుడిలో భక్తుల రద్దీ.. కీలక నిర్ణయం తీసుకున్న EO
Husband And Wife: సెల్ఫోన్లో పాటలు.. సౌండ్ తగ్గించమన్నందుకు భార్యపై దారుణం..