Share News

Dalit MLAs: వర్గీకరణతో ఎస్సీలకు సువర్ణాధ్యాయం

ABN , Publish Date - Mar 18 , 2025 | 05:05 AM

రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణకు సీఎం చంద్రబాబు నేతృత్వంలోని మంత్రిమండలి ఆమోదం తెలపడంపై దళిత ఎమ్మెల్యేలు హర్షం వ్యక్తం చేశారు.

Dalit MLAs: వర్గీకరణతో ఎస్సీలకు సువర్ణాధ్యాయం

సీఎంకు దళిత ఎమ్మెల్యేల ధన్యవాదాలు

అమరావతి, మార్చి 17(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణకు సీఎం చంద్రబాబు నేతృత్వంలోని మంత్రిమండలి ఆమోదం తెలపడంపై దళిత ఎమ్మెల్యేలు హర్షం వ్యక్తం చేశారు. ఎస్సీ వర్గీకరణ ద్వారా దళిత జాతికి సువర్ణ అధ్యాయం ప్రారంభమౌతుందని అన్నారు. ఎస్సీ వర్గీకరణకు కేబినెట్‌ ఆమోదం తెలిపినందుకు సోమవారం రాష్ట్ర సచివాలయంలో సీఎం చంద్రబాబును టీడీపీ దళిత ఎమ్మెల్యేలు అయితాబత్తుల ఆనందరావు, ఎమ్మెస్‌ రాజు, కొలికపూడి శ్రీనివాస్‌, బూర్ల రామాంజనేయులు, నెలవల విజయశ్రీ తదితరులు కలిసి ధన్యవాదాలు తెలిపారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. ‘ఎస్సీ వర్గీకరణపై మంత్రివర్గ నిర్ణయాన్ని అందరం స్వాగతిస్తున్నాం. భవిష్యత్‌లో దళితుల అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలకు మద్దతు మా ఉంటుంది. కూటమి ప్రభుత్వంలోనే ఎస్సీల్లో అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుంది’ అని ఆనందరావు అన్నారు. ‘30 ఏళ్ల పోరాటం ఫలించింది. వర్గీకరణపై ఏకసభ్య కమిషన్‌.. మాలమాదిగ ప్రజాప్రతినిధులు, ప్రజల అభిప్రాయం తీసుకుని ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. ఈ నివేదికను కేబినెట్‌ ఆమోదించింది.


దళితులకు రాజ్యాధికారంలో గౌరవం ఇస్తూ టీడీపీ ముందుకొచ్చింది’ అని ఎమ్మెస్‌ రాజు అన్నారు. ‘అంబేడ్కర్‌ ఆశయాలకు అనుగుణంగా ఎస్సీ వర్గీకరణకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఎస్సీ వర్గీకరణతో రాష్ట్రంలో అన్ని షెడ్యూల్‌ కులాలకు సామాజిక న్యాయం జరుగుతుంది’ అని కొలికపూడి శ్రీనివాస్‌ చెప్పారు. చంద్రబాబు విజన్‌తోనే ఎస్సీల అభివృద్ధి సాధ్యమని రామాంజనేయులు చెప్పారు. ఎస్సీ మహిళగా వర్గీకరణను మనస్పూర్తిగా స్వాగతిస్తున్నానని నెలవల విజయశ్రీ అన్నారు.

Updated Date - Mar 18 , 2025 | 05:05 AM