Illegal Liquor Shops: ‘బెల్టు’పై ఉక్కుపాదం
ABN , Publish Date - Jun 23 , 2025 | 04:26 AM
వైసీపీ హయాంలో ఇష్టారాజ్యంగా సాగిన మద్యం వ్యవహారాలను కూటమి ప్రభుత్వం కట్టడి చేస్తోంది. ఎక్కడపడితే అక్కడ మద్యం అమ్మేవారిపై గట్టి నిఘా పెట్టింది.

కూటమి పాలనలో ఎక్సైజ్‌శాఖ పటిష్ఠ నిఘా
10 వేల కేసులు నమోదు
ఎమ్మార్పీ ఉల్లంఘనలపై చర్యలు
65 లక్షల జరిమానా విధింపు
ఎస్‌టీఎఫ్ నమోదు చేసినవే ఎక్కువ
ఎమ్మార్పీ ఉల్లంఘనలపై చర్యలు
65 లక్షల జరిమానా విధింపు
(అమరావతి-ఆంధ్రజ్యోతి): వైసీపీ హయాంలో ఇష్టారాజ్యంగా సాగిన మద్యం వ్యవహారాలను కూటమి ప్రభుత్వం కట్టడి చేస్తోంది. ఎక్కడపడితే అక్కడ మద్యం అమ్మేవారిపై గట్టి నిఘా పెట్టింది. బెల్టు షాపులపై తరచూ దాడులకు దిగుతూ దూకుడు ప్రదర్శిస్తోంది. ఫలితంగా నూతన మద్యం పాలసీ అమల్లోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటివరకూ ఒక్క బెల్టు షాపులపైనే 10 వేలకుపైగా కేసులు నమోదుచేసింది. గతేడాది అక్టోబరు 16న నూతన మద్యం పాలసీ అమల్లోకి వచ్చింది. అప్పటి నుంచి ఏప్రిల్ నెలాఖరు వరకు బెల్టు షాపులపై 9,882 కేసులను ఎక్సైజ్ శాఖ నమోదుచేసింది. అత్యధికంగా శ్రీకాకుళం జిల్లాలో 874, విజయనగరంలో 648, నెల్లూరులో 664 కేసులు నమోదయ్యాయి.
బెల్టు షాపుల్లో పట్టుబడిన మద్యం సీసాలు ఏ అధికారిక షాపుల నుంచి వచ్చాయో గుర్తించి వాటిపైనా జరిమానాలు విధిస్తున్నారు. అలా 28 అధికారిక షాపులను లింక్ చేసి, రూ.42.61 లక్షల జరిమానాలు విధించారు. విశాఖపట్నంలో రూ.3.75 లక్షలు, తూర్పుగోదావరిలో రూ.8.25 లక్షలు, కాకినాడలో రూ.6లక్షలు, పశ్చిమగోదావరిలో రూ.లక్ష, ఏలూరులో రూ.9.5 లక్షలు, కృష్ణాలో రూ.1.41 లక్షలు జరిమానాలు విధించారు. ఎమ్మార్పీ ఉల్లంఘనలపై తక్కువ కేసులే నమోదయ్యాయి. అక్టోబరు 16 నుంచి ఏప్రిల్ నెలాఖరు వరకు తొమ్మిది షాపులపై ఎమ్మార్పీ కేసులు నమోదవగా, వాటిలో ఏడు షాపులను సస్పెండ్ చేశారు. అనకాపల్లి, ఉభయ గోదావరి, కాకినాడ, శ్రీసత్యసాయి జిల్లాల్లో ఎమ్మార్పీ కేసులు పెట్టి రూ.23లక్షల జరిమానాలు విధించారు.
కొన్ని జిల్లాల్లో అధికారులపై ఒత్తిడి..
ఎక్సైజ్ స్టేషన్లు, జిల్లా టాస్క్‌ఫోర్స్, రాష్ట్ర టాస్క్‌ఫోర్స్ ఇలా వేర్వేరు విభాగాలు కేసులు నమోదు చేస్తుంటాయి. బెల్టులు, ఎమ్మార్పీ ఉల్లంఘనల కేసుల్లో అత్యధిక శాతం రాష్ట్ర టాస్క్‌ఫోర్స్(ఎ్‌సటీఎఫ్) విభాగమే నమోదు చేసింది. దీంతో స్థానికంగా జిల్లాల అధికారులు కూడా ఎక్కువ తనిఖీలు నిర్వహించేలా ఒత్తిడి పెరుగుతోంది. కొన్ని జిల్లాల్లో స్థానిక అధికారులు ఉల్లంఘనలను పూర్తిగా గాలికొదిలేస్తున్నారు. ఫలితంగా ఆ ప్రాంతాల్లో స్థానికంగా కేసులు నమోదు కావట్లేదు. వాటిపై అందుతున్న ఫిర్యాదులతో ఎస్‌టీఎఫ్ విభాగం కేసులు పెడుతోంది. పలుచోట్ల కేసులు నమోదు చేయకుండా ఎక్సైజ్ అధికారులపై రాజకీయ నాయకులు ఒత్తిడి చేస్తున్నారు. కొన్ని జిల్లాల్లో కేసులు పెట్టిన అధికారులను దూషిస్తున్న ఘటనలూ ఉన్నాయి. దీంతో అక్రమాలు జరుగుతున్నా కొన్ని జిల్లాల అధికారులు మౌనం దాలుస్తున్నారు.
మొదటిసారి కేసుతోనే జాగ్రత్త..
కూటమి ప్రభుత్వం మద్యం ఉల్లంఘనలపై కఠిన శిక్షలు అమల్లోకి తీసుకొచ్చింది. అందులో భాగంగా బెల్టులు, ఎమ్మార్పీ ఉల్లంఘనలు నమోదైతే ఆ షాపుల లైసెన్సీలు రూ.5 లక్షల జరిమానా చెల్లించాలి. రెండోసారి కేసు నమోదైతే లైసెన్స్ రద్దవుతుంది. అందువల్ల మొదటిసారి కేసు నమోదైన లైసెన్సీలు జాగ్రత్త వహిస్తున్నారు. భారీగా పెట్టుబడి పెట్టి దక్కించుకున్న లైసెన్స్.. కేసుల కారణంగా కోల్పోతే చాలా నష్టం వస్తుందనే ఆలోచనతో జాగ్రత్త పడుతున్నారు.
అతితెలివితో బార్‌కోడ్, హోలోగ్రామ్ తొలగింపు..
బెల్టు షాపులు నిర్వహిస్తున్న అక్రమార్కులు అతి తెలివి ప్రదర్శిస్తున్నారు. ఫలితంగా మద్యం దొరికినా ఏ షాపునూ అనుసంధానం చేయలేని పరిస్థితి ఏర్పడుతోంది. ప్రతి మద్యం సీసాపై బార్‌కోడ్, హోలోగ్రామ్ ఉంటాయి. వాటిని స్కాన్ చేస్తే ఆ మద్యం సీసా ఏ షాపు నుంచి వచ్చిందో తెలిసిపోతుంది. ఎక్సైజ్ అధికారులు అలా సంబంధిత షాపులను అనుసంధానం చేసి వాటిపైనా కేసులు పెడుతున్నారు. ఇలా షాపులు దొరక్కుండా హోలోగ్రామ్‌లు, బార్‌కోడ్‌లు ముందుగానే తొలగిస్తున్నారు. దీంతో సీసాలు దొరికినా అవి ఎక్కడినుంచి వచ్చాయో కనిపెట్టడం ఎక్సైజ్‌కు కష్టంగా మారుతోంది. దీంతో పట్టుబడిన బెల్టు నిర్వాహకులపైనే కేసులు నమోదుచేసి వదిలేస్తున్నారు.